న్యూఢిల్లీ: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుక్రవారంనాడు పలువురు కీలక విపక్ష నేతలకు ఫోను చేశారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నామినేషన్ వేయడానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia gandhi), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి ద్రౌపది ముర్ము ఫోన్ చేశారు. ముగ్గురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేసినట్టు ఎన్డీయే వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ద్రౌపది ముర్ము తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆమె నామినేషన్ వేశారు. ఆమె నామినేషన్‌కు ప్రధాని మోదీ తొలుత ప్రపోజ్ చేయగా, రాజ్‌నాథ్ సింగ్ బలపరిచారు. రెండో సెట్ ప్రపోజర్స్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మూడవ సెట్ ప్రపోజర్స్‌లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాలుగో సెట్ ప్రపోజర్స్‌లో గుజరాత్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, బిజూ జనతాదళ్ నేతలు కూడా ఆమె నామినేషన్‌కు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే నేతలు ఓ.పన్నీర్ సెల్వం, ఎం.తంబిదురై, జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ప్రతి సెట్ నామినేషన్‌కు 50 మంది ప్రపోజర్లు, 50 మంది బలపరిచిన వారు ఉన్నారు.