ఉపాధి పనుల్లో పర్యవేక్షకులు కరువు!

ABN , First Publish Date - 2020-05-23T09:36:15+05:30 IST

ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో ఉపాధి హామీ పనుల నిర్వహణకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతున్నాయి. మరో వైపు ఈ బాధ్యతలు

ఉపాధి పనుల్లో పర్యవేక్షకులు కరువు!

ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేక పనుల నిర్వహణలో ఇబ్బందులు

బాధ్యతలు మాకొద్దంటున్న పంచాయతీ కార్యదర్శులు

అస్తవ్యస్తంగా జరుగుతున్న పనులు 


అక్కన్నపేట, మే 22: ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో ఉపాధి హామీ పనుల నిర్వహణకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతున్నాయి. మరో వైపు ఈ బాధ్యతలు తమకొద్దంటూ పంచాయతీ కార్యదర్శులు డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లదే కీలక పాత్ర. పొమ్మనలేక పొగ పెట్టిన చందంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు కొత్త విధులను పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో వారు సమ్మెకు వెళ్లగా ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించి, ఉపాధి పనుల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది.


పంచాయతీ కార్యదర్శులు ఉపాధి పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే పరిస్థితి కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు సొంతూళ్లకు తిరిగొచ్చారు. దీంతో ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించింది. ఈ నేపథ్యంలో వారికి పని కల్పించడం, మస్టర్‌ నిర్వహణ, వేతనాలు జనరేట్‌ చేయడం, పనుల మంజూరు వంటి అంశాలను గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చూసేవారు. ఫీల్డ్‌లో కూలీల హాజరు కూడా వారే తీసుకునేవారు. ప్రస్తుతం ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శికి ఆ పనులన్నింటినీ అప్పగించారు. కానీ, వారు ఉపాధి పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదు. ఈ అదనపు బాధ్యతలు తాము చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-05-23T09:36:15+05:30 IST