సీమలో ప్రేమ కథల ‘కరువు’

ABN , First Publish Date - 2020-12-28T10:18:15+05:30 IST

‘భిన్న కోణాల సీమ ప్రేమ కథ’ పేరుతో డా. కె. శ్రీదేవిగారు రాసిన వ్యాసం (వివిధ 30.11.2020) సీమ ప్రేమ కథలపై అందరి దృష్టి పడే విధంగా...

సీమలో ప్రేమ కథల ‘కరువు’

‘భిన్న కోణాల సీమ ప్రేమ కథ’ పేరుతో డా. కె. శ్రీదేవిగారు రాసిన వ్యాసం (వివిధ 30.11.2020) సీమ ప్రేమ కథలపై అందరి దృష్టి పడే విధంగా చేసింది. అలాంటి కథలు తక్కువ రావడానికిగల కారణాలుగా ఇక్కడి భూస్వామ్య ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, అస్తిత్వ కారణాలు మొదలైనవాటిని పేర్కొన్నారు. అలాగే వారసత్వంగా వస్తున్న పద్య సాహిత్యం; భక్తి, భావవాదం కలగలిసిన సంప్రదాయ కవిత్వం; సీమ కరువు... వీటిని కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. లేచిన దగ్గరి నుంచి ప్లాస్టిక్‌ బిందెలు తీసుకొని సైకిలుపై నీళ్ళు తెచ్చుకునే పరిస్థితిలో పుట్టే ప్రేమ భౌతికమైనదిగానే ఉంటుందితప్ప, నాగరికతలో ముందున్న కోస్తాంధ్ర సాహిత్యంలోలాగ ప్రేమనే ఒక వస్తువుగా తీసుకో వడం చాలామంది సీమ రచయితలకు అందలేదనే చెప్పాలి. 


ఈమధ్య సీమలో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పరువు హత్యలను కథావస్తువుగా తీసుకొని సీమ కథకులు కథలు రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సంవత్సరాల క్రితం కాశీభట్ల వేణుగోపాల్‌ గారి కథ జ్ఞాపకమొస్తోంది. అది ఓ విఫల ప్రేమికురాలికి సంబంధిం చింది. ఒకరిని ప్రేమించి ఇంట్లోవాళ్ళ బలవంతం వల్ల ఇంకొ కరితో ఇష్టంలేని పెళ్ళి చేసు కొని తాను భౌతికంగా మాత్రమే సంసారం చేస్తున్నానని, మానసికంగా కాదని కథానాయకి చెబుతుంది. తనకిష్టంలేని కందగడ్డ కూర ఎలా వండిందో ఇదీ అంతేనంటుంది.


ప్రపంచీకరణ పుణ్యమా అని ఉన్నత చదువులు పెరిగాయి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి స్వేచ్ఛగా తిరిగి చదువుకునే ప్రొఫెషనల్‌ కోర్సులు వచ్చాక, ప్రపంచం ఒక కుగ్రామ మైపోయాక, వివిధ దేశాల్లో తొడిగిన ప్రేమ సాఫల్యమై ఎందరో ప్రేమ వివాహాలు చేసుకు న్నారు. కాని ఆ ప్రేమని కథలుగా మలచడంలో రచయితలు కొంత వెనకపడ్డం వాస్తవమే. కవిత్వంలో ప్రేమ ఎక్కువగానే వచ్చిన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.


ఇప్పటిదాకా ఈ ప్రాంత రచయితలు రాసిన లభ్యమైన కథలే కాకుండా ఇంకా గాలించ వలసిన అవసరం ఉంది. పరిశోధక విద్యార్థులు వారి పర్యవేక్షకులు ఈ అంశంపై శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. 

జంధ్యాల రఘుబాబు

98497 53298


Updated Date - 2020-12-28T10:18:15+05:30 IST