అంతర పంటలకు మంగళం!

ABN , First Publish Date - 2020-05-27T09:48:31+05:30 IST

కరువు జిల్లా అన్నదాతకు అంతర పంటలతో అంతరం పెరిగింది. సబ్సిడీ అంతర పంటల విత్తనాలు దూరం ..

అంతర పంటలకు మంగళం!

అన్నదాతకు దూరమౌతున్న సబ్సిడీ అంతర పంటల విత్తనాలు

ఈసారి కంది మాత్రమే ఇవ్వాలని నిర్ణయం

మిగిలిన విత్తనాలు కేటాయింపులతో సరిపెట్టిన వైనం


అనంతపురం వ్యవసాయం, మే 26: కరువు జిల్లా అన్నదాతకు అంతర పంటలతో అంతరం పెరిగింది. సబ్సిడీ అంతర పంటల విత్తనాలు దూరం కానున్నాయి. జిల్లాలో అంతర పంటల విత్తనాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. ఏటా వేరుశనగతోపాటు అంతర పంటల విత్తనాలు పంపిణీ చేస్తుండేవారు. ఈసారి వేరుశనగ, కంది విత్తనాల పంపిణీకే పరిమితం కావటం శోచనీయం. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వచ్చే అంతర పంటల సాగును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించటం విస్మయం కలిగిస్తోంది. 


జిల్లాలో ఏటా ఎక్కువ శాతం వేరుశనగ సాగు చేసి, వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించాలంటే వేరుశనగతోపాటు అంతర పంటల సాగును విరివిగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏటా అంతర పంటల విత్తనాలను సబ్సిడీపై అందించటంతో రైతులు కొద్ది మేరయినా సాగు చేస్తున్నారు. ఈసారి సబ్సిడీని పూర్తిగా ఎత్తేయటంతో ఏం చేయాలో తోచని అయోమయంలో రైతులు పడ్డారు.


కంది ఒక్కటే..

ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 6.83 లక్షల హెక్టార్లుగా వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. ఇందులో అత్యధికంగా వేరుశనగ 4.60 లక్షల హెక్టార్లు, కంది 53 వేలు, మిగిలిన విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, ఉలవలు,పెసలు, అలసంద తదితర ప్రత్యామ్నాయ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్‌కు జిల్లాకు 3.34 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ, 9వేల క్వింటాళ్ల అంతర పంటలు, చిరుధాన్యాల విత్తనాలు కేటాయించారు.


ఇందులో కంది 6 వేలు, మొక్కజొన్న 1582, జొన్న 41, సజ్జ 16, రాగి 185, కొర్ర 225, అరిక 45, సామలు 30, అండ్రు కొర్రలు 40, పెసలు 67, జీలుగ 251 క్వింటాళ్లు, మరో 518 క్వింటాళ్లు పలు రకాల అంతర, చిరుధాన్యాల పంటల విత్తనాలు కేటాయించారు. జిల్లాకు అంతర పంటల విత్తనాలు కేటాయించటంతోనే ప్రభుత్వం సరిపెట్టింది.


వేరుశనగతోపాటు కంది విత్తనాలు మాత్రమే సబ్సిడీతో ఇవ్వాలని తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. కంది విత్తనాల సబ్సిడీ ధరను ఖరారు చేసినట్లు తెలిసింది. క్వింటాల్‌ కంది పూర్తి ధర రూ.8275గా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో 30 శాతం సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది.


ఇప్పటిదాకా అధికారికంగా ఉత్తర్వులు అందలేదు. ఉత్తర్వులు వచ్చాకే కంది విత్తనాలు తెప్పించి, పంపిణీ చేయాలన్న యోచనలో ఏజెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన అంతర పంటల విత్తనాలకు సబ్సిడీ ఎత్తేయటంతో వాటి సేకరణను పక్కన పెట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో కరువు రైతులు సబ్సిడీతో అందించే అంతర పంటల విత్తనాలకు దూరమయ్యారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి, తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. మరి పాలకులు ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.

Updated Date - 2020-05-27T09:48:31+05:30 IST