పడకేసిన పశువైద్యం

ABN , First Publish Date - 2022-05-06T04:59:43+05:30 IST

జిల్లాలో పశువైద్యం పడకేసింది. పశువైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది.

పడకేసిన పశువైద్యం


  • వైద్య సిబ్బంది కొరతతో ఇబ్బందులు
  • ప్రైవేట్‌ వైద్యులను ఆశ్రయిస్తున్న పశు పోషకులు
  • జిల్లాలో ఖాళీగా దర్శనమిస్తున్న 102 పోస్టులు

జిల్లాలో పశువైద్యం పడకేసింది. పశువైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. మూగజీవాలే కదా..! బతికినా.. చచ్చినా... ప్రశ్నించేవారెవరు అన్న తీరులో వైద్య సేవలు జరుగుతున్నాయి. వైద్య సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు సరైన వైద్యం అందకుండా పోతుంది. రోగాల బారినపడిన పశువులకు అటెండర్లు, గోపాలమిత్రల వైద్యమే దిక్కవుతోంది. కొన్ని పశువైద్య శాలల్లో డాక్టర్లే లేరు.. ఉన్నచోట సమయపాలన పాటించడం లేదు. దీంతో పశుపోషణపై ఆధారపడిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

రంగారెడ్డి అర్బన్‌, మే 5 : జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతోపాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. పశువైద్యశాలల్లో కొంతకాలంగా పోస్టుల భర్తీకి నోచుకోకపోవడంతో మూగజీవాలకు సరైన వైద్యం అందటం లేదు.  జిల్లాలో నాలుగు (తాలుక స్థాయి) ప్రాంత పశువైద్య శాలలు, 46 పశువైద్య కేంద్రాలు, 87 గ్రామీణ పశువైద్య కేంద్రాలున్నాయి. మొత్తం 309మంది పశువైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా 207మంది ఉన్నారు. 102 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

రైతులకు పాడి, పంట రెండు కళ్లలాంటివి. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. రైతులు ప్రాణం కన్న ఎక్కువగా ఆశలు పెట్టుకుని కన్న కొడుకులా సాదుకునే పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కు లేదు. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన పశువులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడక తప్పడం లేదు. సీజనల్‌ వ్యాధుల ప్రబలి పశువులు మృతి చెందుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోని వివిధ మండలాల్లో పశువైద్యం, పశువుల పరిస్థితి, వ్యాధుల పరిస్థితి అధ్వానంగా మారుతుంది. ఏటా వర్షాల సమయంలో పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర జంతువులు వ్యాధుల బారిన పడుతోన్నాయి. పశువులకు జబ్బు చేసినప్పుడు పశు వైద్యశాలలో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్యం అందటం లేదు. పవువైద్యశాలల్లో సిబ్బందితో పాటు మందుల కొరత, ఆధునిక పరికరాలు లేకపోవడంతో మూగజీవాల పోషకులు ప్రైవేట్‌బాట పడుతున్నారు. ఈ పరిస్థితి షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కేశంపేట, చౌదరిగూడ, కొందుర్గు మండలాల్లో కనిపిస్తోంది. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో పశు వైద్య ఉప కేంద్రం ఉంది. వైద్య సిబ్బంది లేకపోవడంతో రెండు మూడేళ్లుగా తెరుకోవడం లేదు. అలాగే ఎక్లా్‌సఖాన్‌పేటలో గోపాలమిత్రలపై ఆధారపడి వైద్యం చేయించుకుంటున్నారు. నిర్ధవెల్లిలో ఒకేఒక లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ ఉన్నాడు. కానీ.. ఆఫీసు వర్క్‌లోడ్‌ ఎక్కువ కావడంతో వైద్యం అందించడం లేదు. కొండారెడ్డిపల్లిలో అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. కొత్తపేటలోని వైద్యుడు ఉన్నప్పటికీ.. అతను ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. నందిగామ మండలం మేకగూడ పశువైద్యం డాక్టర్‌ విష్ణువర్ధన్‌గౌడ్‌ కొందుర్గు ఇన్‌చార్జి డాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరా్‌సపల్లి, శ్రీరంగపురంలో వైద్య సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ గోపాల మిత్రలు వైద్యం అందిస్తున్నారు. 

చేవెళ్ల మండలకేంద్రంలో పశుసంవర్ధకశాఖ ఏడీ కార్యాలయం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్నాళ్లకే చేవెళ్లలోని ఏడీ కార్యాలయాన్ని వికారాబాద్‌కు తరలించారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలన్నీ నిరుపయోగంగా మారాయి. దీంతో ఎస్టీవో కార్యాలయానికి పక్కా భవనం లేకపోవడంతో ఆ కార్యాలయాన్ని పశువైద్య భవనంలోకి మార్చారు. చేవెళ్ల పార్లమెంట్‌ హెడ్‌క్వాటర్‌లో ఉండాల్సిన ఏడీ కార్యాలయం ఇతర ప్రాంతానికి తరలించినా.. పాలకులు చూస్తూ ఉన్నారే తప్ప పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డి చొరవచూపి ఏడీ కార్యాలయాన్ని తిరిగి చేవెళ్లకు వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 

వైద్యులను సర్దుబాటు చేసి సకాలంలో వైద్యం అందిస్తున్నాం

వైద్య సిబ్బంది కొరత ఉన్న ప్పటికీ.. సర్దుబాటు చేస్తు న్నాము. పశు వులకు సకాలంలో మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుం టు న్నాము. జిల్లాలో కేశంపేట, కొం దుర్గు, చౌదరిగూడెం మం డలాల్లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేస్తుంది. త్వరలో వైద్య సిబ్బంది కొరత తీరనుంది. 

                                                                                            - అంజిలప్ప, 

                                                                                జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

పశువులకు వైద్యం అందటం లేదు

పశువులకు మెరుగైన వైద్యం అందటం లేదు. డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. ఆవులు అనారోగ్యానికి గురైతే గోపాల మిత్రను ఆశ్రయించాను. ఒక్కో గోపాల మిత్రకు 5 నుంచి 10 గ్రామాలు ఉన్నాయి. దీంతో అతనికి ఫోన్‌ చేస్తే రెండు రోజులకు వచ్చాడు. ఆవులకు వైద్యం అందించాడు. చాలావరకు ప్రైవేట్‌ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తుంది. 

                                                                                 - శివమోని శేఖర్‌, నిర్ధవెల్లి గ్రామ రైతు

                            పశువైద్య సిబ్బంది వివరాలు

సిబ్బంది          మొత్తం   పనిచేస్తున్నవారు ఖాళీలు

జిల్లా పశువైద్యాధికారి           01 01         00

సహాయ సంచాలకులు                   06 06         00

పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు     48 46         02

వెటర్నరీ లైవ్‌స్టాక్‌ ఆఫీసర్‌           16 16         00

జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌           31 31         00

లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌           53 16         37

వెటర్నరీ అసిస్టెంట్‌           37 35         02

ఆఫీస్‌ సబార్డినేటర్స్‌         117 56         61

మొత్తం         309 207         102

Read more