ఎలా బతికేది?

ABN , First Publish Date - 2021-03-03T04:27:00+05:30 IST

త్యావసరాల ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. రోజురోజుకు ధరల పెరుగుదలతో చుక్కలు కనిపిస్తున్నాయి.

ఎలా బతికేది?




చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలు

పెట్రోల్‌, డీజిల్‌దీ అదే తీరు

సామాన్యులపై పెను భారం

కుటుంబ జీవనం కష్టతరం

(పార్వతీపురం)

నిత్యావసరాల ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. రోజురోజుకు ధరల పెరుగుదలతో చుక్కలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవనం కష్టతరంగా మారుతోంది. నెలరోజుల కిందట లీటరు పామాయిల్‌ ధర రూ.95 ఉండగా...ఇప్పుడు రూ.115కు పెరిగింది. మినపగుళ్లు రూ.110 ఉండగా.. ఇప్పుడు రూ.130కు ఎగబాకింది. పప్పుల ధరలు చెప్పనసరం లేదు. కందిపప్పు గతంలో రూ.90 ఉండగా.. ప్రస్తుతం రూ.120కుపైగా పలుకుతోంది. ఇలా నిత్యావసరాల ధరలు వినియోగదారులకు షాక్‌ ఇస్తున్నాయి. కనీస అవసరాలుగా ఉండే పప్పులు, నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో సామాన్యులపై భారం పడుతోంది. సాధారణంగా ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబంలో నెలవారీ సరుకుల భారం అమాంతం పెరిగింది. పెద్ద కుటుంబమైతే రూ.5 వేలు దాటిపోతోంది.


కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి

ఉల్లిపాయల ధరలు ప్రజలకు కన్నీరు పెట్టిస్తున్నాయి. ధర ఆకాశన్నంటుతుండడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. కొద్దిరోజుల కిందట వరకూ 3 కిలోల ఉల్లిపాయలు రూ.100కు విక్రయించే వారు. ఇప్పుడు కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. పంట లేకపోవడమే ధర ల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు పంట సీజన్‌ జనవరితో ముగియడంతో మహారాష్ట్ర పంటపైనే ఆశలు పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన వరదలకు అక్కడి పంటలను రైతులు పూర్తిగా నష్టపోయారు. తాజాగా వేసిన పంట ఉత్పత్తి ప్రారంభం కాలేదు. దీంతో ఉల్లి కొరత ధరల పెరుగుదలకు కారణమైంది. 


నూనె ధరలూ అంతే...

సంక్రాంతి ముందు నుంచే పామాయిల్‌, వేరుశెనగ, సన్‌ఫ్లవర్‌ వంటనూనెల ధరలు పెరిగాయి. జిల్లాలో ఎక్కువగా సన్‌ఫ్లవర్‌, వేరుశెనగ నూనె ఉపయోగిస్తారు. ఆయిల్‌ ఉత్పత్తులు ఎక్కువగా విదేశాల నుంచి దిగుమవతి అవుతుంటాయి. కేంద్రం విధించే పన్నులు తగ్గిస్తున్నప్పటికీ, అక్కడి కంపెనీలు మాత్రం సుంకాన్ని పెంచేస్తున్నాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వంటనూనెల కు సంబంధించిన పంటలకు కేంద్రం రాయితీలు ఇవ్వకపోవడం, నూనె వినియోగం బాగా పెరుగుతుండటంతో ముడిసరుకును ఉత్పత్తి చేసే దేశాలు సుంకాలను పెంచేస్తున్నాయి. గతంలో ఈ నూనెలపై సబ్సిడీలు ఉండేవి. వాటిని కేంద్రం రద్దు చేసింది. ఇప్పుడు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు. 


వాహనదారులపై పెట్రో భారం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. వాహనదారులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం కనిపిస్తోంది. వాహనాల వినియోగం పెరిగింది. కానీ అంతర్జాతీయంగా చమురు సంస్థలు ధరను పెంచుతున్నాయని సాకుగా చూపి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎడాపెడా పెంచుకుపోతున్నారు. పెట్రోలు ధర లీటర్‌ రూ.100కు చేరువ కావడం వాహనదారులపై పెనుభారం పడుతోంది. జనవరిలో లీటరు పెట్రోల్‌పై రూ.2.30, డీజిల్‌పై రూ.2.75 పెరగ్గా, ఫిబ్రవరిలో పెట్రోల్‌పై రూ.4.63, డీజిల్‌పై రూ.5.05 మేర పెరిగాయి. గత నెల 23 నాటికి లీటరు పెట్రోల్‌ ధర రూ.96.70, డీజిల్‌ ధర రూ.90.34గా ఉంది. మరోవైపు డీజిల్‌ ధర పెంపు లారీ పరిశ్రమ మనుగడపై పడుతోంది. జిల్లాలో సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. కానీ పెరుగుతున్న డీజిల్‌ ధరతో నిర్వహణ కష్టమని యాజమాన్యాలు చెబుతున్నాయి.   



Updated Date - 2021-03-03T04:27:00+05:30 IST