Abn logo
May 21 2020 @ 00:50AM

వారిని వదలండి

కాలం నిలువునా చీలిపోయిందని, కరోనాకు ముందు, కరోనా తరువాత అని మున్ముందు చెప్పుకోవాలని, అనేవాళ్లు ఎక్కువయ్యారు. అటువంటి అభిప్రాయం చమత్కారం అయినంతగా, వాస్తవం కాకపోవచ్చు. తప్పనిసరిగా కరోనా విపత్తు అన్నది ఒక ముఖ్యఘట్టం, శతాబ్దానికి ఒకసారో రెండుసార్లో మాత్రమే వచ్చేలాంటి అరుదైన విపత్తు. కాలం కరోనాఘట్టం గుండా ప్రవహిస్తున్నది. కరోనా కంటె ముందు ప్రపంచం ఎంతటి అసమానంగా, అన్యాయంగా, అమానుషంగా ఉన్నదో కరోనా కాలంలోనూ ఆ తరువాతా కూడా ఉండబోతున్నది. కరోనా కంటె ముందు ప్రపంచం ఎంతటి అందంగా, ఆహ్లాదంగా, మానవీయంగా, సున్నితంగా, కళాత్మకంగా ఉన్నదో ఇప్పుడూ రేపూ కూడా ఉండబోతున్నది. 


కరోనా కలిగించిన వేదాంతాలూ వైరాగ్యాలూ పూర్తి నిజాలేమీ కావు. గతంలోని కక్షలూ కార్పణ్యాలూ ఎవరూ వదల లేదు. మారుమనసు పొంది మహర్షులై పోలేదు. ఇదే అదననుకుని సరిహద్దుల్లో చిచ్చు లేపేవారు, భౌతిక దూరం తుపాకులకు వర్తించదని కూంబింగులూ యాంబుష్‌లూ చేసేవారూ, ప్రపంచయుద్ధానికి పావులు కదిపేవారూ, లాక్‌డౌన్‌ నిశ్శబ్దంలో స్వావలంబనను, విదేశీపెట్టుబడులను రెంటినీ నిర్వహించేవారూ, రాష్ట్రాల చాప కిందికి నీరు తేవడానికి వ్యూహరచన చేసేవారూ – అందరూ కనిపిస్తూనే ఉన్నారు. మధ్యతరగతి గృహనిర్బంధంలోను, కష్టజీవులు రోడ్డుమీదా అష్టకష్టాలు పడుతున్నవేళ, గుట్టు చప్పుడు కాకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు జరిగిపోతున్నాయి. 


కరోనా, కట్టడి కలిగించిన కలవరాల మధ్య సతమతమవుతున్న సమాజం, తన పాతగాయాలను, కొనసాగుతున్న వేదనలను స్మరించుకోవడానికి కూడా కుదరలేదు. అటువంటి వేదనాభరితమైన పాత గాయం– కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధంలో అనేక మంది ఆలోచనాపరులు, ఆచరణశీలురు మగ్గిపోవడం. ఆదివాసీలలో పనిచేసే సామాజిక కార్యకర్తలను, హక్కుల ఉద్యమకారులను, కవిరచయితలను, ప్రజాహితం కోసం పనిచేసే మేధావులను, తీవ్రమైన నిర్బంధచట్టాల కిందా, అత్యంత తీవ్రమైన ఆరోపణలతోనూ అరెస్టులు చేశారు. మహిళా ఉద్యమకార్యకర్త, రిటైర్డ్‌ ఇంగ్లీషు ప్రొఫెసర్‌ షోమా సేన్‌, మానవ హక్కుల న్యాయవాది, ప్రజాన్యాయవాదుల భారతీయ సంఘం ప్రధాన కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్‌, చత్తీస్‌గఢ్‌ గని కార్మికుల నేత, న్యాయవాది సుధా భరద్వాజ్‌, విప్లవరచయితల సంఘం సీనియర్‌ సభ్యుడు, కవి వరవరరావు, కాలమిస్టు, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమ కార్యకర్త వెర్మన్‌ గాన్‌సాల్వెస్‌ – వీరు 2018 లోనే అరెస్టు కాగా, హక్కుల వాది, కాలమిస్టు, ఇపిడబ్ల్యు ఎడిటోరియల్‌ కన్సల్టంట్‌ అయిన గౌతమ్‌ నవ్‌లఖా, గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌, రచయిత, మేధావి ఆనంద్‌ తేల్‌తుంబ్డే – ఈ ఇద్దరూ ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి నాడు కోర్టు ఆదేశం మేరకు పోలీసులకు లొంగిపోవలసివచ్చింది.


తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ప్రజాసంఘాల కార్యకర్తలను అతి తీవ్రమైన ‘‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం– ఊపా’’ కింద నిర్బంధించారు. కవి, రచయిత, పత్రికాసంపాదకుడు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుడు, తెలంగాణ ఉద్యమకారుడు అయిన సి. కాశిం కూడా ఈ క్రమంలోనే నిర్బంధానికి లోనయ్యారు. నాలుగు నెలల నిర్బంధం తరువాత ఆయనకు బెయిల్‌ దొరికింది. ప్రజాస్వామిక వాదులకు ఇది కొంత ఊరట. ఇంకా అనేకమంది ప్రజాసంఘాల వారు నిర్బంధంలోనే ఉన్నారు. బీమా కోరేగావ్‌ కేసులో మాత్రం నిర్బంధితులకు కనీస ఊరట కూడా దొరకడం లేదు. విప్లవకవి వరవరరావు వయస్సు 80 సంవత్సరాలు. ఇంకా అనేకులు పెద్ద వయస్కులు ఉన్నారు. వారి పెద్దవయసు, కరోనా కాలంలో వారికి ఉన్న ప్రమాదం– ఏవీ కూడా తాత్కాలిక బెయిల్‌/ పెరోల్‌ ఇవ్వడానికి సమర్థనలు కాలేకపోతున్నాయి.


దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులే కాక, ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌ కూడా బహిరంగంగా నిరసన తెలిపినా కేంద్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. మహారాష్ట్రలో ప్రభుత్వం మారి, ఈ మేధావుల విషయంలో ఉదారత చూపాలని ఆలోచిస్తున్న సమయంలో కేంద్రం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధీనంలోకి తీసుకున్నది. జైళ్లు మారుస్తున్నారు కానీ, వెసులుబాటు ఇవ్వడం లేదు. మహారాష్ట్ర జైళ్ల నుంచి వేలాదిమంది ఖైదీలను, కరోనా విపత్తు కారణంగా, తాత్కాలిక పెరోల్‌ మీద విడుదల చేశారు కానీ, ఆ వెసులుబాటు వీరికి వర్తించడం లేదు. వరవరరావు వయస్సును, తెలంగాణ సమాజానికి ఆయన చేసిన ప్రజాస్వామిక దోహదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఆయనకు బెయిల్‌ ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేయాలి. 


విచారణలో ఉన్న ఖైదీలు వరవరరావును, ఆయన సహచరులను మాత్రమే కాక, దేశవ్యాప్తంగా జైళ్లలో మిగిలిన రాజకీయ ఖైదీలను అందరినీ విడుదల చేయాలి. వికలాంగుడు, ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు సాయిబాబా శిక్షా కాలంతో నిమిత్తం లేకుండా, ఆయన దుస్థితిని పరిగణనలోకి తీసుకుని విడుదల చేయడం ప్రభుత్వం ధర్మం. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కరోనా విపత్తు సందర్భంగా ఎటువంటి వివక్షా లేకుండా ఖైదీలను వదిలివేశారు. అదే మార్గంలో భారతదేశమూ నడవాలి. ఈ సమయంలో కూడా కక్షలూ కార్పణ్యాలూ కూడదు. 


ప్రభుత్వాలు ఎక్కడికీ పోవు, ఈ మేధావులూ ఎక్కడికీ పారిపోరు. ఈ కట్టడి కాలంలో వారు చేయగలిగే రాజద్రోహమూ విప్లవమూ కూడా ఏమీ లేవు. వారి వారి అభిప్రాయాలు ఏమైనా, ఏకీభవించకపోయినా– వారు విలువైన మనుషులు. మేధావులు. వారికి నిర్బంధంలో హాని జరిగితే, భవిష్యత్తు క్షమించదు.


Advertisement
Advertisement