సస్యరక్షణలో డ్రోన్లు

ABN , First Publish Date - 2022-06-29T04:54:29+05:30 IST

తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయాన్ని బయటపడేయాలి.

సస్యరక్షణలో డ్రోన్లు
పంట పొలాలపై పిచికారి చేయడానికి సిద్ధంగా ఉన్న డ్రోన్‌

ఆర్‌ఏఆర్‌ఎ్‌సలో విస్తృత పరిశోధనలు  

ఖరీ్‌ఫలో పరిశీలనకు సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు  

6 గంటల్లో 30 ఎకరాల పంటకు పిచికారి 


తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయాన్ని బయటపడేయాలి. రైతులు సేద్యం చేసి ఉరేసుకొనే స్థితి మారాలి. దీనికి ఆఽధునిక వ్యవసాయం ఒక్కటే పరిష్కారం. దీని కోసం సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎ్‌స) ఈ రంగంలో గణనీయమైన విజయాలు సాధించింది. ఇందులో అతి ముఖ్యమైనది డ్రోన్లతో సస్యరక్షణ. దీని వల్ల ఉమ్మడి జిల్లా రైతులకు ప్రయోజనం కలగనుంది. 


-నంద్యాల టౌన్‌ 


వ్యవసాయంలో పాత పద్ధతులు మారాలి. అప్పుడే రైతులు కొత్త సవాళ్లను అధిగమించగలరు. ఈ దిశగా  వ్యవసాయ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వ్యవసాయంలో సస్యరక్షణ ఒక ముఖ్యమైన విషయం. ఇందులో కూలీల ఖర్చు భారీగా ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక ప్రత్యేకతల వల్ల రైతులు వ్యవసాయంలో ఇబ్బందుల్లో ఉన్నారు. సస్యరక్షణకు భారీగా ఖర్చు చేసి పెట్టుబడుల భారం కింద నలిగిపోతున్నారు. దీనికి పరిష్కారంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు డ్రోన్లను వినియోగించడానికి పరిశోధనలు చేస్తున్నారు. కొత్త వంగడాల రూపకల్పనలో, కొత్త వ్యవసాయ పనిముట్ల తయారీలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎ్‌సకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుసంధానంగా రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం కింద తక్కువ ఖర్చుతో డ్రోన్లను ఉపయోగించి, తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలోని పంటకు క్రిమిసంహారక మందులు స్ర్పే చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కీటక విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జె. మంజునాథ్‌ ఆధ్వర్యంలో డ్రోన్ల వినియోగంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. 


6గంటల్లో 30 ఎకరాలకు స్ర్పే 


డ్రోన్‌ వినియోగంతో ఏ సమయంలోనైనా, ఏ పంటకైనా సులభంగా స్ర్పే చేయవచ్చు. తక్కువ ఖర్చుతో.. అంటే ఒక కూలీకి ఇచ్చే  రూ.400తో ఒక ఎకరానికి  కేవలం 10నిమిషాల్లో స్ర్పే పూర్తి చేయవచ్చు. డ్రోన్లతో అన్ని రకాల పురుగు, కలుపు మందులు, ఆర్గానిక్‌ ద్రవణాలు, నీటిలో కరిగే ఎరువులను కూడ స్ర్పే చేయవచ్చు. కేవలం 6గంటల్లో 30ఎకరాల పంటకు స్ర్పే చేయవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణంగా ఎకరా పొలానికి పురుగు మందులు పిచికారి చేయాలంటే 200 లీటర్లు నీరు అవసరం. అయితే డ్రోన్‌ ద్వారా కేవలం 10నుంచి 14లీటర్ల నీరు మాత్రం సరిపోతుంది. ఏ పంట మీద అయినా సరే 2-3 అడుగుల ఎత్తులో పొలమంతా సమానంగా స్ర్పే చేయడం డ్రోన్‌లతోనే సాధ్యమని వెల్లడైంది. పిచికారిలో 95శాతం నీటిని, 95శాతం సమయాన్ని, 25-40శాతం మందు ద్రావకాన్ని ఆదా చేస్తూ, తద్వారా పెట్టుబడి ఖర్చును కూడ తగ్గించుకోవచ్చని రుజువైంది. మందు మోతాదు 4వంతు తగ్గడం వల్ల పర్యావరణానికి కలిగే కాలుష్యాన్ని కూడ నివారించవచ్చు. వరిలాంటి పంటల్లో కూడ సుడిదోమలాంటి మొండి పురుగులను డ్రోన్‌ పిచికారి ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చు. పురుగుల మందుల వాడకం ద్వారా రైతుల్లో వచ్చే అనారోగ్య సమస్యలు, దుష్ప ప్రభావాల నుంచి తప్పించవచ్చు. 


వచ్చే ఖరీఫ్‌ నుంచి పూర్తిస్థాయి పరిశీలనకు ఏర్పాట్లు 


వచ్చే ఖరీ్‌ఫలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగే అన్ని పంటల క్షేత్రస్థాయి పంట పొలాల్లో డ్రోన్‌ ద్వారానే పిచికారి చేయాలని నిర్ణయించారు. విస్తృత పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌లో సాగయ్యే వివిధ పంటలపై ఆశించే క్రిమి కీటకాల నివారణకు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, తక్కువ నీటితో పురుగు మందుల పిచికారి చేసి రైతుల్లో అవగాహన పెంచేందుకు శాస్త్రవేత్తలు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. 


డ్రోన్‌ ఎలా పని చేస్తుందంటే..


జీపీఎస్‌, ఆటో పైలెట్‌ సహాయంతో రిమోట్‌ ద్వారా లేదా ఎల్‌సీడీ మొబైల్‌లో అగ్రిమీట్‌ / అగ్రి అసిస్టెంట్‌ యాప్‌ ద్వారా ముందుగా పొలంపైన సెట్‌ చేసిన ఎత్తులో నిర్దిష్టమైన వేగంతో, నిర్దిష్టమైన దిశలో పిచికారి చేసేందుకు డ్రోన్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తారు. ప్రస్తుత మార్కెట్‌లో స్థాయిని బట్టి ఒక డ్రోన్‌ ధర రూ.3 నుంచి రూ.12 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. 12-16వేల ఎంఎహెచ్‌ లిథియం పాలిమార్‌ బ్యాటరీతో 10లీటర్ల డ్రమ్ము, ఒక జత బ్యాటరీతో డ్రోన్‌ బరువు 13 కేజీల వరకు ఉంటుంది. ఒకసారి ఒక జత బ్యాటరీతో ఒక ఎకరానికి కేవలం 10 నిమిషాల్లో పిచికారి పూర్తి చేయవచ్చు. సిగ్నల్‌ పోయిన, మందు ఆయిపోయాన, బ్యాటరీ తగ్గిపోయిన, పిచికారి పూర్తయినా డ్రోన్‌ మొదట ఉన్న చోటకే తిరిగి వస్తుంది. డ్రోన్‌ ద్వారా పిచికారి పూర్తి చేసినది, ఇంకా చేయాల్సింది, చేస్తున్న ప్రదేశాన్ని మొబైల్‌ యాప్‌లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో చూడవచ్చు. దీన్ని సులభంగా వినియోగించడానికి వీలుగా ఒక పైలెట్‌ (ఆపరేట్‌ చేయడానికి, ల్యాండింగ్‌, డ్రోన్‌ తప్పిపోకుండా శాస్త్రీయ శిక్షణ పొందిన వ్యక్తి) రీచార్జ్‌ చేస్తూ, బ్యాటరీలు మార్చడానికి ఒక వ్యక్తి, మ్యాపింగ్‌ చేయడానికి ఒక వ్యక్తి అవసరం. దీన్ని వినియోగించే వ్యక్తికి ప్రభుత్వ క్లియరెన్స్‌తో పాటు డీజీసీఏ వారి నుంచి అనుమతి తప్పనిసరి. 


రైతులకు ఎంతో ఉపయోగకరం


డ్రోన్‌ స్ర్పే రైతులకు ఎంతో మేలు చేస్తుంది. రైతులకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. డ్రోన్‌ వినియోగం ద్వారా పురుగు, తెగుళ్లు కనిపించిన వెంటనే పిచికారి చేసి వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొక్కలకు ఏమాత్రం నష్టం వాటిల్ల్లకుండా, పొలంలో దిగకుండా దూరం నుంచే సమర్థవంతంగా పిచికారి చేయవచ్చు. డ్రోన్‌తో పిచికారి వల్ల యువతకు కూడ ఉపాధి దొరుకుతుంది. పరిశోధనల ఫలితాలను విశ్వ విద్యాలయానికి నివేదించిన అనంతరం స్థానికంగా రైతులకు డ్రోన్‌ స్ర్పే సేవలను బాడుగ రూపంలో అందించే అవకాశం ఉంది. 


 - డాక్టర్‌ జె.మంజునాథ్‌, కీలక విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త, ఆర్‌ఏఆర్‌ఎస్‌, నంద్యాల

Updated Date - 2022-06-29T04:54:29+05:30 IST