పల్లెల్లో డ్రోన్‌ సర్వే

ABN , First Publish Date - 2022-05-05T06:51:14+05:30 IST

స్వామిత్వ (సర్వే ఆఫ్‌ విలేజేస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) ప్రాజెక్టు కింద జిల్లాలోని పెంబి, సారంగాపూర్‌ మండలాల్లో కార్స్‌ స్టేషన్‌ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

పల్లెల్లో డ్రోన్‌ సర్వే
పెంబి మండల కేంద్రంలో కార్స్‌ స్టేషన్‌ను గుర్తిస్తున్న సర్వే బృందం

సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కార్స్‌స్టేషన్‌ల గుర్తింపు 

జిల్లాలో రెండు మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ అమలు 

నివాస ఆస్తుల వివరాల నిర్ధారణ 

అందరికీ ప్రాపర్టీ కార్డుల జారీ 

పకడ్బందీగా పన్నుల వసూళ్లకు ప్రణాళిక 

నిర్మల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి) : స్వామిత్వ (సర్వే ఆఫ్‌ విలేజేస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) ప్రాజెక్టు కింద జిల్లాలోని పెంబి, సారంగాపూర్‌ మండలాల్లో కార్స్‌ స్టేషన్‌ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వ ర్యంలో ఈ స్వామిత్వ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పంచాయతీ రాజ్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖతో పాటు రెవెన్యూ శాఖలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయతలపెట్టాయి. డ్రోన్‌ టెక్నాలజీ సహకారంతో ఎంపిక చేసిన గ్రామాలను సర్వే చేయనున్నారు. దీని కోసం గానూ కార్స్‌ ( కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రేఫరెన్స్‌ స్టేషన్‌)లను ఎంపిక చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతీగ్రామంలోని నివాస ఆస్థుల వివరాలను పకడ్బందీగా నిర్ధారించనున్నారు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాత ప్రతీ ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు జారీ చేస్తారు. ఈ ప్రాపర్టీ కార్డులో గ్రామంలో నివాస, వాణిజ్య పరమైన ఆస్థుల వివరాలన్నీ ఇందులో అధికారికంగా నమోదవుతాయి. ఆస్థులను తనఖా పెట్టేందుకు గాని ఇతర సౌకర్యాలు పొందేందుకు గాని, బ్యాంకులోన్‌లు తీసుకునేందుకు గాని ఈ ప్రాపర్టీ కార్డులు ఉపయోగపడనున్నాయి. ప్రాపర్టీ కార్డులు లేని వారికి ఇక నుంచి గ్రామంలోని నివాసయోగ్యమైన ఆస్థులను అమ్ముకోవడం కష్టతరం కానుంది. ఓ రకంగా ఈ కార్డు ప్రతీ గ్రామస్థునికి ఆస్థిహక్కు కార్డుగా మారనుందంటున్నారు. ఏళ్ల నుంచి గ్రామంలోని నివాసానికి సంబంధించిన ఆస్థులు కేవలం గ్రామ పంచాయతీల రికార్డులకే పరిమితమవుతున్నాయి. దీంతో ఈ ఆస్థుల క్రయ విక్రయాలు గాని, ఈ ఆస్థుల పేరిట బ్యాంకు రుణాలు తీసుకునేందుకు గాని ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వివరాలన్నీ కేంద్రీకృతం కాని కారణంగా ఇంటి యజమానులకు ఎలాంటి సౌకర్యాలు అందే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం స్వామిత్వ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చి నివాస ఆస్థులను గుర్తిస్తోంది. దీని కోసం గానూ శాటిలైట్‌ సహకారంతో డ్రోన్‌ సర్వేలు చేపట్టనుంది. అయితే కీలకమైన చోట్ల కార్స్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసి ఈ స్టేషన్‌ ద్వారా అవసరమైన మేరకు సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు. 

ఇళ్లు, ఆస్తుల పక్కా గుర్తింపు

వ్యవసాయేతర స్థలాలు అనగా గ్రామంలోని ప్లాట్లు, ఇళ్ల వివరాలన్నింటిని స్వామిత్వ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకువస్తున్నారు. డ్రోన్‌ టెక్నాలజీతో గ్రామన్నంతటినీ అనువణువుగా గుర్తించి రికార్డుల్లో బంధించనున్నారు. దీని కోసం గానూ ప్రతీ ఇంటికి ఓ ప్రాపర్టీకార్డును అందించనున్నారు. ఈ కార్డుతో పాటు ఆన్‌లైన్‌లో రికార్డుల నమోదు కూడా పూర్తవుతోంది. ఇది ఓ రకంగా ఆస్థిహక్కు కార్డుగా చెబుతున్నారు. ఈ ఆస్థులపై ఇక నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది. దీంతో పాటు బ్యాంకు ద్వారా ఏదైనా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ద్వారా కూడా ఏదైనా పొందే అవ కాశం ఉందంటున్నారు. శాటిలైట్‌ సహకారంతో ఈ ప్రక్రియంతటిని సర్వే ఆఫ్‌ ఇండియా చేపట్టింది. 

ఇక జోరుగా రెవెన్యూ కనెక్షన్‌లు

స్వామిత్వ ప్రాజెక్టు జిల్లా అంతటా పకడ్భందీగా అమలైతే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల్లో ఆస్థిపన్ను రూపంలో ఆధాయం సమకూరుతోంది. మొత్తం గ్రామంలోని భూమిని, ఆ భూమిలో ఉన్న ఇంటి నిర్మాణాలను అలాగే ఇతర ఆస్థులను కూడా ఈ ప్రాజెక్టు కింద రిజిస్ర్టార్‌ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ కొత్తవిధానంతో ప్రభుత్వానికి మొత్తం ఆస్థుల విలువ తెలియడమే కాకుండా ఎవరెవరికి ఎంత మేరకు వ్యవసాయేతర ఆస్థులు ఉన్నాయన్న సమాచారం ఆన్‌లైన్‌లో తెలుసుకోనుంది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఇంటిపన్ను గాని, ఇతరపన్నులు గాని సక్రమంగా వసూలు కాకపోతుండడం  గ్రామీణ వ్యవస్థకు భారమవుతోంది. అయితే స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో ఇక నుంచి ఖచ్చితంగా రెవెన్యూ వసూళ్లను చేపట్టనున్నారు. ఆస్థుల క్రయ, విక్రయాలకు అలాగే బ్యాంకు రుణాలకు సైతం ఈ విధానం పూర్తిగా సహకరిస్తోందంటున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో రెవెన్యూ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలు మొత్తం ఈ పర్యవేక్షణకు సంబందించిన సమస్యలను తొలగించాల్సి ఉం టుంది. 

డ్రోన్‌ టెక్నాలజీ సహకారంతో..

ఇదిలా ఉండగా స్వామిత్వ ప్రాజెక్టు కోసం గ్రామాల్లోని ఇళ్లు, ఆస్థులను పకడ్బందీగా లెక్కించేందుకు సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు డ్రోన్‌ల సహకారం తీసుకుంటున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసే కార్స్‌ స్టేషన్‌ నుంచి డ్రోన్‌లతో గ్రామాల్లోకి ఉపయోగించనున్నారు. డ్రోన్‌ కెమెరాలు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి కొలతలతో పాటు చెల్లించాల్సిన పన్నును కూడా ఖరారు చేస్తోంది. దీంతో బిల్లు వసూళ్లకు కష్టాలు తప్పుతాయని గ్రామ పంచాయతీ వర్కర్లు భావిస్తున్నారు. ఈ కార్స్‌ స్టేషన్‌ల ద్వారా డ్రోన్‌ కెమెరాలు తాము సేకరించిన చిత్రాలు, ఇతర వివరాలను స్వామిత్వ ప్రాజెక్ట్‌ పరిధికి చేరుస్తోంది. దీంతో అధికారులు ఈ సమాచారాన్నంత క్రోడికరించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు. గత వారం రోజుల నుంచి నిర్మల్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యాన కార్స్‌ స్టేషన్‌లను గు ర్తిస్తున్నారు. మొత్తం సాటిలైట్‌ సహకారంతోనే ఈ ప్రక్రియ అంతా కొనసాగనుంది. అధికార యంత్రాంగం స్వామిత్వ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. 

Read more