Abn logo
Jul 16 2021 @ 06:55AM

alert: కశ్మీరులో మరో డ్రోన్ ప్రత్యక్షం

జమ్మూ: జమ్మూకశ్మీరులోని పాకిస్థాన్ సరిహద్దుల్లో గురువారం రాత్రి మరో డ్రోన్ ప్రత్యక్షమైంది. జమ్మూకశ్మీరులోని సాంబా జిల్లా హీరానగర్ సెక్టారులో గురువారం రాత్రి 8.45 గంటలకు డ్రోన్‌ను స్థానిక ప్రజలు గుర్తించారు. డ్రోన్ లభ్యంపై స్థానికులు కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమయ్యారు. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషను సమీపంలోనూ మరో డ్రోన్ కనిపించినట్లు జవాన్లు చెప్పారు. జమ్మూ వైమానిక కేంద్రం సమీపంలో వారం క్రితం డ్రోన్లు ప్రత్యక్షమైన నేపథ్యంలో జమ్మూ నగరంలో డ్రోన్ల విక్రయాలను నిషేధించారు. డ్రోన్లను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశారు. 

గత నెల 27వతేదీన జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషనుపై డ్రోన్ దాడి ఘటనలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ జవాన్లు గాయపడ్డారు. డ్రోన్ ద్వారా ఆర్డీఎక్స్, నైట్రేట్,ఐఈడీలను జార విడిచారని దర్యాప్తులో తేలింది. డ్రోన్లు వెలుగుచూడటంతో పాకిస్థాన్ సరిహద్దుల్లోని 3,500 కిలోమీటర్ల దూరంతోపాటు విమానాశ్రయాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. తాజాగా డ్రోన్లు కనిపించడంతో బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు.