కశ్మీరులో హింసకు కారణాలివే!

ABN , First Publish Date - 2021-10-17T18:43:36+05:30 IST

కశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొనకుండా పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది

కశ్మీరులో హింసకు కారణాలివే!

శ్రీనగర్ : కశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొనకుండా పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది. రాజకీయ లక్ష్యాల కోసం ముస్లింలపై కూడా దాడులు చేసేందుకు వెనుకాడటం లేదు. పర్యాటక రంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. కశ్మీరీలు కానివారిపై హింసను ప్రేరేపిస్తోంది. దీంతో ఇటీవల కశ్మీరు లోయలో హింసాత్మక సంఘటనలు పెరిగాయి. 


దేశ భద్రతకు సంబంధించిన అధికారులు మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో కశ్మీరీలు కానివారిపై దారుణాలు, హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయన్నారు. దీనికి కారణం నియంత్రణ రేఖ వెంబడి లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అక్రమంగా కశ్మీరులోకి చొరబడటం, ఈ ఉగ్రవాదులకు చైనా తయారీ పిస్తోళ్ళను డ్రోన్ల ద్వారా అందజేయడం అని చెప్పారు. వీరు ఈ తుపాకులను తీసుకుని, హిందువులు, సిక్కులు వంటి కశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకుని, చంపుతున్నారు. 


రాజౌరీ-పూంఛ్ సెక్టర్లలోని అడవుల గుండా ఉగ్రవాదులు కశ్మీరులోకి చొరబడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో చొరబడిన ఉగ్రవాదులతో కృష్ణఘాటి సెక్టర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు భారత సైనికులు అమరులయ్యారు. 


పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్లను నిరోధించగలిగే వ్యవస్థ లేకపోవడం వల్ల కశ్మీరులోకి అక్రమంగా అనేక తుపాకులు వచ్చినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-10-17T18:43:36+05:30 IST