ఇంటి ముందు కుప్పకూలిపోయిన వృద్ధుడు.. కాపాడిన డ్రోన్..టెక్నాలజీ అంటే ఇదీ..!

ABN , First Publish Date - 2022-01-08T02:18:36+05:30 IST

డ్రోన్ టెక్నాలజీ మానవ సమాజానికి ఎంత కీలకంగా మారిందో చెప్పే ఘటన ఇది! హఠాత్తుగా గుండె పోటు రావడంతో మరణం అంచులకు చేరుకున్న ఓ వృద్ధుడిని డ్రోన్ కాపాడిన ఘటన స్వీడెన్‌లో ఇటీవల చోటుచేసుకుంది. 71 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి తన ఇంటిముందు పేరుకున్న మంచు తొలిగిస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇదంతా గమనించిన..

ఇంటి ముందు కుప్పకూలిపోయిన వృద్ధుడు.. కాపాడిన డ్రోన్..టెక్నాలజీ అంటే ఇదీ..!

ఇంటర్నెట్ డెస్క్: డ్రోన్ టెక్నాలజీ మానవ సమాజానికి ఎంత కీలకంగా మారిందో చెప్పే ఘటన ఇది! హఠాత్తుగా గుండె పోటు రావడంతో మరణం అంచులకు చేరుకున్న ఓ వృద్ధుడిని డ్రోన్ కాపాడిన ఘటన స్వీడెన్‌లో ఇటీవల చోటుచేసుకుంది. 71 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి తన ఇంటిముందు పేరుకున్న మంచు తొలిగిస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అటువైపు నుంచి వెళుతున్న ఓ వైద్యుడు ఇదంతా గమనించి అతడిని సమీపించి.. అత్యవసర చికిత్సకు పూనుకున్నాడు. అదే సమయంలో..చుట్టుపక్కల వారిని అలర్ట్ చేసి..ఎంబులెన్స్‌కు కబురంపమన్నాడు. ఇంతలో అతడికి ఏదో శబ్దం వినిపించింది. తలపైకెత్తి చూస్తే.. డిఫిబ్రిల్లేటర్ మోసుకొస్తున్న ఓ డ్రోన్ కనిపించింది. వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని వైద్యుడు ఆందోళన చెందుతున్న సమయంలో డ్రోన్ కనిపించడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. అంబులెన్స్‌కు కబురు పంపిన మూడు నిమిషాల్లోనే డ్రోన్ ప్రత్యక్షమైంది.


కాగా.. డిఫిబ్రిల్లేటర్ సాయంతో వృద్ధుడికి అత్యవసర చికిత్స అందించడంతో ఆయన బతికిబట్టకట్టాడు. మరుసటి రోజు ఆయన భార్య జరిగిన ఉదంతం చెప్పడంతో  ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. కాగా.. స్థానిక కొరిలిన్కా ఇన్‌స్టిట్యూట్..స్వీడెన్ అత్యవసర విభాగం భాగస్వామ్యంతో ఈ డ్రోన్లను నిర్వహిస్తోంది. అత్యవసర చికిత్సల్లో డ్రోన్ల వినియోగంపై స్వీడెన్‌లో ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. గుండెపోటు కేసులకు సంబంధించి 14 సందర్భాల్లో బాధితులకు సహాయం చేసేందుకు అక్కడి అధికారులు 12 సార్లు డ్రోన్ల సహాయం తీసుకున్నారు. ఈ క్రమంలో నాలుగు సందర్భాల్లో డ్రోన్లు అంబులెన్స్ కంటే ముందే బాధితుల వద్దకు చేరుకున్నాయి. భవిష్యత్తులో డ్రోన్ల సేవలు మరింత కీలకం కానున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2022-01-08T02:18:36+05:30 IST