కశ్మీరంలో బ్రూస్‌లీ.. ద్రోణాచార్య అందుకున్న వూషూ మాస్టర్!

ABN , First Publish Date - 2020-09-10T00:51:18+05:30 IST

మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించని భారతదేశంలో ఆయన మాత్రం ఈ కళకు జీవితం అంకితం చేశారు.

కశ్మీరంలో బ్రూస్‌లీ.. ద్రోణాచార్య  అందుకున్న వూషూ మాస్టర్!

చండీగఢ్: మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించని భారతదేశంలో ఆయన మాత్రం ఈ కళకు జీవితం అంకితం చేశారు. పాతికేళ్లుగా పిడికిళ్లను నమ్ముకొని, తనలానే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి కలిగిన యువతకు మార్గదర్శకుడిగా మారారు. ఈ కృషి చూసిన భారత ప్రభుత్వం క్రీడాశాఖలో కోచ్‌లకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ద్రోణాచార్య అవార్డుతో ఆయన్ను గౌరవించింది. ఆయనే వూషూ విభాగంలో ద్రోణాచార్య అవార్డు అందుకున్న కశ్మీరీ కుల్దీప్ హాండూ. ఇంకో గొప్ప విషయమేంటంటే.. జమ్మూకశ్మీర్ రాష్ట్రం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి కోచ్ కుల్దీపే.


కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చండీగఢ్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న కుల్దీప్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వర్చువల్‌గా ద్రోణాచార్య అవార్డు అందించారు. ఈ అవార్డు అందుకోవడాన్ని తన జీవితంలో లభించిన అత్యుత్తమ గౌరవంగా కుల్దీప్ అభివర్ణించారు. అవార్డు అందుకున్న క్షణం తాను, తన కుటుంబం ఎన్నో ఏళ్లుగా కన్న కలలు సాకారమైనట్లు ఆయన చెప్పారు. తనకు ఈ అవార్డు లభించడంలో తల్లి ఫూలా హాండూ, తండ్రి జవహర్‌ లాల్ హాండూల పాత్ర చాలా ఉందని తెలిపారు. తనకోసం తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని, కష్టకాలంలో కూడా తన ఆశయాల వెంట పరిగెత్తే ధైర్యాన్ని వారిద్దరూ ఇచ్చారని వెల్లడించారు.


కశ్మీరీ పండిట్ కుటుంబంలో పుట్టిన కుల్దీప్ చదువులో ఎప్పుడూ ముందుండేవారు. అయితే పాకిస్తాన్‌తో మిలటరీ చర్యల కారణంగా కుల్దీప్ చిన్నతనంలోనే హాండూ కుటుంబం జమ్మూకు పారిపోవాల్సి వచ్చింది. దీంతో వాళ్లు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అప్పటి వరకు సుఖంగా గడిచిపోయిన జీవితాలు కష్టాల బాటపట్టాయి. ఆ సమయంలోనే తన మిత్రుడి ప్రోత్బలంతో మార్షల్ ఆర్ట్స్‌ వైపు కుల్దీప్‌ దృష్టి మరలింది. తన కష్టాలు, బాధలు మర్చిపోవడానికి ఈ కళ చాలా ఉపయోగపడిందని కుల్దీప్ అన్నారు. తొలుత కోచ్ విశాల్ శర్మ వద్ద తైక్వాండో నేర్చుకున్నారు. తైక్వాండోలో రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి, ఆ ఆనందంలో మెడల్ మెడలో వేసుకొని ఆరు కిలోమీటర్లు పరిగెత్తి ఇంటికెళ్లినట్లు కుల్దీప్ గుర్తుచేసుకున్నారు. జీవితంలో తొలిసారి సాధించిన మెడల్ కావడంతో అప్పుడు తాను చాలా ఎగ్జయిట్ అయినట్లు చెప్పారు. ఆ తర్వాత కుల్దీప్ ప్రయాణం వూషూ వైపు సాగింది. 1995లో మిజోరాం వేదికగా జరిగిన 6వ జాతీయ వూషూ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచారు. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం కుల్దీప్‌కు రాలేదు.


ప్రస్తుతం జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కుల్దీప్.. తనకు అవార్డు రావడానికి భార్య భవనీత్‌ కూడా చాలా కష్టపడిందని చెప్పారు. తను ఇంట్లో లేకపోయినా తన తల్లిదండ్రులను, కుమారుడు భావ్‌కుల్‌ను భార్య చాలా శ్రద్ధగా చూసుకుందని, ఆమె వల్లే తన దృష్టి మొత్తం వూషూపై పెట్టగలిగానని వివరించారు. మిత్రుడి ప్రోద్బలంతో మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులు వేసిన తనకు బ్రూస్‌లీ చిత్రాలు ఎంతో ప్రేరణనిచ్చేవని చెప్పారు. ఈ సినిమాలు చూసిన తర్వాతే తైక్వాండోపై దృష్టి పెట్టినట్లు గుర్తుచేసుకున్నారు. దేశంలో వూషూను మరో స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని కుల్దీప్ అన్నారు. 25ఏళ్ల కెరీర్‌లో జాతీయ స్థాయిలో 11 స్వర్ణపతకాలు, అంతర్జాతీయ స్థాయిలో 6 మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన స్థానికంగా ఉన్న చాలామందికి వూషూ, తైక్వాండోల్లో శిక్షణ ఇస్తున్నారు. చిన్నపిల్లల నుంచి యువకుల వరకూ అందరూ కుల్దీప్ వద్ద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు.

Updated Date - 2020-09-10T00:51:18+05:30 IST