చినుకు.. వణుకు!

ABN , First Publish Date - 2021-06-18T05:35:55+05:30 IST

జిల్లా అంతట విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నప్పటికి మరో వైపు సీజనల్‌ వ్యాధులు కలవరపెడుతున్నాయి.

చినుకు.. వణుకు!
ఇటీవల కురుస్తున్న వర్షాలకు చిత్తడిగా మారిన గ్రామీణ రోడ్లు

- గత వారం రోజులుగా జిల్లాపై కమ్ముకున్న ముసురు
- వర్షాలతో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు
- పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల బెడద
- ప్రజలు విష జ్వరాల భారిన పడే అవకాశం
- ఇప్పటికే కరోనా, ఇతర రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
- మురికివాడల్లో లోపిస్తున్న పారిశుధ్యం
- ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో వైద్యం అంతంత మాత్రమే


కామారెడ్డి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి):
జిల్లా అంతట విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నప్పటికి మరో వైపు సీజనల్‌ వ్యాధులు కలవరపెడుతున్నాయి. గత మూలు నెలల నుంచి కరోనా మహమ్మరితో భయం గుపెట్లో బతికిన పట్టణ, గ్రామీణ ప్రజలు ప్రస్తుతం విష జ్వరాలతో ఎక్కడ మంచాన పడుతామోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మారుమూల ప్రాంతాల ప్రజల సీజనల్‌ వ్యాధులభారీన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లా పరిధిలో దాదాపు వెనకబడిన ప్రాంతాలతో పాటు మురికి వాడలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ఆరోగ్యంపై పారిశుద్ద్యంపై స్థానిక ప్రజలకు అవగాహన లేకపోవడం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సీజనల్‌ వ్యాధులు, విష జ్వరాల భారిన పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. జిల్లా పరిధిలో ప్రతీ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆసుపత్రులు ఉన్నప్పటికి ప్రజలకు వైద్య సేవలు అంతంతా మాత్రంగానే అందుతున్నాయి. ఆసుపత్రులలో సరిపడా మందులు ఉన్నప్పటికి రోగం వస్తే మందు గోళి ఇచ్చేందుకు సరిపడా వైద్యులు సిబ్బంది లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా మహమ్మరి అన్ని రకాలుగా ప్రజలను నానా అవస్థలు పెడుతూ కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో ప్రజలు సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల భారీన పడకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావలసిన అవసరం ఎంతైన ఉంది.        
-గ్రామీణ, తాండా ప్రాంతాలలోనే ప్రబలుతున్నా విషజ్వరాలు
్డజిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు పీహెచ్‌సీలు అందుబాటులో ఉన్నప్పటికి ఆయా ప్రాంతాలలోని గ్రామీణ తాండాల ప్రాంతాలలో ప్రతి సంవత్సరం అధిక మొత్తం విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అరోగ్యం పట్ల స్థానిక పరిసరాలలో పారిశుద్ద్యం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. మారు మూల గ్రామాల తాండాలలో ప్రధానంగా పారిశుద్ద్యం లోపించడంతోనే డెంగ్యూ, మలేరియా, మెదడువాపు, భోదకాలు లాంటి వ్యాధులకు గురవుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలు సీజనల్‌ వ్యాధులకు గురైయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది. మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు వైద్య సేవలను అందించాల్సిన అవసరం యంత్రాంగంపై ఉంది.
-మందులు ఫుల్‌....సేవలు నిల్‌
జిల్లా పరిధిలోని జిల్లా,  ఏరియా ఆసుపత్రితో పాటు పీహెచ్‌సీలలో సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన మందు గోళీలు, వ్యాక్సిన్‌లు, అన్ని రకాలు మందులు గ్లూకోజ్‌లు అందుబాటులో ఉన్నప్పటికి రోగులకు వాటిని అందించేందుకు వైద్యులుకాని, సిబ్బందికాని లేకపోతున్నారు. కరోనా ప్రభావంతో ఉన్న సిబ్బంది సైతం ప్రస్తుతం వ్యాక్సినేషన్‌, పరీక్షలకు తమ సమయాన్ని కేటాయిస్తు బీజీగా మారిపోయారు. పట్టణాలతో పాటు గ్రామీణ, తాండాలలో అధిక మొత్తంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, విషజ్వరాల భారిన పడినవారే అధికంగా ఉంటున్నారు. వీరంతా ఏరియా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆసుపత్రులను అశ్రయిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో రోగాలను నయం చేసేందుకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఆ మందు గోళీలను ఏ పద్దతితో వాడాలో తెలిపెందుకు వైద్యులు, సిబ్బంది లేక ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. విష జ్వరాల భారిన పడే పేద ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సలు పోందేందుకు స్థోమత లేక ఆరకోర సేవలతో ప్రభుత్వ ఆసుపత్రులోని చిక్సిత పోందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు సరైన వైద్యం అందక ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఆసుపత్రులపై దృష్టి సారించి పూర్తి స్థాయి వైద్యులను, సిబ్బందిని నియమించి రోగులకు అన్ని రకాల మందులను సమయానికి అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.  
-పీహెచ్‌సీలలో ఇది పరిస్థితి:
జిల్లాలోని పీహెచ్‌సీలలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. ఈ ఆసుపత్రులకు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు సరైన వైద్యం అందటం లేదు. దాదాపు అన్ని పీహెచ్‌సీలలోని వైద్యులతో పాటు స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఏం కొరత తీవ్రంగానే ఉంది. అలాగే 50శాతం పీహెచ్‌సీలలో ల్యాబ్‌ టెక్నిషియన్‌లు, ఫార్మాసిస్టుల పోస్టులు పూర్తిగా ఖాళీలుగా ఉన్నాయి.కామారెడ్డి డివిజన్‌లోని 9 మండలాలకు కలిపి పట్టణంలో జిల్లా ఆసుపత్రి,  ప్రతీ మండలానికి పీహెచ్‌సీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 170 వరకు పడకలు ఉన్నాయి. ఆసుపత్రిలో వైద్య సేవలకు సంబంధించిన స్కానింగ్‌, ఎక్స్‌రే, ల్యాబ్‌లు పూర్తి స్థాయి వ్యాక్సిన్‌లు, మందులు ఉన్నప్పటికి వీటిని అందజేసేందుకు వైద్యులు సిబ్బంది అంతంతమాత్రంగానే ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో 17 వరకు మురికి వాడలు ఉన్నాయి. ఈమురికి వాడల్లో పారిశుద్ద్య సమస్య లోపించడం ఆరోగ్యం పట్ల స్థానిక ప్రజలకు అవగాహన లేకపోవడంతో అనారోగ్య పాలవుతున్నారు. ఈ మురికి వాడలో దొమలు, ఈగలు, పందులు స్వైర విహారం చేస్తుండటంతో వాటి భారిన పడుతూ విషజ్వరాల పాలవుతున్నారు.  తీరా వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తే సరైన వైద్యులు లేకపోవడంతో వైద్య చికిత్సలు అందటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇలా పట్టణం నుంచే కాకుండా డివిజన్‌ పరిధిలోని మండలాలు గ్రామలు తాండాల నుంచి రోగులు అధికంగానే వస్తుంటారు. వీరికి సైతం జిల్లా ఆసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందటం లేదని విమర్శలు ఉన్నాయి.
-అప్రమత్తం కావల్సిందే
జిల్లాలో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల భారీన పడే అవకాశం ఉండడంతో అప్రమత్తం కావలసిన భాద్యత జిల్లా యంత్రాంగం పై ఉంది. ఇప్పటికే కరోనా కట్టడి జిల్లా అధికారులుచేస్తున్న కృషికి ప్రజలు నుంచి మంచి ప్రశంసలే అందుతున్నాయి. ఇదే పద్దతిలో ప్రజలు విష జ్వరాల భారీన పడకుండా మారుమూల గ్రామాలు, తండాలలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఆయా శాఖల వారిగా ప్రణాళికలను సిద్దం చేయాలి. సిజనల్‌ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి ఆయా శాఖలకు చెందిన సిబ్బంది మండలాలు, గ్రామాలు, తండాలను పర్యటించాలి.

Updated Date - 2021-06-18T05:35:55+05:30 IST