కిడ్నాప్‌... చిత్రహింసలు

ABN , First Publish Date - 2021-03-08T05:10:29+05:30 IST

ఆర్థిక విభేదాలతో తన వద్ద పనిచేసే ఓ డ్రైవర్‌ను లారీ యజమాని కిడ్నాప్‌ చేసి రాత్రంతా తన ఇంట్లో నిర్బంధించాడు. కాళ్లు చేతులు కట్టేసి పైశాచికంగా దాడి చేయడమే కాకుండా ఆ దాడిని వీడియోగా చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కిడ్నాప్‌... చిత్రహింసలు
తేజ కుమార్‌ను విడిపించి తీసుకువస్తున్న ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ

లారీ డ్రైవర్‌కు ఓనర్‌ నరకం

రాత్రంతా నిర్బంధించి దాడి... వీడియోలో చిత్రీకరణ

విముక్తి కల్పించిన పోలీసులు


నెల్లూరు(క్రైం), మార్చి 7: ఆర్థిక విభేదాలతో తన వద్ద పనిచేసే ఓ డ్రైవర్‌ను లారీ యజమాని కిడ్నాప్‌ చేసి రాత్రంతా తన ఇంట్లో నిర్బంధించాడు. కాళ్లు చేతులు కట్టేసి పైశాచికంగా దాడి చేయడమే కాకుండా ఆ దాడిని వీడియోగా చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి సమాచారం మేరకు... నెల్లూరు రూరల్‌ మండలం ఆమంచర్ల సమీపంలోని మట్టెంపాడు గ్రామానికి చెందిన తేజకుమార్‌, నెల్లూరు డైకస్‌ రోడ్డుకు చెందిన శివ వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తేజ లారీ యజమానికి చెందిన రూ.40వేలను సొంత ఖర్చుకు వాడుకున్నాడు. యజమాని తిడతాడన్న భయంతో పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. శనివారం సాయంత్రం శివ, అతని అనుచరులు ఆరుగురు మట్టెంపాడు గ్రామానికి వెళ్లి ఇంట్లో ఉన్న తేజను బలవంతంగా మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని నెల్లూరుకు తీసుకువచ్చారు. కాళ్లు చేతులు కట్టి  ఓ గదిలో బంధించారు. రాత్రంతా దాడి చేశారు. ఆదివారం ఉదయం తేజ తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మంగమ్మలు లారీ యజమాని ఇంటి వద్దకు వెళ్లి తమ కుమారుడిని వదిలిపెట్టాలని ప్రాధేయపడినా యజమాని శివ కనికరించ లేదు. దీంతో వారు మీడియాను, పోలీసులను  ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తన సిబ్బందితో డైకాస్‌రోడ్డులోని శివ ఇంటికి వెళ్లి తేజను విడిపించారు. లారీ యజమాని, మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-08T05:10:29+05:30 IST