జాగ్రత్తగా నడపాలి

ABN , First Publish Date - 2020-10-23T10:41:19+05:30 IST

వాహన చోదకులకు భారీగా జరిమానాలు విధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.

జాగ్రత్తగా నడపాలి

వాహన చోదకులకు కొత్త నిబంధనలు 

అతిక్రమిస్తే భారీ జరిమానాలు

ప్రమాదాలు తగ్గించడానికే అంటున్న అధికారులు 


కర్నూలు, అక్టోబరు 22: వాహన చోదకులకు భారీగా జరిమానాలు విధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు బైక్‌ మొదలుకుని 7 సీటర్‌ కార్ల వరకు ఒక విధమైన జరిమానా, ఇతర వాహనాలకు మరింత ఎక్కువ జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాహన చోదకుల్లో ఎక్కువ మందికి డ్రైవింగ్‌పై అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. అదనంగా ఇరుకు రోడ్లు, సిగ్నల్స్‌ లేని రహదారులు వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ పెంచిన భారీ జరిమానాలతో తీవ్ర ఇబ్బందిపడే అవకాశం ఉంది.


కరోనా నేపథ్యంలో ఇటీవల గ్రామీణ ప్రాంతాల వారు కూడా వాహనాలు కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సు లేకున్నా, డ్రైవింగ్‌ అంతగా రాకున్నా రోడ్లపైకి వస్తున్నారు. కొత్త నిబంధనల నేపథ్యంలో వీరంతా ఇబ్బంది పడాల్సిందే.


జరిమానాలు ఇలా

వాహన చెకింగ్‌ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750

సమాచారం ఇవ్వడానికి నిరాకరించిస్తే రూ.750

అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5 వేలు

అర్హత కంటే తక్కువ వయసున్న వారికి వాహనం ఇస్తే రూ.5 వేలు 

డ్రైవింగ్‌ లైసెన్సు పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు 

రూల్స్‌కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు 

నిబంధనలకు విరుద్ధంగా వేగంగా వాహనం నడిపితే రూ.1000 

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌, లేదా ప్రమాదకర డ్రైవింగ్‌ చేస్తే రూ.10,000 

బైక్‌, కార్‌ రేసింగ్‌లో మొదటిసారి పాల్గొంటే రూ.5 వేలు, రెండో సారి రూ.10,000 

రిజిస్ర్టేషన్‌ లేకున్నా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకున్నా మొదటిసారి రూ.2వేలు, రెండోసారి రూ.5 వేలు

పర్మిట్‌ లేని వాహనాలు వాడితే రూ.10,000 

ఓవర్‌ లోడ్‌ వాహనాలకు రూ.20వేలు, ఆపై టన్నులు రూ.2 వేలు అదనంగా 

వాహనం బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40వేలు 

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు 

అనవసరంగా హారన్‌ మోగించినప్పుడు మొదటిసారైతే రూ.1000, రెండోసారి రూ.2 వేలు 

రూల్స్‌కి వ్యతిరేకంగా వాహనంలో మార్పు చేర్పులు చేసి తయారీ సంస్థలకు లేదా డీలర్లకు అమ్మితే రూ.లక్ష జరిమానా


ప్రమాదాలు తగ్గించడానికే..: వివేకానందరెడ్డి, ఉప రవాణా కమిషనర్‌, కర్నూలు

జరిమానా పెంచడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. కరోనా వల్ల ఇటీవల తనిఖీలు చేయడం లేదు. ఇకపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తాం. జిల్లాలో పన్నులు కట్టని వాహనాలు చాలానే ఉన్నాయి. వారంతా పన్నులు చెల్లించాల్సిందే. నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. 

Updated Date - 2020-10-23T10:41:19+05:30 IST