చినుకు వణుకు

ABN , First Publish Date - 2022-08-09T05:38:07+05:30 IST

జిల్లాను మళ్లీ చినుకులు వణికిస్తున్నాయి.

చినుకు వణుకు
పొంగి ప్రవహిస్తున్న స్వర్ణ వాగు దృశ్యం

వరుస వర్షాలతో పొంచి ఉన్న వరదముప్పు 

ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో స్తంభించిన జనజీవనం 

మళ్లీ పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు 

ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ప్రవాహం 

జిల్లాలో 19.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు 

నిర్మల్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాను మళ్లీ చినుకులు వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి మొదలైన ముసురు సోమవారం కూడా జోరుగా కొనసాగింది. ఏకధాటిగా వర్షం కురియడంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు క్రమంగా పొంగి పొర్లుతున్నాయి. కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణప్రాజెక్టుల్లోకి వరదప్రవాహం పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుభీర్‌ మండలంలో 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గత నెలరోజుల నుంచి జిల్లాను అతలాకుతలం చేసిన వర్షాలు ఒకటి రెండురోజులు మాత్రం శాంతించినప్పటికీ మళ్లీ అల్పపీడనం కారణంగా తన జోరును పెంచుతోంది. వాగుల్లో వరదప్రవాహం పెరిగిపోవడంతో పలుచోట్ల వర్షం నీరురోడ్లపై ప్రవహిస్తోంది. నిర్మల్‌ - ఖానాపూర్‌ రోడ్డు మధ్య గల పలు బ్రిడ్జిలకు చేరువగా ఆయా వాగుల నీరు చేరుకుంటోంది. రోజంతా ఏకధాటిగా వర్షం కురియడంతో జనం ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కడెం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. 20,886 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఏడుగేట్లను ఎత్తిదిగువకు 11,141 క్యూసెక్కుల నీరు ను వదులుతున్నారు. అలాగే స్వర్ణప్రాజెక్టులోకి కూడా ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతోంది. గడ్డెన్న వాగుప్రాజెక్టులోకి కూడా వరద నీరు అత్యధికంగా ప్రవహిస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. ఈ వర్షాల కారణంగా రోడ్లు, కల్వర్టుల మరమత్తు పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిర్మల్‌, బైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లోని పలువీధులు తరుచుగా జలమయమవుతున్న కారణంగా అక్కడ సంబంధిత మున్సిపాలిటీలు డ్రైనేజీశుభ్రత పనులు కొనసాగిస్తున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటం కాలు కలుగుతున్నాయి. 

వాగులకు పొంచి ఉన్న ముప్పు

జిల్లాలోని అనేక వాగులకు గత రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మరోసారి ముప్పు తప్పేట్లు లేదంటున్నారు. ప్రధానంగా సారంగాపూర్‌ మండలంలోని కంకేట, వంజర్‌ల వద్ద గల వాగులతో పాటు స్వర్ణవాగు, ధనివాగుల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. కొద్దిపాటి వర్షానికే ఈ వాగులు పొంగి ప్రవహిస్తుంటాయి. అయితే ఏకఽధాటిగా కురుస్తున్న వర్షాలతో ఈ వాగులు ప్రధానరోడ్లను ముంచెత్తుతున్నాయి. దీంతో పాటు నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ వరకు గల ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న కనకాపూర్‌, సాంగ్వి, దిమ్మదుర్తి తదితర చోట్ల ఉన్న వాగుల్లో నీటిప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు ఈ వాగులు పొంగి ప్రవహించడంతో నిర్మల్‌-మంచిర్యాల ప్రధాన రోడ్డు ధ్వంసమైన సంగతి తెలిసిందే. అధికారులు రాకపోకలను సైతం నిలిపివేసి మరమత్తు పనులను ఇటీవలే పూర్తి చేశారు. అయితే మళ్లీ వర్షం ఏకధాటిగా కురుస్తున్న కారణంగా ఈ వాగులకు మరోసారి ముప్పు పొంచి ఉందంటున్నారు. 

స్తంభించిన జనజీవనం

సోమవారం ఉదయం నుంచి నిరాటకంగా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. వర్షం నిరాటకంగా కురిసిన కారణంగా జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వాన నీరుక్రమంగా చేరుకుంటోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. వర్షం గణనీయంగా కురుస్తున్న కారణంగా చిరువ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. చాలా గ్రామాలకు ఆటో రిక్షాలు, ఇతర ప్రయాణికులను తరలించే వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే వారు వారి ప్రయాణాలను రద్దుచేసుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీ ప్రయాణికులు కూడా తగ్గి


పోయారు. పండగసీజన్‌ కారణంగా రద్దీపెరగాల్సి ఉండగా వర్షాలతో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ఇలా ఏకధాటి వర్షాలతో మరోసారి జన జీవనం అతలాకుతలమైంది. ఇప్పటికే నెలరోజుల నుంచి కురుస్తున్న వర్షాలు వ్యాపారులను, సాధారణ ప్రజానీకాన్ని నష్టాలకు గురి చేయగా మరోసారి కురుస్తున్న వర్షాలు అన్నివర్గాలను మరోసారి కుంగదీస్తున్నాయి. 

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరదప్రవాహం

మళ్లీవర్షాలు తీవ్రరూపం దాల్చుతున్న కారణంగా ఆయా ప్రాజెక్టుల్లోకి వరదప్రవాహం పెరుగుతోంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మళ్లీ మొదలైంది. ఇటీవల వరదల కారణంగా అతలాకుతలమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సమయంలోనే మళ్లీవర్షాలు ధడ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం 20,286 క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా 11,141 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 11 గేట్లను మరమత్తులు జరిపిన తరువాత అధికారులు కిందికి దింపగలిగారు. దీని కారణంగా దిగువకు నీటిప్రవాహం కొంత మేరకు నిలపగలిగారు. ప్రస్తుతం మరో ఏడుగేట్లుకు మరమత్తులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.603 టీయంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 4.231 టీయంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు 40 టీయంసీలకు పైగా నీరును గోదావరిలోకి వృధాగా వదిలిపెట్టారు.  స్వర్ణప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1180 అడుగులుగా ఉంది.  ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 1.484 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.175 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 400 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. అలాగే గడ్డెన్న వాగుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 357.90 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1.852 టీయంసీలుగా కాగా ప్రస్తుతం 1.428 టీయంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఎగువప్రాంతమైన మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ప్రాజెక్టులోకి 9వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. అధికారులు ఒక వరదగేటు ఎత్తి దిగువన ఉన్న సుద్దవాగులోకి 9వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తానికి మళ్లీ కురుస్తున్న వర్షాలతో అంతటా హైరానా మొదలైంది. 

Updated Date - 2022-08-09T05:38:07+05:30 IST