దాహం తీర్చి... ఇమ్యూనిటీ పెంచుతాయ్‌!

ABN , First Publish Date - 2020-05-27T05:30:00+05:30 IST

ఓ వైపు కరోనా బెంగ, మరో వైపు మాడ్చేస్తున్న ఎండలు... ఆఫీసులు తిరిగి తెరుచుకోవడంతో తప్పనిసరై ఇళ్ల నుంచి

దాహం తీర్చి... ఇమ్యూనిటీ పెంచుతాయ్‌!

ఓ వైపు కరోనా బెంగ, మరో వైపు మాడ్చేస్తున్న ఎండలు... ఆఫీసులు తిరిగి తెరుచుకోవడంతో తప్పనిసరై ఇళ్ల నుంచి బయటకు వస్తున్న జనం ఎండ వేడికి అల్లాడి పోతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో భౌతిక దూరాన్ని మరింత జాగ్రత్తగా పాటించాల్సిన పరిస్థితి! పెరిగే ఎండలతో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశాలనూ కాదనలేమన్నది వైద్యుల మాట. రోగ నిరోధక శక్తి బాగుంటేనే వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.  ఈ వేసవి తాపం నుంచి సేద తీరుస్తూనే రోగ నిరోధక శక్తిని సైతం పెంపొందించే కొన్ని పానీయాలు...


కొబ్బరి నీరు 

కల్తీకి ఆస్కారం లేనిది కొబ్బరి నీరు. నేచురల్‌ ఎలకొ్ట్రలైట్‌గా ఉపయోగపడుతుంది. దంచికొడుతున్న ఎండల వల్ల శరీరం నీరసించినప్పుడు తక్షణమే శక్తిని అందించేది కొబ్బరి నీరే ! 


లస్సీ 

వేసవిలో ఎక్కువమంది ఇష్టపడే పానీయాల్లో లస్సీ ఒకటి. మండుటెండల్లో మరే డ్రింక్‌ కూడా ఇవ్వనంత చల్లదనం, ఆహ్లాదం ఇది అందిస్తుంది. కాస్త పంచదార, పెరుగు, నీరు కలిపి తయారుచేసే లస్సీని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. మరో విశేషమేమిటంటే,  బనానా, మ్యాంగో, పుదీనా, డ్రైఫ్రూట్ప్‌... ఇలా రకరకాల లస్సీలు చేసుకోవచ్చు. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్‌ రోగ నిరోధక శక్తి మెరుగుదలకు సాయపడతాయి.


లెమన్‌ వాటర్‌ 

ప్రతి ఇంట్లోనూ వేసవిలో తప్పనిసరిగా కనిపించే డ్రింక్‌ ఇది. నిమ్మరసం, పుదీనా, కాస్త ఉప్పు, లేదంటే పంచదార కలిపితే చాలు. ఇందులో విటమిన్‌-సి ఎక్కువ. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది.  లెమన్‌ వాటర్‌ కాస్త స్పైసీగా కావాలంటే జీలకర్ర, మిరియాలు కూడా జోడించవచ్చు.



పుదీనా షర్బత్‌ 

లెమన్‌, మింట్‌ కలిపి చేసే పుదీనా షర్బత్‌ ఎండల్లో సేదతీర్చే రిఫ్రెషింగ్‌ డ్రింక్‌. 


ఇవి కాక పుచ్చకాయ, తర్బూజా లాంటివి కూడా వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


‘‘వేసవిలో ఎప్పుడూ తాగేదాని కన్నా ఎక్కువగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్వచ్ఛతకు ప్రాధాన్యం పెరిగిన కరోనా వేళ బయట డ్రింక్స్‌ తీసుకోవడం ఇబ్బందే! సీజన్‌ మారుతున్న వేళ వచ్చే సాధారణ ఫ్లూను ఎదుర్కోవడంతో పాటు, కరోనా లాంటి మహమ్మారి బారిన పడకుండా ఉండడానికి వేసవి పానీయాలను కాస్త వైవిధ్యంగా, ఇంట్లోనే తయారు చేసి తీసుకుంటే మంచిది. మనం రోజూ తీసుకునే మజ్జిగ, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసాయి. వంటల్లో విరివిగా ఉపయోగించే అల్లం, వెల్లుల్లి, పసుపు రోగ నిరోధక శక్తి మెరుగుపరుచుకోడానికి దోహదపడతాయి. ఈ సీజన్లో దొరికే మామిడికాయలు, పుచ్చకాయలతో పాటు కొబ్బరినీరు కూడా వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.’’


నఫీసా, డైటీషియన్‌ 


డ్రై ఫ్రూట్స్‌ స్మూతీ

ఇది వేసవి పానీయం మాత్రమే కాదు, ఇమ్యూనిటీ బూస్టర్‌ కూడా! బాదం, జీడిపప్పు, ఖర్జూరం తదితరాలతో  ఈ స్మూతీలను తయారుచేసుకోవచ్చు.


పసుపు పాలు

పసుపు నేచురల్‌ యాంటీ బయాటిక్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధకశక్తిని గణనీయంగా  వృద్ధి చేస్తుంది. పాలు, పసుపు కలిపి వేడి చేసుకుని తాగితే సీజనల్‌ ఫ్లూ లాంటి రోగాలు దరిచేరవు.



చెరుకు రసం

వేసవిలో వచ్చే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చెరుకు రసం అందిస్తుంది. అల్లం కూడా దీనికి జోడిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. నీరసం, డీహైడ్రేషన్‌లను పోగొట్టడంతో పాటు బాడీ ఫ్లూయిడ్స్‌కి దోహదపడుతుంది.


జల్‌జీరా

వేడి నుంచి పూర్తి ఉపశమనాన్ని ఇచ్చే డ్రింక్‌ జల్‌జీరా. జీలకర్ర పొడి, మంచినీరు చాలు.. హెల్తీ సమ్మర్‌ కూలర్‌ తయారైనట్టే ! ఆరోగ్యపరంగా జల్‌జీరా ప్రయోజనాలు ఎన్నెన్నో! వేసవిలో సాధారణంగా తలెత్తే జీర్ణక్రియ సమస్యలకు కూడా ఇది పరిష్కారం.


మజ్జిగ

ఒంట్లో వేడి ఉంటే ‘మజ్జిగ తాగితే సరి’ అని ఇంట్లో పెద్దలు చెప్పే మాట అందరికీ గుర్తే! మజ్జిగలో పుదీనా, కొత్తిమీర వేసుకుని తాగితే మరింత ప్రయోజనం. ఎండ వేడిమి నుంచి పూర్తి ఉపశమనం కలిగించే రిఫ్రెషింగ్‌ డ్రింక్‌- బటర్‌మిల్క్‌.


ఆమ్‌ పన్నా

ఇది మామిడి పండ్ల సీజన్‌ ఇది. పండ్లలో రారాజు మామిడి రుచులను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పచ్చిమామిడితో తయారుచేసే ఆమ్‌ పన్నా ఈ వేసవిలో శరీరాన్ని చల్లబరచడమే కాదు, రోగ నిరోధక శక్తినీ పెంపొందిస్తుంది. మామిడితో పాటు జీలకర్ర, పుదీనా లాంటివి కలిపి తీసుకుంటే శరీరానికి అదనపు శక్తి వస్తుంది. 



Updated Date - 2020-05-27T05:30:00+05:30 IST