భగీరథ నీళ్లల్లో మాంసం ముద్దలు

ABN , First Publish Date - 2022-06-24T18:18:53+05:30 IST

సీజనల్‌ వ్యాధులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలాంటి తరుణంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

భగీరథ నీళ్లల్లో మాంసం ముద్దలు

బూర్గంపాడు(భద్రాద్రి కొత్తగూడెం): సీజనల్‌ వ్యాధులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలాంటి తరుణంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాలలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరాఫరా చేసే కొళాయిలలో మాంసం ముద్దలు వెలుగు చూశాయి. ఈసంఘటన లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. గ్రామస్ధులు తెలిపిన వివరాలు ప్రకారం... గ్రామంలోని ప్రజలు గురువారం తమ ఇళ్లలోని ట్యాప్‌ల వద్ద మిషన్‌భగీరథ నీళ్లు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొళాయిల ద్వారా నీటితో పక్షుల మాంసం ముద్దలు రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో స్ధానిక పంచాయతీ అధికారులకు సమాచారం ఆందించారు. సమాచారం తెలుసుకున్న పంచాయతీ అధికారులు అక్కడకు చేరుకుని వాటిని పరిశీలించారు. ఈ క్రమంలో వాటర్‌ ట్యాంకులోని నీటిని బయటకు విడిచిపెట్టారు. పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో పైప్‌లైను మరమ్మతులకు గురయిందని తెలిపారు. ఆ ప్రదేశం నుంచి పైపులోకి ప్రాణులు చేరి ఉంటాయని అవే మాంసం రూపంలో వచ్చి ఉంటాయని పెర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన వెంటనే ట్యాంకులోని నీరు మొత్తం బయటకు విడిచిపెట్టి ట్యాంకును బ్లీచింగ్‌ చేయించామని అన్నారు. 


ఆందోళనలో గ్రామస్ధులు

కాగా వాటర్‌ పైపులైన్‌ల ద్వారా నీళ్లలో మాంసం ముద్దలు రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వాటర్‌ట్యాంకును పరిశీలించిన గ్రామస్థులు వాటర్‌ ట్యాంకుపై మూతలు ఏర్పాటు చేయలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కాగా ట్యాంకుపై మూతలు లేకపోవడంతో పక్షులు పైనుంచి నీళ్లలోకి చేరి మృతి చెంది ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో గ్రామాలలో నీళ్లు కలుషితం కాకుండా చూడాల్సిన ఆదికారులు ఇంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతవరకు సమాంజమని ప్రశ్నిస్తున్నారు. 



Updated Date - 2022-06-24T18:18:53+05:30 IST