దాహం తీర్చండి సార్‌..!

ABN , First Publish Date - 2022-01-09T05:29:01+05:30 IST

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,059 పాఠశాలల్లో తాగునీటి కోసం మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటుకు యంత్రాలను, పరికరాలను సమకూర్చారు.

దాహం తీర్చండి సార్‌..!
కొళాయిల్లో నీరు తాగుతున్న విద్యార్థులు

పాఠశాలల్లో వాటర్‌ప్లాంట్ల నిరుపయోగం

రూ. కోట్ల నిధులు నీళ్లపాటు

గొంతెండుతున్న విద్యార్థులు


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించి కార్పొరేట్‌లకు దీటుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమం విమర్శలకు తావిస్తోంది. పాఠశాలల అభి వృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ప్రధానంగా తాగేందుకు నీరు లేక విద్యార్థులు పడే పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయి. జిల్లాలో కోట్లు వెచ్చించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు నిరుపయోగంగా మారాయి.


నెల్లూరు (విద్య) జనవరి 8 : నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,059 పాఠశాలల్లో తాగునీటి కోసం మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటుకు యంత్రాలను, పరికరాలను సమకూర్చారు. వీటి నిర్వహణ కోసం రూ.40 కోట్లకుపైగా వెచ్చించారు. వీటిలో సుమారు 800కు పైగా పాఠశాలల్లో నిర్వహణ లేకపోవడంతో యంత్రాలన్నీ దిష్టిబొమ్మల్లా మిగిలాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని పూర్తిగా మూలన పడేశారు. ఈ ప్లాంట్‌లను సరఫరా చేసేందుకు అధికారు లు, కాంట్రాక్టర్‌లు బాధ్యత వహించారు. ఆ తర్వాత పర్యవేక్షించే నాథుడే లేకపోవడంతో ప్లాంట్‌లన్నీ శిథిలా వస్థకు చేరుకున్నాయి. వీటిలో కొన్ని ప్లాంట్‌లను దాతలు ఏర్పాటు చేయగా, మిగిలిన అన్నీ పాఠశాలల్లో కూడా ప్ర భుత్వం టెండర్ల ద్వారా సంస్ధలను ఆహ్వానించి ఏపీఈడ బ్ల్యుఐడీసీ ద్వారా పనులు చేపట్టేందుకు అను మతులి చ్చారు.  విద్యార్థుల సంఖ్య, ఆయా పాఠశాలల్లోని నీటిలో లవణీయత, ఫ్లోరైడ్‌ శాతాన్ని బట్టి వాటర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు. 200 మందిలోపు పిల్లలు ఉన్న బడిలో లక్ష విలువ చేసే యంత్రాన్ని అందించారు. ఈ లెక్కన 407 పాఠశాలలకు చిన్న యంత్రాలను సరఫరా చేశారు. అలాగే 300 మంది విద్యార్థులు కలిగి, నీటిలో టీడీఎస్‌ శాతం ఎక్కువగా ఉంటే రెండులక్షల నుంచి మూడు లక్షల విలువైన యంత్రాలు అవసరమని గుర్తించి 31 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే 800 మందికిపైగా విద్యార్థులుండే 194 పాఠశాలల్లో నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల విలువ చేసే ప్లాంట్‌లను సమకూర్చారు. వీటిని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసినా, విద్యార్థులకు  ఉపయోగం లేకుండా పోయాయి.


మంచినీటికి కటకట

 జిల్లాలో 2,688  ప్రాఽథమిక, 361 ప్రాథమికోన్నత, 418 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,467  ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 4లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు పనులు చేపట్టిన పాఠశాలలతోపాటు మిగిలిన బడుల్లో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది. 90 శాతం మంది విద్యార్థు లు ఇంటి నుంచే బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. మిగిలిన చిన్నారులు కొళాయిలను, బోర్లను ఆశ్రయిస్తు న్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ నీటినే విద్యార్థులు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆరోగ్యసంస్ధ లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు మూడు లీటర్ల నీటిని తాగాల్సి ఉంది. పాఠశాల సమయంలో విద్యార్థులు రెండు లీటర్ల నీటిని తాగాలి. అయితే బడుల్లో నీరు లేకపోవడం, బయట నీరు తెచ్చుకునే అవకాశాలు లేకపోవడంతో వెంట తీసుకెళ్లిన బాటిళ్లలోని నీటితోనే రోజంతా సర్దుకోవాల్సి వస్తున్నది. లేదా బయట దొరికే స్వచ్ఛత లేని నీటిని తాగుతున్నారు. దీనివల్ల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం, అనారోగ్యానికి గురికావడం వంటి ఇబ్బందులను విద్యా ర్థులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో వాటర్‌ ప్లాంట్‌లను అందుబాటు లోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


ప్లాంట్‌ను వేగవంతంగా పునరుద్ధరిస్తాం

జిల్లాలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌లో మరమ్మతులకు గురైన వాటిని గుర్తించి, వెంటనే వివరాలు పంపాలని హెచ్‌ఎంలను ఆదేశించాం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే వాటిని పరిష్క రించి ప్లాంట్‌లన్నీ కూడా వినియోగంలోకి తీసుకువస్తాం. విద్యార్థులను నిత్యం తాగునీరందించేలా చర్యలు తీసు కుంటాం.

-ఉషారాణి, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ 





Updated Date - 2022-01-09T05:29:01+05:30 IST