దాహం కేకలు

ABN , First Publish Date - 2022-05-29T05:52:13+05:30 IST

టెక్కలి డివిజన్‌ కేంద్ర ప్రజలకు దశాబ్దాలుగా తాగునీటి కష్టాలు తప్పడంలేదు. ఆదిఆంధ్రావీధి, కండ్రవీధి, గందరగోళంవీధి, తెలుకలవీధి, మండాపొలం కాలనీ, దండుపాటివీధి, ఎన్టీఆర్‌ కాలనీ, వంశధార కాలనీ, పెద్దచేరివీధి, శ్రీనివాస్‌నగర్‌, సర్వమంగళవీధి, శ్యామసుందరకాలనీ తదితర ప్రాంతాల్లో సరిపడా కొళాయి పాయింట్లు లేవు. మరికొన్ని వీధుల్లో కొళాయిలు ఉన్నా.. తక్కువస్థాయిలో నీరు వస్తోంది. దీంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దాహం కేకలు
పలాసలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద మహిళన నిరసన

- అరకొరగా కొళాయి పాయింట్లు
- మరమ్మతులకు గురైన పైపులైన్లు
- టెక్కలివాసులకు తప్పని తాగునీటి కష్టాలు
(టెక్కలి రూరల్‌)

టెక్కలి డివిజన్‌ కేంద్ర ప్రజలకు దశాబ్దాలుగా తాగునీటి కష్టాలు తప్పడంలేదు. ఆదిఆంధ్రావీధి, కండ్రవీధి, గందరగోళంవీధి, తెలుకలవీధి, మండాపొలం కాలనీ, దండుపాటివీధి, ఎన్టీఆర్‌ కాలనీ, వంశధార కాలనీ, పెద్దచేరివీధి, శ్రీనివాస్‌నగర్‌, సర్వమంగళవీధి, శ్యామసుందరకాలనీ తదితర ప్రాంతాల్లో సరిపడా కొళాయి పాయింట్లు లేవు.  మరికొన్ని వీధుల్లో కొళాయిలు ఉన్నా.. తక్కువస్థాయిలో నీరు వస్తోంది. దీంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆదిఆంధ్రావీధి జాతీయ రహదారి సమీపంలో రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఎర్రన్నాయుడు సమగ్ర తాగునీటి పథకం ప్రారంభించారు. కానీ పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా చేయడంలేదు. ఎత్తైన ప్రదేశాలతో పాటు శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో పట్టణంలోని పలు వీధుల్లో కొళాయి పాయింట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినా.. పనులు పూర్తికాలేదు. మరోవైపు టెక్కలితో పాటు పరిసర గ్రామాల్లో తాగునీటి పైప్‌లైన్‌లకు లీకేజీల సమస్య వేధిస్తోంది. దీంతో కొళాయిల ద్వారా సాగునీటి సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సమగ్ర తాగునీటి పథకం నుంచి రక్షితనీటి పథకాలకు నీరు మళ్లించేవారు. ఇటీవల సోగ్గాడిపేట ప్రాంతంలో ప్రధాన పైప్‌లైన్‌లో సమస్య తలెత్తి.. కొద్దిరోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రావివలస కూడలి సమీపంలో కూడా పైప్‌లైన్‌ మరమ్మత్తులకు గురై సమీప గ్రామాలకు సుమారు వారం రోజులపాటు తాగునీరు సరఫరా కాలేదు. ఇలా ఎక్కడికక్కడ లీకేజీ సమస్యలు ఉన్నాయి. అలాగే మెయిన్‌రోడ్డు, రోటరీనగర్‌, వెంకటేశ్వరకాలనీ, నవీన్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కొళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని పలువురు వ్యక్తిగత, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు స్వార్ధప్రయోజనాల కోసం జలచౌర్యానికి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో శివారు ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని పలువురు  అభిప్రాయపడుతున్నారు. అధికారులు స్పందించి సక్రమంగా నీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
టెక్కలి డివిజన్‌ కేంద్రంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. పంచాయతీ నిధులతో కొళాయి పాయింట్లు ఏర్పాటు చేస్తాం. జలజీవన్‌ మిషన్‌ కింద టెక్కలి మేజర్‌ పంచాయతీకి రూ.78.06 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పూర్తికాగానే మిగతా ప్రాంతాల్లో కొళాయిల ఏర్పాటుకు కృషి చేస్తాం.
- పి.సూర్యప్రకాష్‌, ఏఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, టెక్కలి.

నీటి కోసం నిరసన
- పలాస మునిసిపాలిటీ కార్యాలయం వద్ద మహిళల ఆందోళన
పలాస, మే 28 :
పలాస డివిజన్‌ కేంద్ర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక 28వ వార్డు మునిసిపల్‌ కార్యాలయం రోడ్డులో ఉన్న హరిజనవీధికి చెందిన మహిళలు నీటి కోసం నిరసన చేపట్టారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. మునిసిపల్‌ కార్యాలయం చెంతనే ఉన్నా.. తమ కాలనీకి సక్రమంగా నీరు సరఫరా కావడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బోరుబావులు లేకపోవడంతో మునిసిపల్‌ కొళాయిల నీరే ఆధారమని తెలిపారు. పొరుగునే ఉన్న కాలనీలో మూడేసి గంటలు నీరు పడుతున్నా..  తమకు మాత్రం 5 నిమిషాలు కూడా నీటి సరఫరా కావడం లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు దృష్టికి తీసుకెళ్లగా.. హరిజనవీధికి పూర్తిస్థాయిలో తాగునీరు అందజేస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-29T05:52:13+05:30 IST