ఏరువారిపల్లె క‘న్నీరు’

ABN , First Publish Date - 2020-05-21T10:48:43+05:30 IST

కనిగిరి మండలంలో అదొక విసిరేసిన పల్లె. పేరుకు పాత ఏరువారిపల్లె.

ఏరువారిపల్లె క‘న్నీరు’

గుక్కెడు నీటి కోసం అగచాట్లు

రూ.15 పెడితేనే క్యాన్‌ మంచినీరు

పశువులకూ తాగునీటి ఇబ్బంది

ఇసుక అక్రమ తవ్వకాలతో ఒట్టిపోయిన వాగు

పట్టించుకునే వారు కరువు


కనిగిరి టౌన్‌, మే 20: కనిగిరి మండలంలో అదొక విసిరేసిన పల్లె. పేరుకు పాత ఏరువారిపల్లె. అక్కడ ఏరు లేదు. సెలయేటి నీళ్లూ లేవు. 70 కుటుంబాలకు ఆ పల్లెకు దగ్గర్లో ఉన్న వాగు నీరే దిక్కు. ఆ వాగులోని ఇసుకను దోచేస్తుండటంతో ఉన్న జల మట్టం పడిపోయింది. దీంతో నీటికోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. క్యాన్‌కు రూ.15 వెచ్చించి నీరు కొనుగోలు చేసితాగాల్సిన దుస్థితి ఏర్పడింది.  మండల పరిధిలోని ఏరువారిపల్లెకు దక్షిణం దిక్కుగా పాత ఏరువారిపల్లె ఉంది. అక్కడ 70 కుటుంబాలే ఉన్నాయి. బిందె నీటి కోసం వాగు వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే.  


పట్టించుకునేవారు లేరు

ఆ గ్రామంలో 3500 లీటర్ల ట్యాంకు ఉన్నా అక్కడ నివశించే వారికి వాగు బావిలో మోటారు ద్వారా వచ్చేది 10 నుంచి 15 బిందెలే. ఈ సమస్యపై ఆయా గ్రామ వలంటీర్‌, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, తహసీల్దారు, ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కనీసం అధికార పార్టీ నాయకులకు చెప్పుకుందామంటే వారే నీటి సమస్యకు కారకులుగా తయారయ్యారని వాపోతున్నారు. 

 

అల్లాడుతున్న పశువులు

 గతంలో ఆ వాగులో గొల్లపల్లి చెరువు నుంచి కాల్వల ద్వారా నీరు చేరేవి. అప్పట్లో వాగులో పుష్కలంగా నీరు ఉండేది. అక్కడి ప్రజలు  ఆ వాగు నీటినే అన్ని అవసరాలకు వినియోగించేవారు.ఆయా కుటుంబాలకు పాడి జీవనాధారంగా ఉంది. ఇప్పుడు ఆ నీరు లేదు. ఆ వాగు ఇసుకను బకాసురులు తరలించుకుపోతుండటంతో నీరు ఇంకిపోయింది. దీంతో పశువులకు నీరు లేక పాడి ఒట్టిపోయింది. గేదెలకు నీరు  తాగించాలంటే 10 కిలో మీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ గ్రామానికి చెందిన నాగలక్షమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.


యథేచ్ఛగా ఇసుక దోపిడీ 

 ఇప్పుడున్న ఆధికార పార్టీ నాయకుల దందాలకు అంతే లేకుండా పోయింది. వాగులో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు ఆ పక్కకు తొంగి కూడా చూడటంలేద ని వాపోతున్నారు. ఎమ్యెల్యే అండ ఉందనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వాగులో ఇసుక దోచుకెళ్తున్నారు.  ఆ వాగులో ఇసుక తోడేస్తుండటంతో జల మట్టం పూర్తిగా పడిపోయింది.  

Updated Date - 2020-05-21T10:48:43+05:30 IST