ఒంగోలులో వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌

ABN , First Publish Date - 2021-01-05T06:19:39+05:30 IST

ఒంగోలు నగరంలో పైపులైన్‌ మరమ్మతుల కారణంగా తాగునీటి కష్టాలు పెరిగిపోయాయి. అసలే మూడురోజులకోసారి .. అదీనూ అరకొరే. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా వారం రోజులకుపైగా సరఫరా నిలిచిపోయింది.

ఒంగోలులో వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌
ఒంగోలు నెహ్రూ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ట్యాంకు వద్ద బారులు తీరిన ప్రజలు , ట్యాంకు వద్దకు బిందెలతోపాటు డ్రమ్మును కూడా పట్టుకొని వెళ్తున్న మహిళ

పైప్‌లైన్‌ల మరమ్మతుల పేరుతో నిలిపివేత

ఇంకా పూర్తికాని పనులు 

లీకుల కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది

నానాపాట్లు పడుతున్న శివారు ప్రజలు 

ట్యాంకర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకే సరఫరా


ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 4 : ఒంగోలు నగరంలో పైపులైన్‌ మరమ్మతుల కారణంగా తాగునీటి కష్టాలు పెరిగిపోయాయి. అసలే మూడురోజులకోసారి .. అదీనూ అరకొరే. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా వారం రోజులకుపైగా సరఫరా నిలిచిపోయింది. దీంతో నగరంలోని సగానికిపైగా కాలనీల్లో నీటి కష్టాలు నెలకొన్నాయి. ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. రెండో సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌ నుంచి వచ్చే పైపులైన్‌ మార్పు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.   జాయింట్ల వద్ద లీకులు ఏర్పడుతుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయి. దీంతో సరఫరా పునరుద్ధరణపై అనిశ్చితి నెలకొంది.  మంగళవారం రాత్రికి పూర్తిచేసి యథావిధిగా నీటి సరఫరా  చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తే మరో రోజు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ    అవి అందరికీ సరిపోవడం    లేదు. అలాగే నగరంలోని కొన్ని డివిజన్లలో మధ్యతరగతి   వారు కూడా నీటి  ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

 నగరంలో రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు వద్ద నుంచి హిల్‌ టవర్‌ వద్ద ఈఎల్‌ఎస్‌ఆర్‌కు వెళ్లే ప్రధాన పైపులైను మార్పు పనులు వారంరోజుల క్రితం మొదలుపెట్టారు. అయితే పైపులైను పను లు పూర్తయినా జాయింట్ల వద్ద మరలా లీకులు ఏర్పడటంతో మరో రెండు రోజులు తాగునీటికి కష్టాలు తప్పేట్లు లేవు. ఇప్పటికే వారంరోజులుగా ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతుండగా, మరోవైపు పైపులైను పనులు పూర్తికాకపోవ డంతో అధికారులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. అయితే శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న ప్పటికీ అవి సరిపోవడం లేదు. అందిన సమాచారం మేరకు మరో రెండు రోజులు తాగునీటి సరఫరా జరిగే వీలులేదని తెలుస్తోంది. సోమవారం నాటికి జాయింట్‌ లీకుల పనులు పూర్తయినా, బెడ్‌ల వద్ద సిమెంట్‌ కాంక్రీట్‌తో పనులు చేపట్టాల్సి ఉంది. దీంతో మరో 24గంటల వరకూ పైపులైను ద్వారా నీరు సరఫరా చేసే పరిస్థితి లేదు. అయితే  మంగళవారం అర్ధరాత్రికి పంపింగ్‌ చేసి, బుధవారం నుంచి నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నా రు. అయితే అందరికీ ఒకేసారి నీరు ఇచ్చే పరిస్థితి లేదు. మూ డ్రోజుల సైకిల్‌ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది.  


సమస్యకు శాశ్వత పరిష్కారమేదీ?

నగరంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిం చడం లేదు. ఏటా ఏదో ఒక రూపంలో తాగునీటి సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంది. పాతకాలపు పైపులైన్లకు ఒకవైపు లీకులు సమస్యగా మారగా, మరోవైపు యంత్రాంగం అలసత్వం కూడా దానికితోడైంది. దీంతో వాటి మరమ్మతుల పేరుతో తరచూ నీటి సరఫరా నిలిచిపోతోంది. అసలే మూ డురోజులకు ఒకసారి మంచినీటి సరఫరా కావడంతో నిల్వ సమస్య సామాన్యులను వెంటాడుతోంది.  దీంతో అందరూ నీటి కోసం ఎదురుచూడాల్సిన  దుస్థితి నెలకొంది.  


శివారుకాలనీల్లో ఎదురుచూపులు 

శివారు కాలనీల్లో తాగునీటి కష్టాలు మరింత తీవ్రంగా మారాయి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ నీరు నింపుకునేందుకు సరిపడా ట్యాంకులు లేకపోవడం, మరో వైపు ఇంటికి నాలుగైదు డ్రమ్ములకు మించి రాకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. రెండు, మూడురోజులకు ఒకసారి వచ్చే ట్యాంకర్ల కోసం పిల్లలు, పెద్దలు, వృద్ధులు బారులు తీరుతున్నారు. అంతేకాకుండా రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారు నీళ్ల కోసం పనులు మానుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. కాలనీల్లో పైపులైనులు ఏర్పాటుచేయాలని, అదేవిధంగా రోజుమార్చి రోజు కాకుండా, ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అందించాలని పలు కాలనీవాసులు కోరుతున్నారు.


పైపులైను పనులను పరిశీలించిన మంత్రి బాలినేని  

నగరంలో తాగునీటి సమస్య రావడం బాధాకరమని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక 2వ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు వద్ద జరుగుతున్న పైపులైను పనులను మంత్రి పరిశీలించారు. కమిషనరు కె.భాగ్యలక్ష్మి, మునిసిపల్‌ ఇంజనీర్‌ డి.సుందరరామిరెడ్డితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో నాలుగైదు రోజులుగా తాగునీటికి ఇబ్బందులు ఎదురుకావడం బాధ కలిగిస్తున్నదని, పైపులైన్‌ పనులు పూర్తయ్యాయని, అయితే కొద్దిపాటి లోపాల కారణంగా మరలా లీకులు వచ్చాయన్నారు. వాటిని అధికారులు కట్టడి చేస్తున్నారని చెప్పారు. అయితే ప్రజలు తాగునీటికి ఇబ్బందిపడకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు.


నేటి రాత్రి నుంచే నీరిస్తాం

కె. భాగ్యలక్ష్మి, నగర కమిషనర్‌

పైపులైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులు చేపట్టాం. అవి దాదాపు పూర్తయ్యా యి. అక్కడక్కడా లీకుల కారణంగా కాస్తంత ఆలస్యమైంది. శివారు కాలనీల ప్రజలు ఇబ్బందిపడకుండా ట్యాంకర్ల ఏర్పాటు చేసి  నీరందిస్తున్నాం. మంగళవారం రాత్రి నుంచి యథావిధిగా నగరానికి నీటి సరఫరా జరుగుతుంది. 




Updated Date - 2021-01-05T06:19:39+05:30 IST