డ్రెడ్జింగ్‌లో శంకర్‌దాదా!

ABN , First Publish Date - 2022-05-15T08:17:34+05:30 IST

విశాఖలోని ప్రతిష్ఠాత్మకమైన డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఐసీ) పరువు రోడ్డున పడింది. దేశవిదేశాల్లో డ్రెడ్జింగ్‌ పనులు చేస్తూ వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన ఈ సంస్థకు మకిలి పట్టింది

డ్రెడ్జింగ్‌లో శంకర్‌దాదా!

చేసింది సైన్సులో పీహెచ్‌డీ

ఇంజనీరింగ్‌ పీహెచ్‌డీగా దరఖాస్తు

తప్పుడు పత్రాలతో డీసీఐలో కీలక పోస్టు 

డిస్మిస్‌ చేసిన సంస్థలోనే డైరెక్టర్‌గిరి

విచారణ ప్రారంభించిన విజిలెన్స్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖలోని ప్రతిష్ఠాత్మకమైన డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఐసీ) పరువు రోడ్డున పడింది. దేశవిదేశాల్లో డ్రెడ్జింగ్‌ పనులు చేస్తూ వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన ఈ సంస్థకు మకిలి పట్టింది. సెప్టెంబరు 2020లో కీలక పోస్టు కోసం పత్రిక ప్రకటన ఇవ్వగా, తప్పుడు పత్రాలు సమర్పించి, ఒక వ్యక్తి ఆ పోస్టును దక్కించుకున్నారు. ఏడాదికిపైగా అందులో కొనసాగుతున్నారు. ఆయన వ్యవహార శైలిపై అనుమానం వచ్చి కొందరు ఆరా తీయగా, తప్పుడు సర్టిఫికెట్లతో ఆయన అత్యంత కీలకమైన పోస్టు పొందినట్టు తేలింది. ఆయనపై విశాఖపట్నం పోర్టు చైర్మన్‌ కె.రామమోహన్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఆయన అందులో అంశాలను పరిశీలించి, విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు.  సదరు అధికారి 2000లో డీసీఐలో జూనియర్‌ అధికారిగా పనిచేస్తుండగా, నాటి సీఎండీ డిస్మిస్‌ చేశారు. సదరు అధికారి కీలక పోస్టు కోసం డీసీఐకి సమర్పించిన సర్టిఫికెట్లన్నీ తప్పులతడకలతో ఉండడం గమనార్హం. ఆయన సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆ విషయం సర్టిఫికెట్‌లో ఉంది. కానీ దరఖాస్తులో ‘ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌’లో పీహెచ్‌డీ చేసినట్టు పేర్కొన్నారు.


పైగా అందులో డిస్టింక్షన్‌ సాధించినట్టు పేర్కొన్నారు. పీహెచ్‌డీ చేసిన వారికి పట్టా తప్ప డిస్టింక్షన్‌ ఇవ్వరనేది ఇక్కడ గమనార్హం. పోర్టు, డ్రెడ్జింగ్‌ కంపెనీల్లో 25 ఏళ్లు పనిచేసిన అనుభవం కావాలని అడిగితే...ఈయన ఫార్మాసూటికల్‌ కంపెనీలో అడ్వయిజర్‌గా పనిచేసిన కాలాన్నీ కూడా ఇందులో కలిపేసి సమర్పించారు. పీజీ, పీహెచ్‌డీలు చేసిన కాలాన్ని కూడా సర్వీసుగానే చూపించడం మరో తప్పిదం. ఇవన్నీ తీసేస్తే ఆయన సర్వీసు 19ఏళ్లకు మించదు. అలాగే పనిచేసిన కంపెనీలు లిస్టెడ్‌ అయి ఉండాలని, వాటి టర్నోవర్‌ రూ.500 కోట్లు దాటి ఉండాలనేది మరో నిబంధన. అయితే.. ఆయన పేర్కొన్న కంపెనీలకు ఆ అర్హత లేదని సమాచారం. 


అందరి లేఖల్లో అవే పదాలు

డీసీఐలో పోస్టు కోసం ఆయన ఐదు సంస్థల నుంచి సర్వీసు సర్టిఫికెట్లు తీసుకున్నారు. సాధారణంగా అలాంటి వాటిని ‘ఎవరికైతే వారికి’ అని సంబోధిస్తూ ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈయన సమర్పించిన లేఖలన్నీ నేరుగా డీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ను ఉద్దేశిస్తూ ఉండడం గమనార్హం. ఆయన సమర్పించిన లేఖలన్నింటిలోనూ ఒకటే పదాలు, అవే లైన్లు! అవన్నీ ఒకే తేదీన రాసి ఉండడాన్ని విజిలెన్స్‌ అధికారులు విచారణలో గుర్తించారు. ఈ లేఖలన్నీ ఒక దగ్గరే కూర్చొని తయారుచేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఇలా అనేక తప్పుడు పత్రాలతో కీలక పదవిలోకి వచ్చిన వ్యక్తిని, అది కూడా సంస్థ నుంచి ఏకంగా డిస్మిస్‌ అయిన వ్యక్తిని ఆ పదవిలో ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కాక అటు డీసీఐ, ఇటు పోర్టు వర్గాలు తలలు బాదుకుంటున్నాయి. చాలా పెద్ద స్థాయిలో వ్యవహారాలను నడుపుతున్నారని అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-05-15T08:17:34+05:30 IST