కలగానే బస్టాండ్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-10-27T04:24:40+05:30 IST

శ్రీశైలం - హైదరా బాద్‌ జాతీయ రహదారిపై

కలగానే బస్టాండ్‌ ఏర్పాటు
రోడ్డుపైనే బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

  • కడ్తాలలో ప్రతిపాదనలకే పరిమితమైన బస్టాండ్‌
  • అమలుకు నోచని ప్రజాప్రతినిధుల హామీలు 
  • రోడ్లపైనే నిలుపుతున్న బస్సులు
  • రాకపోకలకు తరచూ ఇబ్బందులు 
  • బస్సుల కోసం హోటళ్లు, దుకాణాల ఎదుట ప్రయాణికుల నిరీక్షణ


కడ్తాల్‌ : శ్రీశైలం - హైదరా బాద్‌ జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు కలగానే మిగిలింది. నేతల హామీలకే పరిమితమైంది. రెండు దశాబ్దాలుగా బస్టాండ్‌ ఏర్పాటు ప్రతిపాదనల్లోనే నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్‌ లేక ప్రయాణికులు, ప్రజలు ఏళ్ల కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌ నిర్మాణ విషయంలో ఎవరూ చొరవ చూప డం లేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర రాజధానికి చేరువలో పలు మండలాలకు కూడలిగా ఉన్న కడ్తాలలో బస్టాండ్‌ ఏర్పాటు చేయాలని రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా స్పందన లేదు. బస్టాండ్‌ నిర్మాణానికి పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ప్రతిపాదనలు పంపినా.. అవి బుట్టదాఖలయ్యాయి. శ్రీశైలం -హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల్‌లో బస్టాండ్‌ లేని కారణంగా ఆర్టీసీ బస్సులను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతుంది. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, కందుకూరు మండలాలకు చెందిన వందలాది మంది ప్రయాణికులు, ప్రజలు కడ్తాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. కడ్తాల మీదుగా నిత్యం హైదరాబాద్‌, శ్రీశైలం, వరంగల్‌, యాదగిరిగుట్ట, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి, జహీరాబాద్‌, హన్మకొండ, కర్ణాటక, అచ్చంపేట, మాల్‌, దేవరకొండ వంటి ప్రాంతాలకు వందల బస్సులు, వేలమంది ప్రయాణికులు రాకపోకలు చేస్తుంటారు. కాగా, బస్టాండ్‌ లేకపోవడంతో రోడ్లపక్కన, హోటళ్లు, దుకాణాల ఎదుట బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఎండ, వాన కాలంలో ఇబ్బందులు చెప్పనలవి కావు. జిల్లాకు చెందిన అనేకమంది ప్రజాప్రతినిధులు, పలువురు మంత్రులు, అధికారులు ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చినా అమలు నోచుకోలేదని స్థానికులు వాపోతున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా మంత్రికి, ఇతర పలువురు ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు గురించి పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ఏర్పాటు చేస్తామన్న హామీ తప్ప కార్యాచరణ లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకొని బస్టాండ్‌ ఏర్పాటుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.


ఏళ్లకాలంగా తప్పని ఇబ్బందులు

కడ్తాల మండల కేం ద్రంలో బస్టాండ్‌ లేక ఏళ్ల కాలంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతు న్నారు. బస్టాండ్‌ ఏర్పాటు దిశగా ఎవరూ పట్టిం చుకోవడం లేదు. విధిలేక హోటళ్లు, దుకాణాల ఎదుట ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తుంది. అనువైన స్థలం కేటాయించి బస్టాండ్‌ నిర్మాణం చేపట్టి ప్రయా ణికుల ఇబ్బందులు తీర్చాలి.

- దోనాదుల మహేశ్‌, కడ్తాల్‌


ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం

కడ్తాల నుంచి అనేక ప్రాం తాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్‌ లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు గురించి ఏళ్ల కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. పలుమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు, మంత్రులను కలిసి విన్నవించాం. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి కూడా తీసుకుపోయాం. బస్టాండ్‌ నిర్మాణం కోసం అవసరమైతే ఆందోళన కార్యాచరణ రూపొందిస్తాం.

- చేగూరి వెంకటేశ్‌, కడ్తాల్‌ 


బస్టాండ్‌ ఏర్పాటుకు కృషి

మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు గురించి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ ద్వారా కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు బస్టాండ్‌ ఏర్పాటు గురించి విన్నవించాం. ఆర్టీసీ సంస్థ ముందుకు వస్తే అనువైన స్థలం ఎంపిక చేసి కేటాయిస్తాం. వీలైనంత త్వరగా బస్టాండ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. 

- గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌, కడ్తాల్‌ 



Updated Date - 2021-10-27T04:24:40+05:30 IST