తెలంగాణ ఉద్యమంలో కన్న కలలు సాకారం

ABN , First Publish Date - 2021-04-15T09:19:42+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో కన్న కలలను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాకారం చేసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కన్న కలలు సాకారం

  • డిసెంబర్‌ నాటికి పాలమూరు ఎత్తిపోతల పూర్తి
  • కరోనా కష్టాల్లోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలు
  • త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం: కేటీఆర్‌
  • పలు జిల్లాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): తెలంగాణ ఉద్యమంలో కన్న కలలను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాకారం చేసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేసేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దాని ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. బుధవారం రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని పలు మునిసిపాలిటీల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి ఎలా ఉండేదో, ఏర్పడ్డ తర్వాత పరిస్థితి ఎలా ఉందో 24 గంటల విద్యుత్‌ సరఫరాను బట్టే ప్రజలకు తెలుస్తుందన్నారు. అచ్చంపేట అభివృద్ధి కోసం మరో రూ.25 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినా, సంక్షేమ ఫలాలను అందరికీ అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కేటీఆర్‌ అన్నారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు అందించనున్నట్లు వెల్లడించారు. కాగా, అచ్చంపేట పట్టణంలోని లింగాల చౌరస్తాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు వచ్చిన కేటీఆర్‌ కాన్వాయ్‌ని బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.


మా భవిష్యత్‌ నాయకుడు కేటీఆరే: పోతుగంటి, గువ్వల

మంత్రి కేటీఆర్‌ తమ భవిష్యత్‌ నాయకుడని ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు బహిరంగంగా చెప్పారు. నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఓ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌ హాజరైన నేపథ్యంలో పోతుగంటి,  గువ్వల ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పోటీ ఇవ్వలేకపోతున్నారని తమ పార్టీ అంతర్గత సమావేశాల్లో కేటీఆర్‌ చెప్పారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు సంభవిస్తాయని కూడా టీఆర్‌ఎస్‌ ప్రముఖులతో చెప్పడం గమనార్హం.

Updated Date - 2021-04-15T09:19:42+05:30 IST