సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ పరీక్షలు విజయవంతం : డీఆర్‌డీవో

ABN , First Publish Date - 2022-04-08T22:54:43+05:30 IST

సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) బూస్టర్ ఫ్లైట్ ట్రయల్

సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ పరీక్షలు విజయవంతం : డీఆర్‌డీవో

న్యూఢిల్లీ : సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) బూస్టర్ ఫ్లైట్ ట్రయల్ విజయవంతమైందని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షలను ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి నిర్వహించినట్లు తెలిపింది. సంక్లిష్ట క్షిపణి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలన్నీ నమ్మకంగా పని చేస్తున్నట్లు స్పష్టంగా వెల్లడైందని తెలిపింది. ఈ కార్యక్రమ లక్ష్యాలన్నీ నెరవేరినట్లు పేర్కొంది. 


SFDR ఆధారిత ప్రొపల్షన్ వల్ల క్షిపణి గగనతలంలో చాలా దూరంలో ఉన్న ముప్పును సూపర్‌సోనిక్ వేగంతో అడ్డుకోగలుగుతుందని తెలిపింది. అనేక రేంజ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా సేకరించిన సమాచారం ఈ వ్యవస్థ పనితీరును ధ్రువీకరించినట్లు తెలిపింది. ఐటీఆర్ ఏర్పాటు చేసిన టెలీమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఈ సమాచారాన్ని సేకరించాయని వివరించింది. 


SFDRను హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ, హైదరాబాద్‌లోని RCI, పుణేలోని HEMRL వంటి ఇతర డీఆర్‌డీవో ల్యాబొరేటరీల సహకారంతో అభివృద్ధి చేశారు. 


SFDR పరీక్షలు విజయవంతమైనందుకు డీఆర్‌డీవోను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. మన దేశంలో అత్యంత ముఖ్యమైన క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఇది మైలురాయి అని పేర్కొన్నారు. 


SFDR డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్‌లలో పాలుపంచుకున్న బృందాలను రక్షణ రంగ పరిశోధన శాఖ కార్యదర్శి, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్ రెడ్డి అభినందించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో గగనతలం నుంచి గగనతలానికి మిసైల్స్ పరిధిని విస్తరించవచ్చునని తెలిపారు. 


Updated Date - 2022-04-08T22:54:43+05:30 IST