న్యూఢిల్లీ : నవతరం క్షిపణి ఆకాశ్-ఎన్‌జీని డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని మన దేశంలోనే అభివృద్ధి చేశారు. భూమి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించేందుకు ఉపయోగపడే ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ నుంచి ప్రయోగించారు. ఇది 30 కిలోమీటర్ల పరిధిగల గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ. దీనిని భారత వాయు సేనలో ప్రవేశపెడితే మన దేశ గగనతల రక్షణ సామర్థ్యం మరింత పెరుగుతుంది.
డీఆర్‌డీవో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో నవతరం ఆకాశ్ (ఆకాశ్-ఎన్‌జీ) క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. దీనిని శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. అత్యంత వేగంగా ప్రయాణించే మానవ రహిత గగనతల లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా నిరోధించినట్లు వివరించింది. ఈ పరీక్ష వల్ల స్వదేశంలో తయారైన ఆర్ఎఫ్ సీకర్, లాంచర్, మల్టీ ఫంక్షన్ రాడార్, కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టమ్ పనితీరు సక్రమంగా ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. గాలి, వానలతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రయోగం జరిగిందని, దీంతో ఈ ఆయుధ వ్యవస్థ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని స్పష్టమవుతోందని తెలిపింది. ఈ ప్రయోగాన్ని భారత వాయు సేన అధికారుల బృందం వీక్షించినట్లు పేర్కొంది.