డీఆర్‌డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 3 కోట్లు వసూలు

ABN , First Publish Date - 2021-04-13T12:04:10+05:30 IST

డీఆర్‌డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల్ని మోసం చేసి

డీఆర్‌డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 3 కోట్లు వసూలు

  • 122 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు
  • పోలీసులకు బాధితుల ఫిర్యాదు

హైదరాబాద్/వనస్థలిపురం : డీఆర్‌డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల్ని మోసం చేసి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌. సాయినాథ్‌(35) వనస్థలిపురం, శారదానగర్‌ కాలనీ ఫేజ్‌-3 కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడు డీఆర్‌డీవో డైరెక్టర్‌ సదానంద్‌చారి వద్ద పీఏనని ఉద్యోగాలు ఇప్పిస్తాననీ వనస్థలిపురంతో పాటు పలు కాలనీలకు చెందిన సుమారుగా 122 మంది నిరుద్యోగ యువకుల నుంచి 3 కోట్ల రూపాయలను వసూలు చేశాడు. డీఆర్‌డీవోలోని పలు విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కో నిరుద్యోగి నుంచి 5లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందు రూ. 2.50 లక్ష రూపాయలను వసూలు చేశాడు. 


2020 ఏప్రిల్‌ నుంచి దందాను సాగించాడు. డీఆర్‌డీవో డైరెక్టర్‌ లెటర్‌ ప్యాడ్‌, ముద్రలను ఈ దందాకు ఉయోగించి, నకిలీ అపాయింట్‌మెంట్‌ పత్రాలు, ఐడీ కార్డును సృష్టించాడు. 2021 ఫిబ్రవరి మొదటి వారంలో విధులకు హాజరుకావాలని తప్పుడు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను సృష్టించాడు. కరోనా కారణంగా 3 నెలల తరువాత విఽధులకు హాజరుకావాలని తిరిగి నిరుద్యోగులందరికి డైరెక్టర్‌ పేరుమీద  లేఖలు పంపించాడు. ముందుగా డీఆర్‌డీవోలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నట్లు సూర్యనారాయణ అనే వ్యక్తిని బాధితులకు పరిచయం చేసి దందాను కొనసాగించాడు. ఈ క్రమంలో వనస్థలిపురం అభ్యుదయనగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాసరావు, నాగశైలజ దంపతులకు డీఆర్‌డీఎల్‌లో అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.50 లక్షల రూపాయలను వసూలు చేశాడు.


నిందితుడు సాయినాథ్‌ ఇంట్లో పని మనిషి పద్మ నుంచి కూడా రూ. 1.50 లక్షలు వసూలు చేశాడు. అనుమానం వచ్చిన నాగశైలజ, శ్రీనివాసరావు దంపతులు బాధితుడు సాయినాథ్‌ను  నిలదీసి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సాయినాఽఽథ్‌ కొంత కాలంగా వీరి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులంతా సోమవారం సాయినాఽథ్‌ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం నాగశైలజ, శ్రీనివాసరావు దంపతులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-13T12:04:10+05:30 IST