పంచాయతీరాజ్‌లోకి డీఆర్‌డీఏ

ABN , First Publish Date - 2021-03-01T05:12:38+05:30 IST

జిల్లా గ్రామీణాభివృద్ది ఏజెన్సీ (డీఆర్‌డీఏ)ని పంచాయతీరాజ్‌ (పీఆర్‌)లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా డీఆర్‌డీఏ సర్వీసు రిజిష్టర్‌లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం డీఆర్‌డీఏలో 16 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.

పంచాయతీరాజ్‌లోకి డీఆర్‌డీఏ
ప్రభుత్వం జారీ చేసిన జీవో

వైఎ్‌సఆర్‌ క్రాంతిపధం ప్రశ్నార్థకం

అందోళనలో సిబ్బంది

సమావేశాల ఏర్పాటుకు సన్నాహాలు

ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 28 : జిల్లా గ్రామీణాభివృద్ది ఏజెన్సీ (డీఆర్‌డీఏ)ని పంచాయతీరాజ్‌ (పీఆర్‌)లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా డీఆర్‌డీఏ సర్వీసు రిజిష్టర్‌లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం డీఆర్‌డీఏలో 16 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఇరువురు మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. మిగిలిన 14 మందిలో కొంతమంది వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం గ్రామీణాభివృద్ధిలో డీఆర్‌డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. ఆర్హులైన పేదలకు పింఛన్లు, ఆర్థికసాయం తదితర అభివృద్ధి పనులను డీఆర్‌డీఏ ద్వారా అమలు చేశారు. కాలానుగుణంగా ప్రభుత్వాలు అనేక మార్పులు తీసుకురావడంతో గ్రామీణాభివృద్ధిలో డీఆర్‌డీఏ పాత్ర సన్నగిల్లుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను డీఆర్‌డీఏ ద్వారా అర్హులకు చేరవేసి, పేదల అభివృద్ధి కోసం పనిచేస్తున్న సిబ్బందికి కూడా కేంద్ర ప్రభుత్వమే వేతన నిధులు సమకూర్చేది. ఈ క్రమంలో వచ్చే నూతన ఆర్థిక సంవత్సరం నుంచి తాము డీఆర్‌డీఏకు వేతన నిధులు ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని పంచాయతీరాజ్‌లోకి తీసుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింది. సర్వీసు రిజిష్టర్లు పరిశీలించడంతో పాటు వారిని ఏ హోదాలో సర్దుబాటు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 


వైఎ్‌సఆర్‌ క్రాంతిపధం ప్రశ్నార్థకమే?

డీఆర్‌డీఏ అనుబంధంగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నేతృత్వంలో పనిచేస్తున్న వైఎస్‌ఆర్‌ క్రాంతిపధం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. పేదరికాన్ని తరిమికొట్టేందుకు 2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారు. వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి మహిళల్లో ఐక్యతతో పాటు, పొదుపును అలవరిచారు. దీంతో నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి లభించింది. ప్రతి గ్రామ అవాస ప్రాంతాల్లోని అన్ని కుటుంబాలను సమావేశపరచి, గ్రామసభలను నిర్వహించారు. అతి నిరుపేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలను ఈ గ్రామసభల ద్వారా గుర్తించారు. ఏ వర్గానికి ఎలాంటి సాయం చేస్తే వారి జీవనోపాదులు మెరుగుపడతాయనే అలోచనలు చేసి అయా వర్గాలను బృందాలుగా ఏర్పాటు చేసి పేద కుటుంబాల్లో అప్పటి ప్రభుత్వం వెలుగు నింపింది. మహిళా సంఘాలు అర్థికాభివృద్ది సాధిస్తుండటంతో వారు అడిగిందే తడవుగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించారు. 2006లో వెలుగు పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇందిరాక్రాంతిపథంగా మార్పులు చేసి సేవలందించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇందిరాక్రాంతిపథాన్ని తిరిగి వెలుగు ప్రాజెక్టుగా మార్పు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వెలుగు పథకాన్ని వైఎ్‌సఆర్‌ క్రాంతిపథం పేరుతో పనులు చేయించుకుంటున్నప్పటికీ చంద్రబాబు మానస పుత్రికగా చెబుతున్న వెలుగు పథకాన్ని పూర్తిగా లేకుండా చేసే అలోచనలో ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే వైఎ్‌సఆర్‌ క్రాంతిపథం మనుగడ ప్రశ్నార్థకమే.


ఆ0దోళనలో సిబ్బంది

వేలాది కుటుంబాల్లో వెలుగు నింపిన తమ జీవితాల్లో చీకట్లు అలుముకునే పరిస్థితులు వస్తున్నాయని వైఎ్‌సఆర్‌ క్రాంతిపథం సిబ్బందిలో అందోళన మొదలైంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలును గ్రామ సచివాలయ వ్యవస్థకు అప్పగించారని, ఇందులో ప్రధానంగా ప్రతి నెలా సామాజిక పింఛన్ల మంజూరు, నిధులు కూడా డీఆర్‌డీఎకు వచ్చేవి. ఇపుడు నేరుగా సచివాలయాలకే వెళ్తున్నాయని, చేయూత, ఆసరా లాంటి పథకాలు కూడా సచివాలయాల ద్వారా అమలవుతున్నాయి. ఇపుడు ఏకంగా డీఆర్‌డీఏను పంచాయతీరాజ్‌లోకి విలీనం చేయడమంటే, బిడ్డ నుంచి తల్లిని దూరం చేయడమే అవుతుందని వైఎ్‌సఆర్‌కేపీ సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో వివిధ హోదాల్లో సుమారు 300 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్పుల వల్ల తమ భవిష్యత్తు ఏమిటనే అంశాలపై చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేసుకునే దిశగా సిబ్బంది సమాయత్తమవుతున్నారు. 


నిబంధనలు ఏమీ రాలేదు 

- మురళీమనోహర్‌, పీడీ, డీఆర్‌డీఏ

డీఆర్‌డీఏను పంచాయతీరాజ్‌లోకి విలీనం చేస్తున్నట్లు స్పష్టంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. అందుకు సంబంధించిన నిబంధనలు కూడా మాకు అందలేదు. ఇప్పటి వరకు డీఆర్‌డీఏ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేది. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి కేంద్రం వేతనాలు ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీఏ సిబ్బంది సర్వీసు రిజిష్టర్లు పరిశీలిస్తోంది. భవిష్యత్తులో వీరిని ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చు. 

Updated Date - 2021-03-01T05:12:38+05:30 IST