ఆపదలో అండ ఏది ?

ABN , First Publish Date - 2021-02-25T04:57:57+05:30 IST

ప్రస్తుతం నవరత్నాల పేరుతో వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నది. అయితే ఆపదలో ఉన్న వారి వైపు మాత్రం చూడడం లేదు.

ఆపదలో అండ ఏది ?

పథకాల కోసం ఎదురుచూపులు

బీమా, పెళ్లికానుక స్కీమ్‌లకు గ్రహణం

దాదాపుగా ఏడాది నుంచి అందని నగదు

జిల్లాలో 9 వేల కుటుంబాల నిరీక్షణ

పాతది అటుంచితే.. వైఎస్‌ఆర్‌ బీమాలోనూ దక్కిని దీమా

పేదల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం ఇక లేనట్లే..!


నెల్లూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం నవరత్నాల పేరుతో వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నది. అయితే ఆపదలో ఉన్న వారి వైపు మాత్రం చూడడం లేదు. పలువురు కుటుంబ సభ్యులను కోల్పోయి బతుకుబండిని కష్టంగా లాగిస్తున్నారు. ఇంకొందరు నిరుపేదలు పెళ్లిళ్లు చేసుకొని కనీస వసతులు కూడా లేకుం డా జీవిస్తున్నారు. ఈ రెండు వర్గాల బాధితుల కోసం గత ప్రభుత్వం చంద్రన్న బీమా, పెళ్లికానుక పేర్లతో ఆర్థికంగా అండదండలు అందిస్తుండేది. దాంతో ఎంతో కొంత కష్టాల నుంచి ఉపశమనం పొందుతుండేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాదాపు గడిచిన ఏడాది నుంచి ఈ వర్గాలకు చేయూతనిచ్చేవారు కరువయ్యారు. కుటుంబ సభ్యు లను కోల్పోయిన వారికి, పెళ్లిళ్లు చేసుకున్న నిరుపేదలకు నెలలోపే నిర్దేశించిన ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలో జమవుతుండగా, ఇప్పుడు ఆ నెల కాస్తా ఏడాది కావస్తున్నా జమకాని పరిస్థితి. జిల్లాలో సుమారు 9 వేల కుటుంబాలు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. 


 కుటుంబాలకు దిక్కెవరు ?


 మనుబోలుకు చెందిన ఓ పేద కుటుంబానికి జీవనాధారమైన ఇంటిపెద్దకు ఆరోగ్యం క్షీణించింది. ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో అప్పు చేసి చెన్నైలో చికిత్స చేయించారు. సుమారు రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి చనిపోయాడు. దీంతో ఇటు కుటుంబాన్ని పోషించే దిక్కును కోల్పోయి, అటు అప్పులు మిగిలి ఆ పేద కుటుంబం నానా అవస్థలు పడుతోంది. ఈ వ్యక్తి మరణించి ఆరు నెలలు కావస్తున్నా ఇంత వరకు బీమా సొమ్ము లభించలేదు. ఆ నగదైనా వచ్చి ఉంటే ఆ కటుంబానికి కొంత ఆదరవుగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి బాధలను జిల్లాలో కొన్ని వేల కుటుంబాలు అనుభవిస్తున్నాయి.


గతంలో తక్షణ సాయం


 గతంలో చంద్రన్న బీమా పథకం అమల్లో ఉన్నప్పుడు వ్యక్తి మరణిస్తే రూ.25 వేలను తక్షణ సాయం కింద అందించేవారు. ఆ తర్వాత నెల రోజుల్లోపు ఆ కుటుంబ సభ్యులకు మిగిలిన నగదు అందేది. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్‌ తర్వాత జిల్లాలో బీమా చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారు ఐదు వేలమందికి సంబంధించిన దరఖాస్తులు బీమాకు అందాయి. కానీ ఒక్కటి కూడా మంజూరు కాలేదు. ఇక గతేడాది అక్టోబరు నుంచి వైఎస్‌ఆర్‌ బీమా పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో ఇంటి యజమానికి మాత్రమే బీమా వర్తిస్తుంది. గత అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 44 మందికి సంబంధించి బీమా క్లెయిమ్‌లు అందినట్లు డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఐదునెలల్లో కేవలం 44 మందేనా చనిపోయిందన్న అనుమా నం సహజంగా కలగవచ్చు. దీనికి అధికారులే సమాధానం చెప్పాలి. ఇలా పాత పథకంలోని లబ్ధిదారులకే కాకుండా కొత్త పథకంలోని లబ్ధిదారులకు కూడా బీమా సొమ్ము అందడం లేదు. ఈ ప్రభావం పేద కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. 


అందని పెళ్లి కానుక


నెల్లూరులోని ఓ పేదజంటకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఆ రెండు కుటుంబాలు రోజువారీ కూలి చేసుకొని జీవిస్తుంటాయి. పెళ్లికానుక నగదు అందితే కొత్త కాపురానికి అవసరమైన కనీస సామగ్రిని కొనుక్కోవచ్చని ఆ పేద జంట భావించింది. ఇందుకోసం పెళ్లికానుకకు దరఖాస్తు కూడా చేసుకుంది.  దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఆ జంటకు ఆర్థిక సాయం  అందలేదు. గతంలో పెళ్లికానుక పేరుతో పే ద జంటల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్థికసాయం అందిస్తుండేది. అయితే దాదాపు ఏడాది కాలంగా ఈ సాయం అందడం లేదు. ఏడాది క్రితం వరకు జిల్లాలో 3597 పేద కుటుంబాలకు పెళ్లికానుక సాయం పెండింగ్‌లో ఉంది. కాగా ప్రస్తుతం పెళ్లికానుక దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఈ పథకానికి ప్రభుత్వం స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త జంటల దరఖాస్తులు తీసుకోవ డం లేదు.


పెళ్లికానుకపై ఎలాంటి ఆదేశాలు లేవు 


పెళ్లికానుక పథకం కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు  అందలేదు. పాత దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసి పంపమని ఆదేశాలు వచ్చాయి. ఆ వివరాలు పంపాం. మేలోగా బీమా ప్రక్రియ పూర్తి చేయమని  కూడా ఆదేశాలు అందాయి. 

- సాంబశివారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ 

Updated Date - 2021-02-25T04:57:57+05:30 IST