ఎమ్మెల్యేల జలజగడం

ABN , First Publish Date - 2022-05-19T06:28:52+05:30 IST

కొత్త జిల్లా తొలి డీఆర్సీ భేటీలో ఎమ్మెల్యేల మధ్య జల జగడం సాగింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డితో పెనుకొండ, మడకశిర ఎమ్మెల్యేలు శంకర్‌నారాయణ, తిప్పేస్వామి వాగ్వాదానికి దిగారు.

ఎమ్మెల్యేల జలజగడం

మేం అడ్డుకుంటే మీకు నీళ్లొస్తాయా?

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి

అధిక నీటి వాటా కోసం పట్టు

విభేదించిన మడకశిర, పెనుకొండ ఎమ్మెల్యేలు

తమ ప్రాంత రైతుల పరిస్థితి ఏమిటని వాగ్వాదం

కొత్త జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి

డీఆర్సీ భేటీలో ఇనచార్జి మంత్రి జయరాం

పుట్టపర్తి, మే 18 (ఆంధ్రజ్యోతి)

కొత్త జిల్లా తొలి డీఆర్సీ భేటీలో ఎమ్మెల్యేల మధ్య జల జగడం సాగింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డితో పెనుకొండ, మడకశిర ఎమ్మెల్యేలు శంకర్‌నారాయణ, తిప్పేస్వామి వాగ్వాదానికి దిగారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ), నీటి పారుదల సలహా మండల సమావేశాలను కలెక్టర్‌ బసంతకుమార్‌ అధ్యక్షతన పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో నిర్వహించారు. అన్ని శాఖలపై ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అఽధికారులు సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇనచార్జి, రాష్ట్ర కార్మిక ఉపాధి, కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లా అబివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. 

సమావేశం చివరలో నీటి పారుదల శాఖపై సమీక్షించారు. హంద్రీనీవా నీటి కేటాయింపుపై చర్చించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డితో పెనుకొండ, మడకశిర ఎమ్మెల్యేలు శంకరనారాయణ, తిప్పేస్వామి వాగ్వాదానికి దిగారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి మడకశిర బ్రాంచ కాలువ నీటి వాటాపై రాప్తాడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేరూరు డ్యాం నింపిన తరువాతే తీసుకోవాలన్నారు. వచ్చే సీజనలో నీటిని ఎక్కువగా తన నియోజకవర్గానికే కేటాయించాలని పట్టుబట్టారు. ఇందుకు పెనుకొండ, మడకశిర ఎమ్మెల్యేలు శంకరనారాయణ, తిప్పేస్వామి ఘాటుగా స్పందించారు. ఎక్కువ కేటాయింపులు రాప్తాడుకే ఇస్తే తమ ప్రాంత రైతులు ఏం కావాలన్నారు. గతంలో జరిగిన నీటి ఒప్పందం ప్రకారం ఈ ఏడాది కూడా పంచుకుందామన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం తలెత్తింది. ‘వంద కిలోమీటర్లు రాప్తాడు నియోజకవర్గంలోనే హంద్రీనీవా కాలువ ఉందనీ, మేం అడ్డుకుంటే మీకు నీళ్లు ఎలా వస్తాయ’ని ప్రకాశరెడ్డి ఎదురు ప్రశ్నవేశారు. మడకశిర ప్రాంతానికి 140 రోజులు ఇచ్చినా.. మూడు చెరువులు కూడా నింపుకోలేరన్నారు. ఓ సందర్భంలో ఐదుగురు  ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మధ్య హంద్రీనీవా నీటి కేటాయింపులపై వాదోపవాదాలు సాగాయి. ఎంపీ గోరంట్ల మాధవ్‌ జోక్యం చేసుకుని, విషయంపై పార్టీ పెద్దలతో చర్చిద్దామని చెప్పుకొచ్చారు. అయినా కాసేపు గొళ్లపల్లి బ్రాంచ కాలువ నీటి కేటాయింపులపై ఓ స్థాయిలో ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో ఇనచార్జి మంత్రి జయరాం జోక్యం చేసుకుని, జలవనరుల శాఖ మంత్రితోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్‌ ఇంజనీర్ల సమక్షంలో చర్చించి, నీటి కేటాయింపులు చేద్దామన్నారు. అయినా గతంలోలానే ఈ ఏడాది కూడా నీటిని కేటాయించాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సమావేశానికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గైర్హాజరయ్యారు.

వచ్చే ఖరీ్‌ఫలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు కేటాయించిన విత్తన సేకరణ ప్రణాళికబద్దంగా సాగాలనీ, నాసిరకంగా విత్తనాలు రాకుండా చూడాలని కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. కదిరి కే-6 రకం విత్తనాలనే పంపిణీ చేయాలని కోరారు. జిల్లా పరిషత చైర్‌పర్సన బోయ గిరిజమ్మ మాట్లాడుతూ... రైతు భరోసా కేంద్రాల పరిధిలో సిబ్బంది తక్కువగా ఉన్నారనీ, వెంటనే అవసరం మేరకు నియమించి, విత్తన పంపిణీ సజావుగా సాగేలా చూడాలన్నారు. కలెక్టర్‌ బసంతకుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజనలో వర్షాలు బాగా కురుస్తున్నాయనీ, రైతుకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... ఉద్యానవన పంట దిగుబడుల కొనుగోలులో దళారీ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. జిల్లాలో చీనీ, దానిమ్మ తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారనీ, దిగుబడులు ఆశాజనకంగా వచ్చినా సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అహమ్మద్‌తోపాటు ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, సిద్దారెడ్డి, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... ఇసుకరీచలు లేక ప్రభుత్వ భవనాలు, ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందిగా మారిందన్నారు. అన్నివర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక సులభంగా దొరికేలా రీచలను గుర్తించాలనీ, లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పుడా పరిధిలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పొజిషన పట్టాలతోపాటు అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపపాలన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి, ముత్యాలంపల్లి, నసనకోట ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనీ, డిజిటల్‌ సర్వే చేసి దానిని అరికట్టాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. మైనింగ్‌ అక్రమాలను నివారించకుండా జిల్లాలో అడిగిన వెంటనే రెన్యూవల్‌ ఎలా చేస్తున్నారని మైనింగ్‌ శాఖ అధికారులను నిలదీశారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ మడకశిరలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రిలో 27 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. ఒక్కరే ఉన్నారన్నారు. విషయం ప్రజలకు తెలిస్తే రాళ్లతో కొడతారనీ, తక్షణమే వైద్యులను నియమించాలని కోరారు.విద్యుత కోతలు తీవ్రంగా ఉన్నాయనీ, సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అజెండాలోని అంశాలను చర్చించేందుకు సమయం సరిపడకపోవడంతో కొన్ని శాఖలతో సరిపెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవాల్సి ఉండగా.. గంట ఆలస్యమైంది. సాయంత్రం 6-15 గంటల వరకు కొనసాగింది. సమావేశంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్‌పర్సన లిఖిత, సబ్‌ కలెక్టర్‌ నవీన, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


కలిసికట్టుగా పనిచేయాలి

అంతకుముందు సమావేశంలో మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కొత్త జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి, పరిష్కారానికి పాటుపడాలని సూచించారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు వచ్చే సమావేశం నాటికి పరిష్కారమయ్యేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని 

ఆదేశించారు. 


వాగ్వాదం జరగలేదు

నీటి సమస్యపై చర్చించామంతే

ఇనచార్జి మంత్రి జయరాం

పుట్టపర్తి, మే 18: డీఆర్సీ సమావేశంలో ఎలాంటి వాగ్వాదం తలెత్తలేదని శ్రీసత్యసాయి జిల్లా ఇనచార్జి మంత్రి జయరాం పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. నీటి సమస్యపై ఎంపీ, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలు చర్చించామే తప్ప వివాదాలు లేవన్నారు. నీటి కేటాయింపులు సర్దుబాటు చేస్తామన్నారు. గతంలో మే నెలలో ఎప్పుడూ వర్షం రాలేదనీ, ఇప్పుడు రాజన్న రాజ్యంలో కురిసిందని అన్నారు. మరి.. అకాలవర్షంతో రైతులకు వాటిల్లిన పంటనష్టానికి సంబంధించి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు, ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారని విలేకరులు అడగ్గా.. 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి అభివృద్ధి చేశామని సమాధానం దాటవేశారు.




Updated Date - 2022-05-19T06:28:52+05:30 IST