సభ్యుల ప్రవర్తనకు లక్ష్మణరేఖ గీయాలి

ABN , First Publish Date - 2021-07-16T08:07:43+05:30 IST

చట్ట సభల్లో సభ్యులు అదుపు తప్పిన రీతిలో ప్రవర్తించడం క్షమార్హం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఆనందదాయకం...

సభ్యుల ప్రవర్తనకు లక్ష్మణరేఖ గీయాలి

చట్ట సభల్లో సభ్యులు అదుపు తప్పిన రీతిలో ప్రవర్తించడం క్షమార్హం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఆనందదాయకం. ఫలానా రాష్ట్రమని కాకుండా భారతదేశమంతా చట్టసభల్లో ప్రమాణాలు పడిపోతుండడం విచారకరం. ఒకప్పుడు మేధావుల చర్చలకు, మహానాయకుల ప్రసంగాలకు వేదికలైన చట్టసభల్లో నేడు దిగజారుడు ప్రవర్తన, అసభ్యకరమైన భాష తాండవిస్తుండడం భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయనడానికి నిదర్శనమేమో? సుప్రీంకోర్టు చట్ట సభల్లోని సభ్యుల ప్రవర్తన గురించి మాత్రమే వ్యాఖ్యానించింది. చట్టసభలకు వెలుపల కూడా కొందరు సభ్యుల ప్రవర్తన అనుచితంగాను, తమను ఎన్నుకున్న ప్రజలు తలదించుకునే రీతిలోను ఉంటున్నది. వీరిని అదుపుజేయాల్సిన స్పీకర్లు, గవర్నర్లు రాజకీయ కారణాలతో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇలాంటి సభ్యులను అదుపు చేసే వారే లేకుండా పోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల అధినాయకులిరువురూ ఇటువంటి దిగజారుడు ప్రవర్తనను, అసభ్యకరమైన భాషను పెంచి పోషిస్తున్నవారే. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కొందరు మం త్రులు వాడుతున్న భాష అభ్యంతరకరం. వీరు చట్టసభల్లో ఉండటానికే అనర్హులు అనడం అతిశయోక్తేమీ కాదు. చట్టసభల్లోనూ, చట్టసభలకు వెలుపలా కూడా సభ్యుల ప్రవర్తనకు లక్ష్మణరేఖ గీయాల్సిన సమయమాసన్నమైనది.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2021-07-16T08:07:43+05:30 IST