ప్రధానితో ద్రౌపది భేటీ

ABN , First Publish Date - 2022-06-24T07:21:13+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గురువారం.. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

ప్రధానితో ద్రౌపది భేటీ

వెంకయ్య, అమిత్‌ షాలతో కూడా.. నేడే నామినేషన్‌ దాఖలు

మోదీ, రాజ్‌నాథ్‌, నడ్డా సహాపలువురు ప్రముఖుల హాజరు

దేవెగౌడ పార్టీ మద్దతు ?


న్యూఢిల్లీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గురువారం.. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులనూ కలిశారు. జూలై 18న జరిగే ఎన్నికలకు.. శుక్రవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కేంద్ర మంత్రి వీరేంద్రసింగ్‌ వెంటరాగా.. ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన ద్రౌపది ముర్మును వెంకయ్యనాయుడి భార్య ఉష సాదరంగా స్వాగతించారు. సీఎం కొర్నార్డ్‌ కే సంగ్మా సారథ్యంలోని మేఘాలయ ప్రజాస్వామిక కూటమి (ఎండీఏ) ఆమెకు మద్దతు ప్రకటించింది. బీజేపీ, ఎన్‌డీఏ పక్షాల మద్దతుతో పీఏ సంగ్మా 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీపై పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. భోపాల్లో గిరిజనులతో జరిగిన సమావేశంలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వారితో కలిసి గిరిజన నృత్యాలు చేశారు.


అమ్మకు అంతా మద్దతిస్తారు: కుమార్తె 

తన తల్లి గురించి పూర్తిగా తెలిస్తే.. ప్రతి ఒక్కరూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతిస్తారని ద్రౌపది కుమార్తె ఇతిశ్రీ ముర్ము అన్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభించడానికి ముందు ద్రౌపది ఒడిసా మయూర్‌భంజ్‌ జిల్లా రాయ్‌రంగపూర్‌లోని శ్రీ అరబిందో సమగ్ర విద్య, పరిశోధన కేంద్రంలో టీచర్‌గా పనిచేసేవారు. ‘ఆమె క్రమశిక్షణ కలిగిన తల్లి, ఉపాధ్యాయురాలు. స్కూల్లో కూడా ఆమె నా టీచర్‌. దాంతో నాపై అధిక ఒత్తిడి ఉండేది. ఆకస్మికంగా పరీక్షలు పెట్టేవారు. దీంతో నా స్నేహితులు నాపై ఆగ్రహం వ్యక్తంచేసేవారు’ అని ఇతిశ్రీ గురువారం వెల్లడించారు. ఈమె ప్రస్తుతం భువనేశ్వర్‌లో యూకో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి రాష్ట్రపతిగా ఎన్నికైతే తన ఇద్దరు కుమార్తెలతో ఆమెతోనే ఉంటానని ఇతిశ్రీ చెప్పారు. కాంగ్రెస్‌, టీఎంసీలకు మహిళలే సారథులుగా ఉన్నారని.. వారు కూడా ద్రౌపదికి మద్దతివ్వాలంటారా అని అడుగగా.. ‘అన్ని పార్టీలూ.. నా తల్లి ఎవరు.. ఆమె అభిప్రాయాలు ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అవి తెలిస్తే కచ్చితంగా ఆమెకు మద్దతిస్తారు’ అని బదులిచ్చారు.


ఆమె అభ్యర్థిత్వం చరిత్రాత్మకం 

ఆశ్రమ్‌సంతాలీ గిరిజన తెగకు చెందిన ద్రౌపదిని రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా నిర్ణయించడం చరిత్రాత్మకమని ఆర్‌ఎ్‌సఎ్‌సకు చెందిన అఖిల భారత వనవాసి కల్యాణ్‌ ఆశ్రమ్‌ హర్షం వ్యక్తంచేసింది. అన్ని పార్టీలూ ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పిలుపిచ్చింది. గిరిజన తెగల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకోవాలని సూచించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ తరఫున బరిలోకి దిగుతున్న  ద్రౌపది ముర్ము ఉత్తమ అభ్యర్థి అని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రఽధాని దేవేగౌడ ప్రశంసించారు. 


రాష్ట్రపతి పదవి అన్ని వర్గాలది: కాంగ్రెస్‌

ద్రౌపది ముర్ము గిరిజన నేపథ్యంపై బీజేపీ అతిగా ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాష్ట్రపతి పదవి అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతిబింబమని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ అన్నారు.


రాష్ట్రపతి ఎన్నికలకు జమ్మూకశ్మీరు అసెంబ్లీ దూరం

రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్మూకశ్మీరు కేంద్రపాలిత అసెంబ్లీ పాలుపంచుకోవడం లేదు.  రద్దయిన అసెంబ్లీకి ఎన్నికలు జరగకపోవడమే దీనికి కారణం. రాష్ట్రపతి ఎన్నికలకు సభ దూరంగా ఉండడం ఇది రెండోసారి. 1992లో అసెంబ్లీని రద్దుచేయడంతో ఎమ్మెల్యేలు ఓటేయలేదు. ఈ సారి ఎమ్మెల్యేలు వేయకపోయినా అక్కడి ఐదుగురు లోక్‌సభ ఎంపీలు మాత్రం ఓటేస్తారు. 1974లో గుజరాత్‌, 1982లో అసోం, 1992లో నాగాలాండ్‌ అసెంబ్లీలను రద్దుచేయడంతో అప్పట్లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదు.

Updated Date - 2022-06-24T07:21:13+05:30 IST