అధ్యక్షస్థానంలో ద్రౌపది, ఆదివాసీల్లో ఆశలు

ABN , First Publish Date - 2022-07-20T06:34:38+05:30 IST

తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం పట్ల దేశంలోని 10 కోట్ల మంది ఆదివాసీలు ఎంతో ఆనందం పొందారని ద్రౌపది ముర్ము రెండు రోజుల క్రితం పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీలతో మాట్లాడుతూ అన్నారు...

అధ్యక్షస్థానంలో ద్రౌపది, ఆదివాసీల్లో ఆశలు

తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం పట్ల దేశంలోని 10 కోట్ల మంది ఆదివాసీలు ఎంతో ఆనందం పొందారని ద్రౌపది ముర్ము రెండు రోజుల క్రితం పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీలతో మాట్లాడుతూ అన్నారు. ఒక ఆదివాసీ మహిళను, అంతకు ముందు ఒక దళిత నేతను రాష్ట్రపతిగా ఎంచుకోవడం దేశ రాజకీయాల్లో మంచి పరిణామమే, సందేహం లేదు. అయితే ఈ నియామకాల వల్ల ఆదివాసీలు, దళితుల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అన్నది చర్చనీయాంశం. నిజానికి ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు న్యాయమూర్తుల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక న్యాయం ఇంకా సామాన్యుల చేరువలోకి రాలేదని, ముఖ్యంగా ఆదివాసీలకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. ఇప్పుడు రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత రాజ్యాంగం తనకు నిర్దేశించిన బాధ్యతల ప్రకారం వ్యవహరిస్తానని ఆమె అంటున్నారు. రాజ్యాంగంలో ఆదివాసీల ప్రయోజనాల పరిరక్షణకు ఉన్న ప్రత్యేక నిబంధనలను నిజంగా అమలు చేస్తే అంతకంటే కావల్సింది ఏమీ ఉండదు.


తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు ఆదివాసీల ధైర్యసాహసాలకు ప్రతీక ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలను తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. రాజ్యాంగాధినేతలు చెప్పే ఆదర్శాలకూ, వాస్తవాలకూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆదివాసీల హక్కులకోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక ప్రత్యేక నిబంధనలు ఇవాళ ఉల్లంఘనకు గురవుతున్నా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. షెడ్యూల్డు ప్రాంతాల్లో పంచాయతీ విస్తరణ చట్టం(పెసా), అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టం మొదలైనవి ఉల్లంఘనకు గురయ్యాయి. గనులు, ఖనిజ వనరుల చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలు ఈ చట్టాలను ఉల్లంఘించడమే కాక, జాతీయ ప్రయోజనాలను విస్మరించి ప్రైవేట్ మైనింగ్ యజమానుల ప్రయోజనాలకు అనుకూలంగా రూపొందించారని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఇటీవల కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం గత నెల 28న నోటిఫై చేసిన అటవీ సంరక్షణ నిబంధనలు అటవీ హక్కుల చట్టాన్ని కాలరాచాయని, ప్రాజెక్టు అనుమతుల విషయంలో గ్రామసభల పాత్ర లేకుండా చేశాయని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఇంత విస్తృత మార్పులు చేయడం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ బాధ్యతలనుంచి తప్పించుకోవడమేనని విమర్శలు వచ్చాయి. కార్పొరేట్లు అడవులను ఆక్రమించుకోవడానికే ఈ నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించినవారున్నారు.


ఆదివాసీల ప్రయోజనాలు దెబ్బతినడం మాత్రమే కాదు, వారు తీవ్ర దారుణాలకు లోనవుతున్నారని దేశంలో జరుగుతున్న ఘటనలు పరిశీలించిన వారికి అర్థమవుతుంది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్బంగా తరిచి చూస్తే గత పదేళ్లలో ఆదివాసీల పట్ల 80 వేల నేరాలు జరిగాయని తెలుస్తుంది. వారిపై 2020లో 8,272 దారుణాలు జరిగాయని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో తెలిపింది. ఇక నమోదు కాని దారుణాల సంగతి చెప్పలేము.డీ–నోటిఫైడ్ ఆదివాసుల గురించి ఈ బ్యూరో రికార్డు చేయనే లేదు. మధ్యప్రదేశ్‌లో వ్యభిచార ఉచ్చులో ఇరుక్కున్నవారు, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల పేరుతో దారుణాలు ఎదుర్కొంటున్నవారు, అనేక రాష్ట్రాల్లో నిర్వాసితులైనవారు, బలవంతంగా తొలగింపునకు గురైనవారు, భూ హక్కుల కోసం పోరాడుతున్నవారు ఆదివాసీల్లో వేలాది మంది ఉన్నారు. ఆదివాసీల్లో 41 శాతం నిరక్షరాస్యులు కాగా, 41 శాతం దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారని, అంటువ్యాధులు, పోషకార విలువలు లేకపోవడం వంటి రుగ్మతలకు అత్యధికంగా లోనవుతున్నది కూడా వారేనని సామాజిక శాస్త్రవేత్త శిరీష్ భండార్కర్ తెలిపారు.


మన దేశంలో కేసులు విచారణ దశలో ఉన్నవారే 3.5 లక్షలకు మందికి పైగా ఉన్నారని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల జైపూర్‌లో జరిగిన న్యాయసేవల అథారిటీ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. అయితే, వారిలో 73 శాతం మంది దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాల వారేనని ఆయన చెప్పలేదు. ఈ లెక్కలను ఎన్‌సిఆర్‌బి ఎప్పుడో విడుదల చేసింది. అసలు మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పూర్తిగా సామాన్యులకు వ్యతిరేకంగా ఉన్నదన్న విషయం దేశంలో వార్తాపత్రికలు చదివే వారందరికీ అర్థమవుతుంది. ఒక నేరానికి పాల్పడ్డ వ్యక్తికి ఏడేళ్లు శిక్షపడాల్సి ఉండగా, అతడు పదేళ్లకు పైగా జైలులో మగ్గడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఆ అభాగ్యుడికి రూ. 7.5 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విడుదల తేదీ దాటిపోయినా జైలులోనే ఏళ్ల తరబడి బందీ చేయడం రాజ్యాంగంలోని 19(డి), 21 అధికరణలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, సిటి రవికుమార్ స్పష్టం చేశారు.


న్యాయసేవల అథారిటీ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎడాపెడా నిర్విచక్షణగా అరెస్టులు జరుగుతున్నాయని, బెయిల్ పొందడం కష్టతరంగా మారిందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యమంటే బలమైనవారికి ఎన్ని అవకాశాలుండాలో, బలహీనులకు కూడా అన్నే అవకాశాలుండడమే అన్న మహాత్మాగాంధీ సుభాషితాన్ని ఆయన ఉటంకించారు. విచారణ దశలోనే పెద్ద ఎత్తున ఖైదీలు జైళ్లలో మగ్గేందుకు కేవలం న్యాయవ్యవస్థ కారణం కాదని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. క్రిమినల్ జస్టిస్ నిర్వహణ సామర్థ్యం పెరగాలని, పోలీసులకు సరైన శిక్షణ ఇవ్వాలని, జైలు వ్యవస్థను ఆధునికీకరించాలని ఆయన సూచించారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచనప్పుడు, మౌలిక సదుపాయాలను ఏర్పర్చలేనప్పుడు కేసులు పెండింగ్‌లో పడితే ఎవరిది తప్పు? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే మెజారిటీయే తమ అభిప్రాయాన్ని రుద్దడం కాదని, ప్రజల స్వరాన్ని ప్రతిబింబించడమని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు సరైన చర్చలు లేకుడా చట్టాలు జరుగుతున్నాయని ఛీఫ్ జస్టిస్ రమణ అన్నారు. ఇంతకూ న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఏనాడైనా దేశంలో ఆ అవసరమైన మార్పులు తీసుకువచ్చాయా?


క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో కేసులు పెండింగ్‌లో పడడం, వనరులు లేకపోవడం, అధికార వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం మాత్రమే కాదు, శిక్ష విధించే తీరుతెన్నులు కూడా అని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ తన తాజా నివేదికలో తెలిపింది. హింసతో నిమిత్తంలేని నేరాలకు కూడా సుదీర్ఘకాలం శిక్షలు పడుతున్నాయని తెలిపింది. చిన్నచిన్న నేరాలకు కూడా మూడు నెలల నుంచి రెండేళ్ల వరకు శిక్షలు పడుతున్నాయని పేర్కొంది. అసలు శిక్షాకాలానికి ఒక హేతుబద్ధత ఉండదని అభిప్రాయపడింది. నేరం– శిక్ష వ్యవహారాలపై సమగ్ర సమీక్ష జరగాల్సి ఉంది.


భారతదేశంలో జైలు శిక్ష విధించే నిబంధనలను ఎత్తివేయాలని చాలా రోజులుగా వ్యాపార సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక వైపు వ్యాపారాన్ని సులభతరం చేయాలని అంటూ మరో వైపు జైలు శిక్ష విధించే నిబంధనలు ఉండటమేమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు భారత దేశ వ్యాపార చట్టాల్లోనే 26,134 జైలు క్లాజులు ఉండడం గమనార్హం. ప్రతి దానికీ జైలును ఒక నియంత్రించే పరికరంగా ఉపయోగిస్తున్నారు. వ్యాపారాన్ని నిర్వహించే విషయంలో దేశంలో 1536 చట్టాలు ఉండగా, వాటిలో కేంద్ర స్థాయిలో 678 చట్టాలను అమలు చేస్తారు. ఇవి కాక అడుగడుక్కూ నిబంధనలు మారుస్తారు, అనేక నిబంధనలను ఉల్లంఘిస్తే చాలా సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కార్మిక చట్టాల్లో కూడా జైలు శిక్ష విధించే క్లాజులు అనేకమున్నాయి. వ్యాపార చట్టాల్లో జైలు శిక్షపడే అత్యదిక క్లాజులు ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉన్నది. అయితే ఎంతమంది వ్యాపారస్తులకు ఇవాళ దేశంలో శిక్షలు విధిస్తున్నారు?


నిజానికి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తులకు శిక్షపడే వాతావరణాన్ని క్రమంగా సడలిస్తూ వస్తోంది. కంపెనీల చట్టంలో అనేక మార్పులు చేసింది. కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత కోసం నిధులు ఖర్చు పెట్టకపోతే జైలు శిక్ష విధించాలని 2019లో ఒక సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. కార్పొరేట్ ప్రపంచం గగ్గోలు పెట్టడంతో రెండువారాల్లో ఈ జైలు శిక్ష నిబంధనను తొలగించారు. పెనాల్టీ విధించి ఆ నిధులను ప్రభుత్వం సూచించిన నిధికి మళ్లిస్తారు కాని శిక్ష ఉండదు. క్రమ క్రమంగా వ్యాపారస్తులకు జైలు శిక్ష విధించడాన్ని మారుస్తూ చట్టాలను సవరించే క్రమం ప్రారంభమైంది. దేశంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు ప్రధాన లేబర్ కోడ్‌లుగా మారుస్తున్నారు. వీటి ప్రకారం కూడా శిక్ష విధించే నిబంధనలు సగానికి సగం తగ్గిపోయే అవకాశాలున్నాయి.


వ్యాపారస్తులంటే తమకు శిక్ష పడకుండా ఉండేందుకు రకరకాల సాధనాలు ఉపయోగిస్తారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టినా అవసరమైతే విదేశాలకు వెళ్లేందుకు సిద్ధపడతారు. ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, బెయిల్ డబ్బు చెల్లించుకోలేని నిర్భాగ్యులు పోలీసుల ఉచ్చునుండి ఎలా తప్పించుకోగలుగుతారు? ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గకుండా తమను తాము ఎలా కాపాడుకోగలుగుతారు? ఛత్తీస్‌ఘడ్‌లో యుఏపిఏ క్రింద జైలులో మగ్గిన 121 మంది ఆదివాసీలు నిర్దోషులని అయిదేళ్ల తర్వాత ఒక ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం విడుదల చేయడం గమనార్హం. వారు కోల్పోయిన ఐదేళ్ల జీవితానికి ఎవరు బాధ్యులు? స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేయడం ఒక మంచి పరిణామమే. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేయడం ద్వారా ఒక రాజకీయ సందేశాన్ని పంపడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయం సాధించారు. అయితే ఆమె రాష్ట్రపతిగా ఉన్న కాలంలో నిర్భాగ్యులైన ఆదివాసీలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే ఈ నియామకానికి సార్థకత లభిస్తుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-07-20T06:34:38+05:30 IST