రూ. కోట్లు వెచ్చించారు.. వదిలేశారు!

ABN , First Publish Date - 2021-01-19T06:15:12+05:30 IST

ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదించిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోంది.

రూ. కోట్లు వెచ్చించారు.. వదిలేశారు!
ఒంగోలు ప్రగతి భవన్‌ ఆవరణలో నిరుపయోగంగా పడి ఉన్న డ్రెయిన్‌ క్లీనింగ్‌ వాహనాలు

ఒంగోలు ప్రగతి భవన్‌లో నిరుపయోగంగా డ్రెయిన్‌ క్లీనింగ్‌ మిషన్లు

లబ్ధిదారులను మార్చాలని మరోవైపు యత్నం!

ఆందోళనలో గతంలో ఎంపికైన వారు

ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల కాలయాపన

అలాగే వదిలేస్తే పనికిరాకుండా పోయే ప్రమాదం

పేద యువతకు ఉపాధినివ్వాల్సిన విలువైన యంత్రాలు బోరుమంటున్నాయి. బడుగువర్గాలకు చెందిన నిరుద్యోగులకు అందాల్సిన పరికరాలు తుప్పుపట్టిపోతున్నాయి. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన వాటిని ఏళ్ల తరబడి లబ్ధిదారులకు అందించకుండా అధికారులు కాలయాపన చేస్తుండటంతో నిరుపయోగంగా పడి ఉన్నాయి. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పేద యువతకు ఉపాధి కల్పించాలనే సదాశయం నీరుగారుతోంది. వారికి ఇచ్చేందుకు మూడేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన డ్రెయిన్‌ క్లీనింగ్‌  మిషన్లు పంపిణీకి నోచుకోక నేటికీ దక్షిణ బైపాస్‌ రోడ్డులోని ప్రగతిభవన్‌ ఆవరణలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. ఏళ్లు గడుస్తుండటంతో పాడైపోతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు అదిగోఇదిగో అంటూనే ఉన్నారు కాని పంపిణీని మాత్రం వాయిదా వేస్తూ ఉన్నారు. దీనివెనుక లబ్ధిదారులను మార్చాలంటూ అధికార పార్టీ  వారి నుంచి  వస్తున్న ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలున్నాయి.


ఒంగోలు నగరం, జనవరి 18: ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదించిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోంది. అందుకు కార్పొరేషన్‌ రుణాలు, సబ్సిడీపై అందించే రవాణా వాహనాలను అందించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇవన్నీ కాకుండా గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసి జిల్లాకు సరఫరా చేసిన విలువైన వాహనాలు, మిషన్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించటంతోపాటు గ్రామాల్లో మురుగును ఎత్తిపోసేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా డ్రెయిన్‌ క్లీనింగ్‌ మిషన్లను అందించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టర్‌ ఇంజన్‌కు డ్రైక్లీన్‌ మిషన్‌ను అమర్చి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో వాహనాన్ని రూ.15,62,000కు కొనుగోలు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు వీటిని రాష్ట్రస్థాయిలోనే కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. ఇందులోభాగంగా జిల్లాకు 56 వాహనాలను పంపించారు. గత ప్రభుత్వ హయాంలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ఇందులో సగం వాహనాలను రెండేళ్ల క్రితమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన 28 వాహనాలను ఇంతవరకూ పంపిణీ చేయనేలేదు. వీటి విలువ రూ.4.37కోట్లపైనే ఉంటుంది. 


పంచాయతీల ఆధ్వర్యంలోనే నిర్వహణ

ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఈ వాహనాల నిర్వహణ బాధ్యతలను ఆయా మండల కేంద్రాల్లోని మేజర్‌ పంచాయతీలకు అప్పగించారు. పేరుకు ఎస్సీ లబ్ధిదారుడికే పంపిణీ చేస్తున్నప్పటికీ వారు ఆ వాహనాన్ని గ్రామపంచాయతీ పర్యవేక్షణలో నడపాల్సి ఉంది. వారు నెలవారీ చెల్లించే సొమ్మును లబ్ధిదారుడికి కాకుండా ఎస్సీ కార్పొరేషన్‌కు జమచేయాల్సి ఉంది. ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు గ్రామ పంచాయతీలు ఇచ్చిన సొమ్ములో నెలవారీ రికవరీ కింద రూ.10వేలు జమచేసుకుని మిగిలిన సొమ్మును లబ్ధిదారుడికి బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. ఈ విధానం కొంతమందికి నచ్చక వాహనాలను తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఆ నేపథ్యంలో వారిని తొలగించి అప్పట్లోనే కొత్తవారిని ఎంపిక చేశారు. దీంతో పంపిణీ ఆలస్యమైంది. 


ప్రభుత్వం మారటంతో.. 

గత ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేయటంలో జాప్యం జరగటంతో ఈలోపు కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో కొంతమంది అధికారపార్టీ నాయకుల పైరవీలు కూడా ప్రారంభమయ్యాయి. తమ వర్గానికి చెందిన వారికే డ్రెయిన్‌క్లీనింగ్‌ మిషన్లు ఇవ్వాలని, గతంలో ఎంపికచేసిన లబ్ధిదారులను తొలగించాలని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులపై ఒత్తిడి కూడా పెంచినట్లు సమాచారం. దీంతో కార్పొరేషన్‌ అధికారులు గతంలో ఎంపికచేసిన లబ్ధిదారులకు మిషన్లను పంపిణీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. వారి నిర్లక్ష్యం కారణంగా విలువైన యంత్రాలు, ట్రాక్టర్లు మూలనపడ్డాయి.


ఎప్పటికి పంపిణీ చేస్తారో...

లబ్ధిదారులుగా ఎంపికైన వారు తమకు వాహనాలు ఇవ్వాలంటూ ఏళ్ల తరబడి ఎస్సీ కార్పొరేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. మూడేళ్ల నుంచి నిరుపయోగంగా పడి ఉండటంతో ఎండకు, వానకు తడిసి వాహనాలు తుప్పుపట్టిపోయాయి. ఇవి ఇప్పుడు లబ్ధిదారులకు పంపిణీ చేసినా పనిచేస్తాయా అనేది కూడా ప్రశ్నార్థకమే.  డ్రెయిన్‌ క్లీన్‌ మిషన్లు, ట్రాక్టర్‌ ఇంజన్లు ఇంకా కొద్దిరోజులు అలాగే ఉంచితే పూర్తిగా పనికిరాకుండా పోయే అవకాశం ఉందంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్సీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లబ్ధిదారులకు ఆయా యంత్రాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు.




Updated Date - 2021-01-19T06:15:12+05:30 IST