‘డ్రాగన్‌’ గ్యాంబ్లింగ్‌.. రోజుకు 30 కోట్ల దందా?

ABN , First Publish Date - 2020-08-15T10:09:33+05:30 IST

‘డ్రాగన్‌’ గ్యాంబ్లింగ్‌తో దేశ యువతను నిలువుదోపిడీ చేస్తున్న చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ..

‘డ్రాగన్‌’ గ్యాంబ్లింగ్‌.. రోజుకు 30 కోట్ల దందా?

కొనసాగుతున్న హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ‘డ్రాగన్‌’ గ్యాంబ్లింగ్‌తో దేశ యువతను నిలువుదోపిడీ చేస్తున్న చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఠాలపై దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎ్‌స)కు చెందిన 2 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. చైనా గేమింగ్‌ కంపెనీలకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో 7 నెలల్లో రూ. 1,100 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తేలిన నేపథ్యంలో.. ఆ కంపెనీల మూలాల ఛేదించే దిశలో ఈ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీ, నోయిడాల్లో ఈ బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఆయా కంపెనీల కార్యాలయాలపై ఐటీ శాఖ శుక్రవారం దాడులు జరిపింది. గురువారం హైదరాబాద్‌ పోలీసులు ఢిల్లీలోని గేమింగ్‌ కంపెనీలపై దాడులు జరిపి, ఓ బ్యాంకు అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు. అందులో రూ. 30 కోట్లు ఉన్నాయి. రోజూ ఆయా కంపెనీలు రూ. 30 కోట్ల దాకా అర్జిస్తున్నాయని.. ఏరోజుకారోజు ఆ మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి మళ్లించడం.. విత్‌డ్రా చేయడం జరుగుతోందని పోలీసులు గుర్తించారు.


ఈ కేసుపై ఆదాయపన్ను(ఐటీ) శాఖకు చెందిన కేంద్ర దర్యాప్తు విభాగం (సీఐయూ) కూడా రంగంలోకి దిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ఆయ్‌కార్‌భవన్‌లోని సీఐయూ బృందాలు సీసీఎస్‌ పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించి, సమాంతర దర్యాప్తు ప్రారంభించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.మనీలాండరింగ్‌, హవాలా కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దర్యాప్తు ప్రారంభించింది. ప్రధానంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలకు కేంద్ర బిందువుగా ఉన్న చైనాలోని ‘టీ-పవర్‌ కంపెనీ’ గురించి ఆరా తీస్తోంది. ఈడీ ప్రాథమిక దర్యాప్తులో ఈ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీలు లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువగా జరిగినట్లు తేలింది.   

Updated Date - 2020-08-15T10:09:33+05:30 IST