డ్రాగన్ ఫ్రూట్.. కిలో రూ.350 ధర పలికే దీన్ని తింటే..

ABN , First Publish Date - 2020-07-09T21:53:36+05:30 IST

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట సాగు వైపు మరో రైతు అడుగులు వేశారు. జహీరాబాద్‌ ప్రాంతంలోని రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు బసంతాపూర్‌ నర్సింహారెడ్డి డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు

డ్రాగన్ ఫ్రూట్.. కిలో రూ.350 ధర పలికే దీన్ని తింటే..

రంజోల్‌లోనూ డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు

రెండెకరాల్లో సాగు చేస్తున్న  రైతు నర్సింహారెడ్డి


జహీరాబాద్‌/సంగారెడ్డి(ఆంధ్రజ్యోతి) : డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట సాగు వైపు మరో రైతు అడుగులు వేశారు. జహీరాబాద్‌ ప్రాంతంలోని రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు బసంతాపూర్‌ నర్సింహారెడ్డి డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. గతేడాది ప్రజలు జ్వరాలతో అనారోగ్యాలకు గురై ప్లేట్‌లెట్స్‌ పడిపోయిన సమయంలో డ్రాగన్‌ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పడం విన్నారు రైతు నర్సింహారెడ్డి. ఈ కొత్త రకం పండుకు సంబంధించిన పంట ఏమిటో తెలుసుకోవడంపై ఆయన ఉత్సాహం చూపించారు. జిల్లాలో అప్పటికే కొండాపూర్‌ మండలంలోని అలియాబాద్‌లో ఓ రైతు కొన్నాళ్లుగా డ్రాగన్‌ పంటను సాగుచేస్తున్నాడని తెలుసుకుని ఆ రైతు వద్ద పంట సాగు, లాభాలు తదితర వివరాలను తెలుసుకున్నారు. అప్పుడు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 


రెండేళ్ల క్రితం పశ్చిమబెంగాల్‌లోని ఓ యూనివర్సీటీ నుంచి కొన్ని మొక్కలను తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా వేశారు. పంట దిగుబడి ఖర్చు తదితరాలను బేరీజు వేసుకుంటే లాభాలకు ఢోకాలేదని భావించి ప్రస్తుతం రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరా సాగుకు మొక్కలు, రాతికడీలు, సిమెంట్‌ప్లేట్‌, ఎరువులు తదితరాలను కలిపి రూ.5 లక్షల ఖర్చు వస్తుందని, సాగు వ్యయం ఎక్కువైనప్పటికీ లాభాలకు ఎలాంటి డోకా ఉండబోదని రైతు బసంతాపూర్‌ నర్సింహారెడ్డి తెలిపారు. ఎకరాకు 1800 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.60 నుంచి 40 వరకు ఉంటుందన్నారు. ఏటా జూన్‌, అక్టోబర్‌ మధ్యకాలంలో పంట చేతికి వస్తుందని తెలియజేశారు. మొదటి ఏడాది టన్ను ( 10 క్వింటాళ్లు) పంట చేతికి వస్తుందని, ఇలా 25 సంవత్సరాలపాటు నిరంతరం పండుతూనే ఉంటుందని తెలిపారు. 


కిలో రూ.150 చొప్పున హోల్‌సేల్‌మార్కెట్‌లో విక్రయిస్తామని, బహిరంగ మార్కెట్లో కిలో రూ.250 నుంచి 350 వరకు ఉంటుందన్నారు. డ్రాగన్‌ పంటలో రెడ్‌, వైట్‌, యెల్లో ఇలా మూడు రకాలుంటాయని, రెడ్‌ రకానికి మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. మొదటి రెండేళ్ల కాలంలో లాభాలు అంతగా రాకపోయినా ఏయేటికాయేడు పంట దిగుబడి పెరిగి దశల వారీగా లాభాలు పెరుగుతాయని తెలిపారు. 

Updated Date - 2020-07-09T21:53:36+05:30 IST