Abn logo
May 23 2020 @ 02:51AM

20 ఏళ్లు పనిచేసిన డాక్టర్‌ నెలలోనే పిచ్చోడయ్యాడా!

ఇలాచూసి తట్టుకోలేకపోతున్నా 

అయ్యన్న ఇంటికి వెళ్లాడనే.. కొందరు ఇదంతా సృష్టించారు

పోలీసులపై నమ్మకం లేదు.. సీబీఐకి కేసు ఇవ్వడం సంతోషం

‘ఆంధ్రజ్యోతి’తో డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి


విశాఖపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి): ‘‘మాస్క్‌లు అడిగిన పాపానికి ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచీ నిద్రలేని రాత్రులు గడిపాడు. పోలీసులతో గొడవ జరిగినప్పుడు బాగానే ఉన్నాడు. బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఎవరో ఫోన్‌ చేసి, మీ అబ్బాయిని కొడుతున్నారని చెప్పారు. ఇరవై ఏళ్లు మచ్చ లేకుండా సే వలు అందించిన డాక్టర్‌ను ప్లాన్‌ ప్రకారం పిచ్చోడిని, తాగుబోతును చేశారు. ఈ వ్యవహారంలో నా బిడ్డ చేసిన తప్పు ఏదైనా ఉందంటే అది అ య్యన్నపాత్రుడి(టీడీపీ నేత) ఇంటికి వెళ్లడమే’న ని డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ సుధాకర్‌పై దాడి కేసును సీబీఐకి అప్పగించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం కావేరిబాయి ఆంధ్రజ్యోతి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. 


కావాలనే క్రియేట్‌ చేశారు

‘‘మాస్క్‌లు అడిగినందుకు కాకుండా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి కి వెళ్లారన్న ఉద్దేశంతోనే నా బిడ్డను సస్పెండ్‌ చేశారు. ఉద్యోగం కోల్పోవడంతో తీవ్రమైన టెన్షన్‌తో ఒత్తిడికి గురయ్యారు. దాడి జరిగిన రోజు పండ్లు కొనుగోలు చేసి ఇంట్లో ఇచ్చి... బయటకు వెళ్లారు. వెళ్లిన కాసేపటికే...మీ అ బ్బాయిని పోలీసులు కొడుతున్నారంటూ ఫోన్‌ వచ్చింది. నా కుమారుడిని చూసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాను. ‘మమ్మల్ని కొట్టడానికి పంపించావా’ అంటూ పోలీసులు అడగడం బాధేసింది. ఓ పార్టీకి చెందిన చెంచాలు కావాలనే ఇదంతా క్రియేట్‌ చేశారు. సస్పెండైన తరువాత నా కుమారుడికి బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు తరచూ కొంతమంది ఫోన్లు చేసి...‘తప్పు ఒప్పుకొంటే ఉద్యోగం ఇస్తాం’ అని అంటున్నారు. మీడియాతో మాట్లాడకుండా ఉండాలని ఇంకొందరు చెబుతున్నారు. చేయని తప్పును సుధాకర్‌ ఎందుకు ఒప్పుకోవాలి? ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో మమ్మల్ని బుజ్జగించే యత్నాలను కొంత మంది ప్రారంభించారు.


ఆస్పత్రిలో సుధాకర్‌ను చూసేందుకు వెళ్లగా,  నన్ను లోపలకు అనుమతించలేదు. సీపీకి ఫిర్యాదు చేశాకే వె ళ్ల నిచ్చారు. అధికారులు ప్రభుత్వాల వైపు కాకుండా ప్రజల పక్షాన ఉండాలి. ఒకే ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉండదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మానసిక వైద్యశాలలో ఓ చిన్న గదిలో సుధాకర్‌ను ఉంచారు. అక్కడి వాతావర ణం భయంకరంగా ఉంది. చికిత్స అందించేందుకు పదేపదే సంతకాలు పె ట్టాల్సిందిగా అక్కడి వైద్యులు సుధాకర్‌ను బలవంత పెట్టారు. పిచ్చోడిగా ఎక్కడ చిత్రీకరిస్తారోనన్న ఉద్దేశంతో నా కుమారుడు నిరాకరించారు.’’


తీవ్రవాది కంటే ఘోరంగా...

‘‘పోలీసులు ఒక డాక్టర్‌ అని కూడా చూడకుండా...తీవ్రవాది పట్ల కంటే ఘోరంగా ప్రవర్తించారు. చేతులు విరిచి వెనక్కి కట్టి, కాళ్లతో తన్నారు. పై పెచ్చు ఆయనే కట్టుకున్నాడని చెప్పడం దుర్మార్గం. ఉత్తమ సేవలకుగాను ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న సుధాకర్‌ను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. భగవంతుడు, న్యాయస్థానాన్నే మేం నమ్ముకున్నాం. న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నాం. పోలీసులపై నమ్మకం లేదని నేను చెప్పాను. నా కుమారుడు కూడా అదే చెప్పడంతో కోర్టు కేసును సీబీఐకి అ ప్పగించింది. 74 ఏళ్ల వయసులో ఉన్న నేను, నా బిడ్డ పరిస్థితిని చూసి తీవ్ర వేదనను అనుభవిస్తున్నాను. ఇలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదు. ఒక డాక్టర్‌నైన తన పట్లే ఇంత దారుణంగా వ్యవహరిస్తే..‘అమ్మా..! మీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో’నని నా గురించి సుధాకర్‌ భయపడుతున్నారు. మాకు మంత్రుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అందు లో వాస్తవం లేదు. సంప్రదింపులు మాత్రమే జరిపారు.’’ 

Advertisement
Advertisement
Advertisement