Abn logo
May 23 2020 @ 14:58PM

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంపై దళిత నేతల హర్షం

అనంతపురం: డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై దళిత నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు.. రాష్ట్ర ప్రజల పక్షాన న్యాయవ్యవస్థ ఉండటంపై కృతజ్ఞత తెలియచేస్తున్నామన్నారు. డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై కొట్టి దళిత సమాజం తలదించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు, దళితుల పట్ల పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ హర్షకుమార్, మహాసేన రాజేశ్ పట్ల కూడా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. 


కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు శంకర్ మాట్లాడుతూ.. దళితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం ప్రేమ ఉందో డాక్టర్ సుధాకర్ ఉదంతం తెలియజేస్తోందన్నారు. ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలను రెడ్ల చేతుల్లో జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారన్నారు. ఎమ్మెల్యేల ఇంటి మెట్లు ఎక్కే పరిస్థితి కూడా లేకండా దళితుల హక్కులను హరించి వేస్తున్నారని విమర్శించారు. దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు.


అనంతరం ఎస్సీ జనసంఘం నేత కుళ్లాయప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో 75 సంవత్సరాల కన్న తల్లి తన  కొడుకు ప్రాణాలకు హాని ఉందని చెప్పడం చూస్తుంటే ఈ ప్రభుత్వం తీరు ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెత్త సీఎం అయ్యారని విమర్శించారు. ప్రశ్నించిన దళిత నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. దళితులకు మద్దతుగా ఉద్యమాలు చేస్తామని.. ఈ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబడతామని కుళ్లాయప్ప స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement