‘అన్నంగిన్నె’ కవికి అ్రశునివాళి

ABN , First Publish Date - 2021-06-19T06:17:53+05:30 IST

దళితసాహిత్యం ఉద్యమరూపెత్తిన తొలినాళ్లలో దళితసాహిత్యానికి సైద్ధాంతిక భూమిక లేదని సన్నాయినొక్కులు నొక్కిన ప్రగతిశీల విమర్శకులకు సమాధానంగా ‘అన్నంగిన్నె’ కవితాసంపుటికి...

‘అన్నంగిన్నె’ కవికి అ్రశునివాళి

దళితసాహిత్యం ఉద్యమరూపెత్తిన తొలినాళ్లలో దళితసాహిత్యానికి సైద్ధాంతిక భూమిక లేదని సన్నాయినొక్కులు నొక్కిన ప్రగతిశీల విమర్శకులకు సమాధానంగా ‘అన్నంగిన్నె’ కవితాసంపుటికి ‘అంబేడ్కర్‌వాద కవిత్వం’ అని నేతల ప్రతాప్‌ కుమార్‌ నామకరణం చేశాడు.


నిన్న పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో కరోనాబారిన పడి కన్నుమూసిన నేతల ప్రతాప్‌ కుమార్‌ తెలుగు దళిత కవిత్వంలో అంబేడ్కర్‌ వాదానికీ, బౌద్ధానికీ పెద్దపీట వేసిన కవి. పశ్చిమ గోదావరి జిల్లా విజ్జేశ్వరం గ్రామంలో 1965 ఆగస్టు 13న ప్రతాప్‌ జన్మించాడు. తణుకులో జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగం చేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచి అంబేడ్కర్‌ ఆలోచనలతో ప్రభావితమైన ప్రతాప్‌కుమార్‌... కత్తి పద్మారావు, బొజ్జా తారకం ఆధ్వర్యంలో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభలో చురుకైన కార్యకర్తగా పనిచేశాడు.


మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు బాధ్యునిగా వ్యవహరించాడు. తెలుగులోని అన్ని సాహిత్య ప్రక్రియలు దళితీకరణ చెందుతున్న దశలో ‘దళిత నానీ’లు పుస్తకం తీసుకొచ్చాడు. అరుణ్‌శౌరి, రంగనాయకమ్మ లాంటి వాళ్ల అంబేడ్కరిజం వ్యతిరేకతకు చెంపపెట్టులా ‘‘మహాత్ములు వద్దు/మావోలు వొద్దు/ అంబేడ్కరిజమే/ మాకు ముద్దు ముద్దు’’ అనగలిగాడు. ‘‘ఈ దేశం నుండి/ బౌద్ధం నిష్క్రమించింది/ అందుకే ఈ సమాజం/ ఇలా చచ్చింది’’ అని వర్తమాన సమాజానికి బౌద్ధం ఆవశ్యకతను గుర్తుచేశాడు. దళితసాహిత్యం ఉద్యమరూపెత్తిన తొలినాళ్లలో దళితసాహిత్యానికి సైద్ధాంతిక భూమిక లేదని సన్నాయినొక్కులు నొక్కిన ప్రగతిశీల విమర్శకులకు సమాధానంగా ‘అన్నం గిన్నె’ కవితాసంపుటికి ‘అంబేడ్కర్‌వాద కవిత్వం’ అని నామకరణం చేశాడు. తెలుగు కవిత్వంలో అరుదుగా జరిగే పునర్ముద్రణలను తోసిరాజని ‘అన్నం గిన్నె’ ఏకంగా ఆరు పునర్ముద్రణలు పొందింది. అంబేడ్కర్‌ విగ్రహాన్ని దళితుల అన్నంగిన్నెకు ప్రతీకగా చేసి ‘ఆ విగ్రహాన్ని చూస్తుంటే, అన్నంగిన్నెనే చూసినట్లుంటుంది, మెతుకు మెతుకు మీద ఆ పేరు మెరుస్తూనే ఉంటుంది, ఊరికి చివరున్న వాడ మొదట్లో నిలబడి, వాడ ఊరయ్యే చూపుడు వేలు సందేశం ఏదో ఇస్తూ ఉంటుంది’ అని వాడ ఊరయ్యే సన్నివేశాన్ని స్వప్నించాడు ప్రతాప్‌కుమార్‌! ‘ముక్కు మూసుకుని తపస్సు చేసే వాళ్లకి దేవుడు ప్రత్యక్షమైతే, బుద్ధుడికి మానవసమాజం ప్రత్యక్షమైంది’ అని బౌద్ధంలోని మానవీయమూలాలను ఆవిష్కరించిన బౌద్ధకవి నేతల.


సమాజంలోని ప్రతీ అంశాన్ని అంబేడ్కర్‌ దృష్టికోణం నుంచి చూడటం నేతల కవిత్వం విశిష్టత. భీమ్‌పాల్‌ రాగం, పిల్లల కోసం అంబేడ్కర్‌ కథ, బౌద్ధ సుభాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, సమతా వసంతగానం వంటి రచనలతో తెలుగు దళిత కవిత్వానికి అంబేడ్కర్‌వాదాన్ని, బౌద్ధాన్ని అందించిన నేతల అకాలమరణం దళిత బహుజన సాహిత్యాలకు, ఉద్యమాలకు తీరని లోటు. నేతల మృతికి నా అశ్రునివాళి.


డా. శిఖామణి

(కవిసంధ్య సంపాదకులు)

Updated Date - 2021-06-19T06:17:53+05:30 IST