డాక్టర్‌ రెడ్డీస్‌ లాభంలో 30% క్షీణత

ABN , First Publish Date - 2020-10-29T06:02:47+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.762.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభంలో 30% క్షీణత

రెండో త్రైమాసికానికి రూ.762 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.762.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసిక లాభం రూ.1,092.5 కోట్లతో పోలిస్తే 30 శాతం తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.326 కోట్ల ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించడం వల్ల 2020, సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలలకు లాభం తగ్గినట్లు కనిపిస్తోందని కంపెనీ వెల్లడించింది. కాని ఈ ఏడాది మొదటి త్రైమాసిక లాభం రూ.579.3 కోట్లతో పోలిస్తే 32 శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది. త్రైమాసికాదాయం 2 శాతం పెరిగి రూ.4,897 కోట్లుగా నమోదైంది. అన్ని మార్కెట్లలో వృద్ధిని నమోదు చేశామని డాక్టర్‌ రెడ్డీస్‌ కోచైర్మ న్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. స్థూల మార్జిన్‌ 53.9 శాతం ఉందని, మెరుగైన ఉత్పాదకత కారణంగా ఎబిటా మార్జిన్‌ బాగుందన్నారు. 2020-21 ప్రథమార్ధానికి రూ.9,314 కోట్ల ఆదాయంపై రూ.1,342 కోట్ల లాభాన్ని ప్రకటించింది. 


21% గ్లోబల్‌ జనరిక్‌ విక్రయాలు..

ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలలకు గ్లోబల్‌ జనరిక్‌ విక్రయాలు 21 శాతం పెరిగి రూ.3,281 కోట్ల నుంచి రూ.3,984 కోట్లకు చేరాయి. ఉత్తర అమెరికా, యూరప్‌ జనరిక్‌ ఔషధాల విక్రయాలు ఆకర్షణీయంగా పెరిగాయి. ఉత్తర అమెరికా విక్రయాలు 28 శాతం వృద్ధితో రూ.1832.8 కోట్లకు చేరగా.. యూరప్‌ విక్రయాలు 36 శాతం పెరుగుదలతో రూ.375 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ విక్రయాలు 21 శాతం పెరిగి రూ.751 కోట్ల నుంచి రూ.912 కోట్లకు చేరాయి. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా పరాగ్‌ అగర్వాల్‌ను బోర్డు నియమించింది. ఈ నియామకం డిసెంబరు ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. 


 అవి రాన్‌సమ్‌-వేర్‌ దాడులు..

ఇటీవల కంపెనీపై జరిగినవి రాన్‌సమ్‌-వేర్‌ దాడులని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. సమాచార భద్రతకు భంగం కలిగించే విధంగా రాన్‌సమ్‌వేర్‌ దాడులు జరిగాయి. తదనంతరం ఈ దాడుల వల్ల ప్రభావానికి గురయ్యే ఐటీ సేవలను వేరు చేశాం. ఈ అంశాన్ని పరిశీలించడానికి అంతర్జాతీయ సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సహాయం తీసుకున్నాం. ఈ దాడుల లోతుపాతులను తెలుసుకోవడానికి పరిశోధన జరుగుతోందని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎరేజ్‌ ఇజ్రాయెలీ తెలిపారు. అన్ని అప్లికేషన్లు, డేటా రికవరీ, రెస్టోరేషన్‌ కొనసాగుతోందన్నారు. 


మరిన్ని కొవిడ్‌ ఔషధాలు..

స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌తో పాటు మరిన్ని కొవిడ్‌ ఔషధాలను కంపెనీ అందుబాటులోకి తీసుకురానుందని ఇజ్రాయెలీ చెప్పారు. ఇప్పటికే అవిగాన్‌ బ్రాండ్‌తో ఫావిపిరావిర్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టామని చెప్పారు. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై రెండో దశ క్లినికల్‌ పరీక్షలు డిసెంబరు చివరికి పూర్తి కాగలవు. పరిస్థితులను బట్టి మార్చి చివరి నాటికి మూడో దశ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ రెండు దశల పరీక్షలకు 100 మంది నుంచి 1500 మంది వాలెంటర్లు అవసరం అవుతారని ఇజ్రాయెలీ తెలిపారు. 

Updated Date - 2020-10-29T06:02:47+05:30 IST