డాక్టర్‌ రెడ్డీస్‌ లాభంలో 76% క్షీణిత త్రైమాసిక ఆదాయంలో 15% వృద్ధి

ABN , First Publish Date - 2022-05-20T08:44:56+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ రూ.87.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభంలో 76% క్షీణిత  త్రైమాసిక ఆదాయంలో 15% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ రూ.87.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.362.4 కోట్లతో పోలిస్తే 76 శాతం క్షీణించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. మొత్తం ఏడాదికి లాభం 37 శాతం వృద్ధితో రూ.1,724 కోట్ల నుంచి రూ.2,357 కోట్లకు పెరిగింది. ఉత్తర అమెరికా, యూర్‌పలలో ధరల ఒత్తిడి, ఎగుమతి ప్రయోజనాలు తగ్గడం, ఇన్వెంటరీలు పెరగడం, ఇంపైర్‌మెంట్‌ చార్జీలు పెరగడం తదితర కారణాలతో చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం తగ్గింది. ఆదాయం ఆకర్షణీయంగా పెరిగినప్పటికీ. ఇంపైర్‌మెంట్‌ చార్జీలు లాభంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. మార్కెట్‌ వాటా పెరగడం, కొత్త ఔషధాల విడుదల వల్ల ఆదాయం పెరిగిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై కంపెనీ బోర్డు రూ.30 డివిడెండ్‌ను (600ు) ప్రకటించింది. 

రూ.5,437 కోట్ల ఆదాయం: మార్చితో ముగిసిన త్రైమాసికానికి డాక్టర్‌  రెడ్డీస్‌ రూ.5,437 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయం రూ.4,728 కోట్లతో పోలిస్తే ఆదాయం 15 శాతం పెరిగింది. మొత్తం ఏడాదికి ఆదాయం 13% శాతం వృద్ధితో రూ.18,972 కోట్ల నుంచి రూ.21,439 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికానికి గ్లోబల్‌ జెనరిక్స్‌ ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.3,874 కోట్ల నుంచి రూ.4,612 కోట్లకు చేరింది. అమెరికా ఆదా యం 14% వృద్ధితో రూ.1,997 కోట్లకు చేరింది. భారత్‌ ఆదాయం 15ు పెరుగుదలతో రూ.969 కోట్లకు పెరిగింది.


బూస్టర్‌గా స్పుత్నిక్‌ లైట్‌

ఏ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నప్పటికీ.. బూస్టర్‌ డోస్‌గా (యూనివర్సల్‌ బూస్టర్‌) సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ లైట్‌కు డీసీజీఐ నుంచి అనుమతి పొందడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రయత్నిస్తోంది. జూన్‌ చివరకు లేదా జూలైలో మొదట్లో యూనివర్సల్‌ బూస్టర్‌గా అనుమతి పొందడానికి దరఖాస్తు చేస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ (ఏపీఐ, సర్వీసెస్‌) దీపక్‌ సప్రా తెలిపారు. ప్రస్తుతం బూస్టర్‌ డోస్‌గా స్పుత్నిక్‌ లైట్‌ను వినియోగించడంపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకూ వచ్చిన క్లినికల్‌ పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు బూస్టర్‌ డోస్‌కు అనుమతి లభించిన అనంతరం దేశంలో స్పుత్నిక్‌ రేట్లను తగ్గించే అంశాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశీలించనుంది. 

Updated Date - 2022-05-20T08:44:56+05:30 IST