ఏషియన్ ఇన్‌స్టూట్‌ది ప్రపంచంలో మూడోస్థానం

ABN , First Publish Date - 2020-02-07T23:39:58+05:30 IST

నాగేశ్వర్‌రెడ్డి చిన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవారు అంటారు నిజమేనా? నిజమే. మా నాన్నగారు విశాఖలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. మేం ముగ్గురు అన్నదమ్ములం, ఒక చెల్లి.

ఏషియన్ ఇన్‌స్టూట్‌ది ప్రపంచంలో మూడోస్థానం

పనిలోనే నాకు ఆనందం
18 గంటలు పనిచేసినా నాకు అలసట ఉండదు
హార్వార్డ్‌ యూనివర్శిటీ రమ్మన్నా వెళ్లలేదు
రోగికి వైద్యుడి మీద నమ్మకం ఉండాలి
ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి

రోజుకు 18 గంటలు పనిచేసినా అలసట ఉండదని పనిని ఆస్వాదించడమే దీనికి కారణమని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆయన తన మనోభావాలను పంచుకున్నారు. .28-10-13న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


నాగేశ్వర్‌రెడ్డి చిన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవారు అంటారు నిజమేనా?
నిజమే. మా నాన్నగారు విశాఖలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. మేం ముగ్గురు అన్నదమ్ములం, ఒక చెల్లి. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్లం. పెట్రోలు మండితే కారు నడుస్తుందని తెలుసుకుని, గ్యారేజీలోని కారునుంచి పెట్రోలు తీసి కిందపోసి అగ్గిపుల్ల గీశాం. ఫ్రిజ్‌లో చల్లగా ఉంటుందని రెండేళ్ల మా చిన్నతమ్ముణ్ని లోపల పెట్టేసి మర్చిపోయాం. తర్వాత మా అమ్మగారు ఫ్రిజ్‌ తెరిచేటప్పటికి తమ్ముడు నీలంరంగులోకి మారిపోయి కనిపించాడు. చివరకు తేరుకున్నాడు. దీంతో నాన్నగారు ఏడేళ్ల వయసులోనే నన్ను హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలులో చేర్పించారు. అప్పట్నుంచి హాస్టల్‌లోనే ఉండి చదువుకున్నాను.

అల్లరి కుర్రాడు డాక్టర్‌ ఎలా అయ్యాడు?
హైదరాబాద్‌వచ్చాక క్రమశిక్షణ అలవాటైంది. తర్వాత విజయవాడలో ఇంటర్‌ పూర్తిచేశా. మానాన్నగారి సలహాతో కర్నూలులో మెడిసిన్‌ చదివాను. ఇంట్లో అందరూ పాథాలజిస్టులు కావడంతో నాకు అందులోనే పరిశోధన చేయాలనిపించింది. మెడిసిన్‌ అయ్యాక పీజీఏ చండీగఢ్‌లో ప్రవేశపరీక్ష రాస్తే ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది. అప్పట్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాథాలజీ నేను ఎంచుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నాన్నగారికి తెలిసి దాన్నుంచి మార్పించారు. తర్వాత చెన్నైలో ఇంటర్నల్‌ మెడిసిన్‌, అటుపైన గ్యాస్ర్టో ఎంటరాలజీకి మారాను.

అప్పట్లో దానికీ అంత డిమాండ్‌ ఉండేది కాదేమో?
చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఆ సమయంలోనే ఎండోస్కోపీ విధానాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ఈ రంగంపై ఆకర్షితుడనయ్యాను. పీజీఏ చండీగఢ్‌లో డీఎం చేశాను. ఆ కాలేజీలో దీనికున్న ఒకే ఒక సీటును నేను సాధించాను.

తర్వాత మీకు చాలా ఆఫర్లు వచ్చుంటాయే?
లండన్‌ తదితర ప్రాంతాలనుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. నేను స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. అయితే, ట్రైనింగ్‌ కోసం చాలా దేశాలు వెళ్లాను. ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ల కోసం 20 ఏళ్ల క్రితం ఓసారి అమెరికా వెళ్లాను. కానీ, ఇండియానుంచి వచ్చిన వాళ్లు క్వాలిఫైడ్‌ కాదని, ఆపరేషన్‌ చేయరాదని అక్కడి ప్రభుత్వం అడ్డుచెప్పింది.
 
అక్కడి డాక్టర్‌ ఫైట్‌చేసి ఆపరేషన్‌కు అనుమతి తెచ్చారు. అక్కడివాళ్లు ఓ కేసు చూసేసరికి నేను ఐదు చూసేవాడిని. దాంతో ఇండియాలో ఇంత నైపుణ్యం ఉందా? అని వాళ్లు ఆశ్చర్యపోయారు. అప్పుడు థామస్‌ లామౌంట్‌ అనే ప్రొఫెసర్‌ నన్ను హార్వర్డ్‌ యూనివర్సిటీకి వచ్చేయమన్నారు. కోటి రూపాయల జీతం ఆఫర్‌చేశారు. కానీ, నేను హైదరాబాద్‌లో గ్యాసో్ట్ర ఎంటరాలజీని అభివృద్ధి చేస్తానని చెప్పాను. పదేళ్ల తర్వాత.. ఇప్పుడు అదే థామస్‌ లామౌంట్‌ తన స్టూడెంట్స్‌ని నా దగ్గర శిక్షణకు పంపుతున్నారు. మేం సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ ఆయన రాసిన లేఖను ఎప్పటికీ మరిచిపోను.

హైదరాబాద్‌లో మొదట ఏం చేశారు?
నిమ్స్‌లో పనిచేశాను. అప్పుడు డాక్టర్‌ కాకర్ల సుబ్బారావుగారు డైరెక్టర్‌గా ఉండేవారు. తర్వాత గాంధీలో ప్రొఫెసర్‌గా చేశాను. అయితే, ప్రభుత్వ ఆస్పత్రిలో కాబట్టి అనుకున్నట్లు చేయలేకపోతున్నామేమో అనిపించింది. ప్రైవేట్‌గా చేస్తేనే మంచిదని బయటకొచ్చాను. పదిహేనేళ్ల క్రితం ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ స్థాపించాను. ఇప్పుడిది ప్రపంచంలోని అత్యుత్తమ ఆస్పత్రుల్లో హార్వర్డ్‌, హాంకాంగ్‌ తర్వాత మూడో స్థానంలో ఉంది.

ఇంత పేరు ప్రతిష్ఠలు రావడానికి ప్రధాన కారణం?
టీమ్‌వర్క్‌. మాది అద్భుతమైన జట్టు. మా ఆస్పత్రిలో అందరికీ జీతాలే. ఎవరూ ప్రాక్టీస్‌ చేయరు. పేషంట్‌ కేర్‌, రీసెర్చ్‌పైన మేం ప్రధానంగా దృష్టిపెట్టి ఓ కేంద్రాన్ని ప్రారంభించాం. విదేశాల్లోని భారతీయ పరిశోధకులను చాలామందిని ఇక్కడికి పిలుస్తున్నాం. ఒక గ్రూప్‌గా తయారు చేసి జెనెటిక్స్‌ మీద, స్టెమ్‌సెల్స్‌పైన పరిశోధనలు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం కూడా పరిశోధనపై దృష్టి పెట్టడంలేదు.
 
ప్రభుత్వం ప్రాథమిక వైద్యం అందించి, టెర్షరీ వైద్యాన్ని ప్రైవేట్‌కు వదిలిపెట్టాలి. అయితే, సామాన్యులు ఆ ఖర్చు తట్టుకోలేరని చాలామంది అనవచ్చు. అందుకే మా ఇన్‌స్టిట్యూట్‌లో పేదలకు టెర్షరీ వైద్య ఖర్చుల్లో 20శాతం తగ్గిస్తాం. ఆరోగ్యశ్రీ వంటివాటిపై మేం ఆధారపడటంలేదు. అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇలా సామాజిక బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఉదాహరణకు కేన్సర్‌ వైద్యానికి ప్రభుత్వం చాలా ఖర్చుచేస్తోది. దానివల్ల జీవితకాలాన్ని కొంత పొడిగించగలం. అదే ప్రభుత్వం పరిశోధనలకు తగిన నిధులు వెచ్చించి కేన్సర్‌ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు తోడ్పడితే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి.

మీరు రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపలేదా?

చాలామంది ఇదే అడుగుతుంటారు. నేను పనిని ఎంజాయ్‌ చేస్తాను. అందుకే నాకు అలసట తెలియదు. మీరూ మీ పనిని ఆస్వాదిస్తున్నారు. కాబట్టే అంత హార్డ్‌వర్క్‌ చేయగలుగుతున్నారు.


మీరు పేషెంట్లతో నేరుగా మాట్లాడతారట?

అవును. డాక్టర్‌ తనపై శ్రద్ధచూపుతున్నాడన్న విశ్వాసం వారికి కలగాలి. అందుకే వ్యక్తిగత వివరాలు కూడా తెలుసుకుంటూ కొంచెం ఎక్కువసేపు వారితో గడిపితే మరిన్ని విషయాలు తెలుస్తాయి. అది పరిశోధనలకూ ఉపయోగపడుతుంది. అందుకనే నాకు రోజుకు నాలుగు గంటలు విశ్రాంతి సరిపోతుంది. కానీ, ఎప్పుడైనా షాపింగ్‌కి వెళితే ఐదు నిమిషాలకే అలసట వచ్చేస్తుంది.


మెడిటేషన్‌ చేస్తారా?

చేస్తాను. పది నిమిషాలు చేస్తే మూడు నాలుగు గంటలు నిద్రపోయినంత ఎనర్జీ వస్తుంది. చాలామందికి మెడిటేషన్‌ చేయమని సూచిస్తుంటాను.


మీ కుటుంబ గురించి..

నాకు ఒక అమ్మాయి. ప్రస్తుతం అమెరికాలో ఉంది. చిన్నప్పుడు ఆమెతో ఎక్కువసేపు గడపలేకపోయేనన్న బాధ ఉండిపోయింది. నా భార్య, అమ్మాయి కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నారు. ఆ విధంగా నేను అదృష్టవంతుడిని.


డాక్టర్లలో 90శాతం పేషంట్లతో అసలు మాట్లాడటం లేదు. టెస్టులు చేయించుకు రండి అని పంపేస్తుంటారు. దీనికి మీరేమంటారు?

కొన్ని సందర్భాల్లో అలా జరగవచ్చు. డాక్టర్‌కు మానవతాదృక్పథం ఉండాలి. తానెందుకు ఈ వృత్తిలోకి వచ్చానన్న స్పష్టత అవసరం. యూకేలో క్లాస్‌ ఫస్ట్‌ వచ్చినంతమాత్రాన మెడికల్‌ సీటు ఇవ్వరు. డాక్టరయ్యే లక్షణాలున్నాయా లేదా అని పరీక్షిస్తారు. ఇలాంటి విధానాలు మనకూ రావాలి.


హస్తవాసి గురించి ఏమంటారు?

అది నమ్మకం. వైద్యంలో అదీ చాలా ముఖ్యం. లండన్‌లో అల్సర్‌ పేషంట్స్‌కి ఇద్దరు డాక్టర్లు ఒకే రకం మందులిచ్చారు. డాక్టర్‌పై నమ్మకం ఉంచిన వ్యక్తికి వ్యాధి తగ్గింది. నమ్మకం లేకుండా మందులు వాడిన రోగికి అలాగే ఉంది. ఇది సైంటిఫిక్‌గా రుజువైంది. నమ్మకం లేకపోతే మందు సరిగా పనిచేయదు.


వైద్యరంగం అభివృద్ధితోపాటే పెడధోరణులూ పెరుగుతున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రులపై పేషంట్లలో ద్వేషం పెరుగుతోంది. గమనించారా?

చాలావరకు కరెక్ట్‌. నమ్మకం కోల్పోవడమే దీనికి కారణం. లోపం ఇరువైపులా ఉంది. మంచి వైద్యానికి డబ్బు కూడా కావాలి. మంచి డాక్టర్లకు జీతాలెక్కువ ఇవ్వాలి. అందుకే వైద్యం మొత్తం ప్రభుత్వమైనా ఉచితంగా చేయలేదు. డబ్బుకోస మే వైద్యం చేస్తున్నారని పేషంట్లు భావిస్తున్నారు. ఆస్పత్రులపై దాడులు చేస్తున్నారు. రెండువైపులా నమ్మకం పెరిగేలా డాక్టర్లు కొంచెం ఎక్కువ కృషిచేయాలి.


మరి విలువలు పెంచడానికి మీరూ కృషి చేయొచ్చుకదా?

చేస్తున్నా. నేను ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఎథికల్‌ కమిటీలో సభ్యుణ్ని. రెండేళ్లనుంచి దీనిపై డ్రాఫ్ట్‌ తయారుచేస్తున్నాం. దీన్ని డాక్టర్లంతా తప్పనిసరిగా పాటించాలని చెబుతాం. అయితే, ఎవరినీ బలవంతం చేయలేం.



ప్రైవేట్‌, ప్రభుత్వ వైద్యరంగాల మధ్య సమతౌల్యం సాధించడం ఎలా?

ప్రాథమిక వైద్యం ప్రభుత్వ బాధ్యత. టెర్షరీ వైద్యాన్ని ప్రభుత్వం అందించడం చాలా కష్టం. మేం గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలద్వారా లక్షమందికి వైద్య సహాయం అందించాం. గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం రోగాలకు మంచి నీరు లేకపోవడమే కారణం. పౌష్టికాహార లోపం, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడమూ ప్రధాన కారణాలే. ఉదాహరణకు రాయలసీమలో చాలామంది అన్నంలో మిరపకాయ వేసుకుని తింటారు. ఇటువంటి అంశాలపై ప్రభుత్వం కృషి చేయాలి. ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా సామాజిక బాధ్యతతో టెర్షరీ వైద్యాన్ని 20 శాతం ఉచితంగా చేయాలి. ఆరోగ్యశ్రీకన్నా బీమాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.


చాలా దేశాల్లో తిరిగారు. ఇక్కడ నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇక్కడి వ్యవస్థను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

కొన్ని సార్లు చాలా అసంతృప్తి కలుగుతుంది. అయితే.. అసంతృప్తి ఉన్నా సమాజం కోసం పనిచేస్తున్న ఇతర వ్యక్తులను చూసి ఉత్తేజం పొందుతుంటాను. పోరాటం చేయాల్సిందే.


ఆహారపు అలవాట్లవల్లే చాలామంది జబ్బుపడి మీ ఆస్పత్రికి వస్తుంటారు కదా?

గ్యాస్ర్టో ఎంటరాలజీ సమస్యలకు ఆహారపు అలవాట్లతోపాటు జన్యుపరమైన లోపాలూ కారణమే. భారతీయుల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ జీన్స్‌ బలహీనం. కడుపులోకానీ, కొలన్‌లో కాని, పాంక్రియాస్‌, లివర్‌లో వీక్‌గా ఉంటాయి. భారతీయుల్లో చాలామందికి ట్రంక్‌లో ఒబేసిటీ వస్తుంటుంది. అంటే మనిషి సన్నగా ఉన్నా పొట్ట మాత్రం వస్తుంది. అది జెనెటిక్‌ సమస్య. దీనివల్ల క్రమంగా లివర్‌లోకి ఫ్యాట్‌ చేరుతుంది. చివరకు లివర్‌ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. ఆల్కహాల్‌ తీసుకోకపోయినా, ఆహార నియమాలు పాటించినా జన్యులోపంవల్ల ఈ సమస్య వస్తుంది. ఇది మన దేశంలో చాలా ఎక్కువ. రెండోది అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరువల్ల కూడా సమస్యలు పెరుగుతాయి. దేశ ప్రజల్లో 30 శాతానికి గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు ఆందోళన కలిగించే అంశం.


ఎటువంటి ఆహారం వల్ల సమస్యలు వస్తాయి?

అపరిశుభ్ర ఆహారం ప్రధానమైన సమస్య. జంక్‌ ఫుడ్‌ వంటివాటి వల్ల స్థూలకాయం, కొవ్వు వంటివి పెరుగుతాయి. కానీ అల్సర్స్‌పై ప్రభావం చూపవు. వ ఆహార పదర్థాలలో విషపదార్థాల శాతం ఎంత ఉందని నిర్ణయించే వ్యవస్థ సరిగా లేదు. పారిశుధ్యం విషయంలో మనం 100 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉంటుంది. అపరిశుభ్రవాతావరణం ఉంటుంది. అదే మనకన్నా వెనుకబడిన దేశాల్లోకూడా శుభ్రతకు చాలా ప్రాధాన్యమిస్తారు. మన మైండ్‌సెట్‌ను మార్చుకుని చిన్న వయస్సునుంచే విద్యార్థులందరికీ పరిశుభ్రతనేర్పి మైండ్‌ సెట్‌ మార్చాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.


కారాలతో అల్సర్‌ రాదు

ఇంకొక అపోహ ఏమిటంటే కారాలు తింటే అల్సర్‌ వస్తుందని. దీనిపై మేం పరిశోధన చేశాం. ఇద్దరు అల్సర్‌ పేషంట్లను తీసుకొని ఒకరికి మజ్జిగ అన్నం వంటి సాఫ్ట్‌ ఫుడ్‌ పెట్టాం. రెండోవారికి కారంతో కూడిన ఆహారమిచ్చాం. కొన్ని రోజుల తర్వాత పరిశీలిస్తే కారం తిన్న పేషంట్‌కే అల్సర్‌ తొందరగా మాడింది. కాబట్టి అల్సర్‌కు కారానికి సంబంధం లేదు.


వేరుశనగలోని ఆఫ్లోటాక్సినతో ప్రమాదం

మన దగ్గర నేలకూడా కలుషితమైపోయింది. ఉదాహరణకు అనంతపురం లో వేరుశనగ పండిస్తారు. అక్కడి నేలలో ఆఫ్లోటాక్సిన్‌ అనే విషపదార్థం ఉంటుంది. వేరుశనగ కాయల్లోకి ఆఫ్లోటాక్సిన్‌ అనే ఫంగస్‌ ప్రవేశిస్తుంది. ఇటువంటి వాటిని తినడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయి. ఆ వేరు శనగ పొడిని తిన్న పశువులిచ్చే పాలల్లో కూడా ఈ ఫంగస్‌ ఉంటుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాల్లో బయట సరఫరా చేసే పాలల్లో కూడా వీటి స్థాయి అధికంగా ఉంటుంది. దీనివల్ల లివర్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదముంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల ఉండదు. కాబట్టి ఇటువంటి వాటిని మార్చాలంటే భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2020-02-07T23:39:58+05:30 IST