మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-25T05:17:08+05:30 IST

మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించడమే భరోసా కేంద్రాల లక్ష్యమని బరోసా సెంటర్స్‌ రాష్ట్ర టెక్నికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమత అన్నారు.

మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న టెక్నికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమత

- అధికారులు సమన్వయంతో పని చేయాలి

- భరోసా కేంద్రాల రాష్ట్ర టెక్నికల్‌ డెరెక్టర్‌ డాక్టర్‌ మమత

గద్వాల క్రైం, మే 24 : మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించడమే భరోసా కేంద్రాల లక్ష్యమని బరోసా సెంటర్స్‌ రాష్ట్ర టెక్నికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమత అన్నారు. భరోసా కేంద్రాల విధి విధానాలు, లక్ష్యాలు, ఉద్దేశం తదితర అంశాలపై తెలంగాణ పోలీస్‌ విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి టెక్నికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమత, మహిళా, శిశు భద్రత పోలీస్‌ విభాగం అదనపు ఎస్పీ అశోక్‌, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మమత మాట్లాడుతూ భరోసా కేంద్రం, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులను నివారించాలన్నారు. చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్సులు, కోర్టులతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. భౌతిక దాడులు, అత్యాచారాలను అడ్డుకోవడం మనందరి బాధ్యత అన్నారు. జిల్లాలో త్వరలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నందున, అందుకు ఎంపికైన బృందం సభ్యులు బాగా పనిచేయాలని సూచించారు. 

ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ మాట్లాడుతూ మహిళ రక్షణ, పిల్లలపై లైంగిక దాడుల నివారణ, నిరాదరణ, దాడులకు గురైన మహిళలు, బాలలకు అండగా ఉండటమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలోనే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లైంగిక దాడులు జరిగితే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు. అత్యాచారం, బాలలపై లైంగిక వేధింపులు, దాడు లకు సంబంధించి కేసులు నమోదైతే, బరోసా కేంద్రానికి పంపించాలన్నారు. ప్రతీ కేసుకు, ఫిర్యాదుకు భరోసా నుంచి అన్‌లైన్‌ నెంబర్‌ను ఇస్తామని తెలిపారు. కేసు ముగిసే వరకు సపోర్ట్‌ పర్సన్‌, లీగల్‌ అడ్వయిజర్‌ అందుబాటులో ఉంటారన్నారు. బాధితులకు నేషనల్‌ మినరల్‌ ఫండ్‌ ద్వారా చదువు, వైద్యం, ఇతర అవసరాలను తీర్చేలా అన్ని సదుపాయాలు ఉంటాయన్నారు.  

    అదనపు ఎస్పీ అశోక్‌ మట్లాడుతూ మహిళలపై నేరాలను నిరోధించేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విమెన్‌ సేఫ్టీవింగ్‌ను ఏర్పాటు చేసి, వివిధ ప్లాట్‌ఫామ్‌లలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:17:08+05:30 IST