ట్యూబ్‌ లైట్‌ కోసం డాక్టరయ్యా

ABN , First Publish Date - 2020-02-08T00:02:21+05:30 IST

మీలో ఇన్ని కళలు ఎలా వచ్చాయి? చిన్నప్పుడు మా నాన్న చెప్పినట్లు.. అంకమ్మ శకలతో పుట్టినట్లున్నాను. అందుకే ఇన్ని కళలు. వాటివల్లే పేషెంట్లకు కూడా నేనంటే ప్రేమ కలిగింది. డాక్టర్‌ పేషెంటుతో త్వరగా కలవాలంటే మంచి ఆయుధం.

ట్యూబ్‌ లైట్‌ కోసం డాక్టరయ్యా

నా పేరు గురకా రెడ్డి అంటే బాగుంటుంది

నా మెదడు మోకాల్లో ఉందని నాన్న అనేవారు

జీవితంలో హాస్యం లేకపోతే మనిషే కాదు

రోడ్డు పక్కన వేరు శనగ ఉండలు తినడం ఇష్టం

14-02-2011న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో డాక్టర్‌ గురవారెడ్డి


మీలో ఇన్ని కళలు ఎలా వచ్చాయి?

చిన్నప్పుడు మా నాన్న చెప్పినట్లు.. అంకమ్మ శకలతో పుట్టినట్లున్నాను. అందుకే ఇన్ని కళలు. వాటివల్లే పేషెంట్లకు కూడా నేనంటే ప్రేమ కలిగింది. డాక్టర్‌ పేషెంటుతో త్వరగా కలవాలంటే మంచి ఆయుధం. హాస్యమే. జంధ్యాల గారు అన్నట్లు.. నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. చాలామంది డాక్టర్లు ఆ రోగం తెచ్చిపెట్టుకుంటారు. అందరితో బాగా ఉండటం అమ్మ, ఎదుటివాడిని మనిషిగా గౌరవించడం నాన్న నేర్పారు. మోకాలిచిప్పలు మార్చే మీకు..


మెదడు మోకాల్లో ఉందంటారు?

నేను మేథావిని కాను. జీవితంలో పరీక్షలు పాసై.. పేషెంట్లకు దగ్గరైతే చాలు. మా నాన్న ఎప్పుడూ నా మెదడు మోకాల్లో ఉందనేవారు. అందుకే అక్కడే ఫిక్సయిపోయా. అక్కడే మెదడు కోసం వెతుకుతుంటాను. నా బ్రెయిన్‌కు ఆపరేషన్‌ చేయాలన్నా మోకాలికే చేయాలి. నేను ఆపరేషన్లు రోజుకు పది పదిహేను చేస్తాను. అన్నింటికీ తొందరే.. రిక్షాలో పుట్టేశాను. నా హనీమూన్‌ ఇంకో హ్యూమర్‌. ఇద్దరం అరకు లోయకు వెళ్లాం. అక్కడినుంచి బయటకు రావాలంటే ఒకే రైలు. ఇప్పటికిప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే ఎలాగని నా భార్య భయపడితే.. పాల లారీ పట్టుకుని ఆముదాలవలస వచ్చాం. అక్కడ రైలెక్కాం. రైల్లో బస్తా కింద వేసి మా ఆవిడను కూర్చోబెడితే.. పక్కామె నానా బూతులు తిట్టింది. విజయవాడలో ఫోన్‌ కోసం రైలు దిగి మాట్లాడుతుంటే, రైలు వెళ్లిపోయింది.


మీరు అప్పుడప్పుడు ఉన్నట్టుండి మాయమైపోతారెందుకు?

విజయవాడో, గుంటూరో వెళ్లిపోయి, రిక్షాలో వెళ్తూ రోడ్డు పక్కన వేరుశనగ ఉండలు, అవి తింటాను. నాలో ఉన్న పిల్లాడు అలా చేయిస్తాడు. నేను ఎదగడం ఆగిపోయానని మా ఆవిడ అంటుంది. కానీ అది అందరికీ ఉండాలని నేనంటాను.


డాక్టర్‌ అవ్వాలని ఎందుకు అనిపించింది?

మా ఇంట్లో 40, 60 క్యాండిళ్ల బల్బులే ఉంటే.. తెలిసిన డాక్టర్‌ రూంలో మాత్రం ట్యూబ్‌లైట్లు ఉండేవి. ప్రకాశవంతమైన జీవితం కోసమని డాక్టర్‌ అయ్యాను. అమ్మకి కూడా డాక్టర్‌ అంటే బాగా ఇష్టం. నాలుగుసార్లు రాస్తే తప్ప మెడిసిన్‌లో సీటు రాలేదు. తొలిరోజు తెల్లకోటు వేసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది.


మీరు ఇంగ్లండ్‌లో ఉండేవారు కదా..

అవును. పదేళ్లు ఉన్నాను. లేడీ డయానా చచ్చిపోయాక అక్కడ గ్లామర్‌ లేదని వచ్చేశా.


వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారు?

ఐదురోజులే. శనివారం నాది. ఆరోజు సినిమాలకు, షికార్లకు.. ఎటు కావాలంటే అటు వెళ్తా. ఆదివారం భార్య, పిల్లలకు కేటాయిస్తా. మా ఆవిడకు కోరికలు చాలా తక్కువ.


సాహిత్యంలో ప్రవేశం ఎలా.. ఆ శైలి ఎలా వచ్చింది?

మెడికల్‌ కాలేజి రోజుల్నించి ఈ దురద ఉంది. తెలుగంటే మక్కువ. అప్పట్లో మా కాలేజి మ్యాగజైన్‌కి రెండు జడలు, మూడు ముళ్లు, నాలుగు కళ్లు అని ఓ కథ రాశాను. రెండు జడల అమ్మాయికి మూడు ముళ్లు వేద్దామని లైనేసి ఒకడు కళ్లజోడు తెచ్చుకున్న వైనం అది. దానికి మొదటి బహుమతి వచ్చింది.


పేషెంట్లకు ఏమైనా అయితే ఏడ్చేస్తారు కదా..

అవును.. అది నాలో అంతర్మథనం. అదే లేకపోతే మిషన్లకు, నాకు తేడా ఏముంది అనుకుంటాను. సీతారామయ్యగారి మనవరాలు సినిమా పదిసార్లు చూశాను. అందులో అనుబంధాలు బాగా నచ్చాయి. ఆ ఎమోషన్‌ లోంచే ఏడుపు వస్తుంది. సర్జన్‌గా నేను విఫలం కావడం వల్ల పేషెంట్లు చనిపోతే, నాలుగు సందర్భాల్లో వృత్తి వదిలేద్దామనుకున్నాను.


మీ పిల్లల్ని ఎందుకు ఈ వృత్తిలోకి తెచ్చారు?

నిజానికి నాకు మరీ అంత ఇష్టం లేదు. మా అబ్బాయి మెడిసిన్‌ వద్దంటే.. సినిమాల్లోకి వెళ్తానన్నాడు. ఇన్సెప్షన్‌ సినిమాకు పేరడీగా మిస్‌కాన్సెప్షన్‌ అని 40 నిముషాల సినిమా తీశాడు. పాపకి చిన్నతనంలో ఆపరేషన్‌ జరిగింది. అప్పటి నుంచి తను ఆర్థోపెడిక్‌ కావాలనుకుంది.


మెడికోలు ఎక్కువమంది ప్రేమిస్తారెందుకు?

అక్కడి వాతావరణం వల్ల అలా అవుతుంది. నాకు స్నేహితులు, రాళ్లు కూడా ఎక్కువే. మా ఆవిడ విజయవాడ సిద్దార్థ మెడికల్‌ కాలేజిలో చదివేది. లైబ్రరీకని అబద్ధం చెప్పి.. అటు వెళ్లేవాణ్ని. 80 నుంచి ప్రేమ మొదలైంది. వాళ్ల నాన్న భవనం వెంకట్రామ్‌ గారు అప్పట్లో సీఎం. దాంతో అందరూ భయపెట్టేవారు. కానీ ఇప్పటికీ ఆమెకు నామీద ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కాలేజి రోజుల్నుంచి నాకు ఆమె పెట్టిన పేరు గురివి.. కోపం వచ్చినప్పుడు అది కొరివి అన్నట్లు కనపడుతుంది.


మీరామెను ఏ విషయంలో ఇబ్బంది పెడతారు?

గురకే కదా.. నా పేరు గురకారెడ్డి అంటే బాగుంటుంది. రకరకాల శబ్దాలొస్తాయి. రైలు వంతెన మీదనుంచి, లోయలోంచి వెళ్లినట్లు.. ఉన్నట్టుండి కూలిపోయినట్లు వస్తుందట. గురక ఆగిపోతే ఆమె మొదట్లో భయపడేది. నాకంటే ముందు ఆమే నిద్రపోతుంది. తగ్గడానికి ఆపరేషన్లు చేయించుకున్నాక.. ఆరు స్పీకర్లు నాలుగు స్పీకర్లయ్యాయి.


వంటలోనూ సాయం చేస్తారట కదా..

ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు చేసేవాడిని. వంటల పుస్తకం చూసి రవ్వలడ్లు కూడా చేశా. ఇక్కడ అంత సమయం ఉండట్లేదు. నాకు రెండుజడల అమ్మాయిలంటే ఇష్టం. మా అమ్మాయి అంటే కూడా చాలా ఇష్టం. తను లిటిల్‌ సోల్జర్స్‌లో చేసింది.


భవానిగారు రాకముందు మీరు రెండుజడల కోసం వెతకలేదా?

వెతికాం.. కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. వాళ్లకు నేను నచ్చకపోవడం.. ఇలాంటివి. పిట్టకథలు లేకపోతే గురవారెడ్డి లేడు. ముగ్గురినో నలుగురినో చేసుకోవాలనుకుంటే అదృష్టవంతులు కాబట్టి తప్పిపోయారు.


మీ లక్ష్యం ఏంటి?

కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా బాగుంటాయి అనిపించేలా సన్‌షైన్‌ని తీర్చిదిద్దడం. అందరూ దీన్ని నమ్మగలిగేలా రూపొందించడం.

Updated Date - 2020-02-08T00:02:21+05:30 IST