కేసుల మీద కేసులు పెరగబోతున్నాయి.. అమెరికన్లు సిద్దం కావాలి: డాక్టర్ ఆంథనీ ఫౌచీ

ABN , First Publish Date - 2020-11-30T07:20:45+05:30 IST

థ్యాంక్స్ గివింగ్ కారణంగా అమెరికాలో మహమ్మారి వ్యాప్తి చెందిందని.. మరికొద్ది రోజుల్లో కేసుల మీద కేసులు బయటపడనున్నట్టు

కేసుల మీద కేసులు పెరగబోతున్నాయి.. అమెరికన్లు సిద్దం కావాలి: డాక్టర్ ఆంథనీ ఫౌచీ

వాషింగ్టన్: థ్యాంక్స్ గివింగ్ కారణంగా అమెరికాలో మహమ్మారి వ్యాప్తి చెందిందని.. మరికొద్ది రోజుల్లో కేసుల మీద కేసులు బయటపడనున్నట్టు అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా లక్షలాది అమెరికన్లు దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేసి తిరిగి ఇళ్లకు చేరుకున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందిందని.. అమెరికన్లు పెరగనున్న కేసులకు సిద్దంగా ఉండాలని ఆంథనీ ఫౌచీ చెప్పారు. కేసుల్లో పెరుగుదల రెండు మూడు వారాల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రజలను భయపట్టేందుకు చెప్పడం లేదని.. ఇది వాస్తవమని ఆంథనీ ఫౌచీ అన్నారు. ఇప్పటికే మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతోంటే మరికొద్ది రోజుల్లో క్రిస్ట్‌మస్ సెలవులు కూడా ఉండటం ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. కరోనా బారిన పడి అమెరికాలో 2.66 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా ఫార్మా సంస్థలు తాము తయారు చేసిన వ్యాక్సిన్ వైరస్‌పై దాదాపు 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నివేదికలు ఇచ్చాయి. ఫైజర్ సంస్థ ఇప్పటికే వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అధికారానికి కూడా దరఖాస్తు చేసుకుంది. బెల్జియమ్‌లోని ఫైజర్ ల్యాబ్ నుంచి ఇప్పటికే మొదటి షిప్‌మెంట్లు కూడా అమెరికా చేరుకున్నాయి. డిసెంబర్ 10న ఎఫ్‌డీఏ వ్యాక్సిన్ అప్రూవల్‌పై సమావేశం కానుంది. ఒకవేళ ఫైజర్ వ్యాక్సిన్‌కు అప్రూవల్ లభిస్తే డిసెంబర్ 11 నుంచి అమెరికన్లకు వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తారు. డిసెంబర్ నెలలో నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2020-11-30T07:20:45+05:30 IST