పునీత్ మృతిపై ఫేక్ Whatsapp పోస్ట్.... డాక్టర్ దేవిషెట్టి ఖండన

ABN , First Publish Date - 2021-10-31T01:21:19+05:30 IST

కన్నడ ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన తర్వాత నారాయణ హెల్త్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

పునీత్ మృతిపై ఫేక్ Whatsapp పోస్ట్.... డాక్టర్ దేవిషెట్టి ఖండన

బెంగళూరు: కన్నడ ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన తర్వాత నారాయణ హెల్త్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ దేవిషెట్టి పేరుతో వాట్సాప్ పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.


పునీత్ సహా చాలామంది సెలబ్రిటీలు ఫిట్‌గా ఉండేందుకు ‘చాలా ఎక్కువగా’ వ్యాయామాలు చేస్తున్నారని, వారి మరణానికి కారణం అదేనని డాక్టర్ దేవిషెట్టి చెప్పినట్టుగా ఉంది. వైరల్ అవుతున్న ఈ పోస్టుపై తాజాగా డాక్టర్ దేవిషెట్టి స్పందించారు. అది పూర్తిగా ‘పేక్’ అని కొట్టిపడేశారు. తనపేరును ఉపయోగిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


వాట్సాప్‌లో తిరుగుతున్న ఆ పోస్టులో.. ‘‘గత కొన్ని సంవత్సరాలలో నాకు వ్యక్తిగతంగా తెలిసిన 8, 9 మందిని కోల్పోయాను. వీరిలో కొందరు సెలబ్రిటీలూ ఉన్నారు. 40 ఏళ్ల వయసులో ఉన్నవారు మరింత ఫిట్‌గా కనిపించేందుకు తీవ్ర వ్యాయామాలు చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇలాంటి వారు ఫిట్‌గా, సిక్స్‌ప్యాక్‌తో మాత్రమే బయటికి కనిపిస్తారు. ఇప్పుడీ జాబితాలోకి పునీత్ రాజ్‌కుమార్ కూడా వచ్చి చేరాడు’’ అని ఉంది. 


‘‘జీవితంలో దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. జీరోగా ఉండడం కానీ, అలాగని 100శాతంగా ఉండడం కూడా సరైనది కాదు. ఓ మోస్తరు వ్యాయామం సరిపోతుంది. 20 నిమిషాలు చాలు. మన పూర్వీకులు ఏం తిన్నారో అవే తింటే సరిపోతుంది. కీవీలు, ఆలివ్ ఆయిల్ కాదు. ఏడు గంటలు నిద్రపోవాలి. శరీరానికి గౌరవం ఇవ్వాలి.. స్టెరాయిడ్లు కాదు. 40 ఏళ్లు వచ్చేసరికి శరీరంలో బోల్డన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. 50 ఏళ్లకి మరింతగా పెరుగుతాయి.


60 ఏళ్లు వచ్చేసరికి శరీరం నెమ్మదిస్తుంది. 70 ఏళ్ల వయసులో శరీరంలో షట్‌డౌన్ ప్రారంభమవుతుంది. 80 ఏళ్లకు పైగా అంటే అది బోనస్ అనే చెప్పుకోవాలి. రిటైర్మెంట్ అందుకే. గతంలో మీరు అనుభవించిన ఒత్తిడిని శరీరం, మనసు భరించలేవు. బయటకు మాత్రం అందంగానే కనిపిస్తారు. అందుకు జన్యవులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. కానీ లోపలి అవయవాలు మాత్రం వృద్ధాప్యాన్ని సంతరించుకుంటాయి’’ అని ఆ వాట్సాప్ మెసేజ్ సారాంశం. అంతేకాదు.. మీరు 40 ఏళ్లు పైబడిన వారైతే ఇది చదవండి. పైన చెప్పినవి కాకుండా మరేదైనా చేస్తుంటే వెంటనే మార్చుకోండి’.. ధన్యావాదాలు అని ముగించారు. 


వాట్సాప్‌లో తిరుగుతున్న ఈ మెసేజ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఫేక్ మెసేజ్ అని డాక్టర్ దేవిషెట్టి వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-10-31T01:21:19+05:30 IST