‘నార్త్‌-ఈస్ట్‌ అమ్మాయివా?’ అని అడుగుతుంటారు

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

బ్రిటన్‌ అబ్బాయినీ, వియత్నాం అమ్మాయినీ ప్రేమ కలిపింది... సంక్రాంతి పండగకు తెలుగిళ్ళకు చుట్టాలు వచ్చినట్టు... ఉద్యోగరీత్యా భారతదేశం వచ్చిన ఆ జంటకు

‘నార్త్‌-ఈస్ట్‌ అమ్మాయివా?’ అని అడుగుతుంటారు

బ్రిటన్‌ అబ్బాయినీ, వియత్నాం అమ్మాయినీ ప్రేమ కలిపింది...

సంక్రాంతి పండగకు తెలుగిళ్ళకు చుట్టాలు వచ్చినట్టు...

ఉద్యోగరీత్యా భారతదేశం వచ్చిన ఆ జంటకు 

మన నేలతో బంధం బలపడింది.

తమ రుచులు, అభిరుచులు, లైఫ్‌ స్టైల్‌, 

లాక్‌డౌన్‌ కాలాన్ని గడిపిన తీరు... 

ఇలా ఎన్నో విషయాలను దక్షిణాది రాష్ట్రాల 

బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌గా ఉన్న

డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, 

ఆయన భార్య వనితా ఫ్లెమింగ్‌ 

నవ్యతో ప్రత్యేకంగా పంచుకున్నారు.


భారతదేశం ఎలా ఉంది... ఇక్కడేం నచ్చాయి?

వనిత ఒక్కటని చెప్పలేను. ఎన్నో ఉన్నాయి. నా దృష్టిలో ప్రతి దేశం ప్రత్యేకమైనదే. ప్రతి దేశంలో ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. అయితే నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం. ఇక్కడ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు.  భారతదేశంలో మహిళల చీరకట్టు నాకు బాగా నచ్చింది. అదేంటో... చాలామంది నన్ను చూసి ‘నువ్వు ఈశాన్య రాష్ట్రాల (నార్త్‌- ఈస్ట్‌) అమ్మాయివా?’ అని అడుగుతుంటారు. మా దేశ సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటాయి.


ఏళ్ల క్రితం మా పూర్వీకులు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునేవారు. ఇప్పటికీ చాలావరకు ఆరెంజ్డ్‌ మ్యారెజ్‌స్‌ జరుగుతున్నాయి. మా దేశంలోనూ ఉమ్మడి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. బుద్ధుడి సిద్ధాంతాలను ఆచరించడమూ ఉంది. భారతదేశం, వియత్నాం సంస్కృతుల మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది.


మరి హైదరాబాద్‌...

వనిత హైదరాబాద్‌ ఫుడ్‌ నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడి పండుగలు, సంస్కృతి, పురాతన కట్టడాలు... ఎలా నచ్చేవి ఎన్నెన్నో...


ఆండ్రూ 1998లో మొదటిసారి భారతదేశానికి వచ్చాను. కశ్మీర్‌, లద్ధాఖ్‌, సిమ్లా, కేరళ, మైసూర్‌ వంటి సుందరమైన ప్రదేశాలు చూశాను. నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చిన కొత్తలో... 2016 డిసెంబర్‌లో అనుకుంటా ఒకసారి హైదరాబాద్‌ వచ్చాను. గత కొన్నాళ్లుగా ఇండియాలో పర్యటిస్తున్నా. అయితే హైదరాబాద్‌ చాలా ప్రత్యేకమైన నగరం. ఇక్కడ కనిపించే వైవిధ్యం, సంప్రదాయం, సంస్కృతి ప్రపంచంలోని ఏ నగరంలోనూ నేను చూడలేదు. 


దౌత్యవేత్త భార్యగా ఉండడం కష్టంగా అనిపిస్తుందా!

వనిత ఈ రకమైన జీవితాన్ని నేను ఎంతో ఎంజాయ్‌ చేస్తాను. ఎందుకంటే ప్రతి మూడేళ్లకు మేము ఒక దేశం వెళతాం. ఆ దేశ ప్రజల సంస్కృతి, జీవనవిధానం, వేషభాషలు... ఇలా చాలా విషయాలు నేర్చుకుంటాను. ఇలాంటి జీవితం నాకు లభించినందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.. ఇదంతా దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా.  


లాక్‌డౌన్‌ సమయంలో ఎలా గడిపారు...

వనిత సాధారణంగా నేను బిజీగా ఉంటాను. నా భర్త ఉదయాన్నే ఆఫీసుకు వెళతారు. సాయంత్రం అయ్యాక గానీ రారు. ఇద్దరం కలిసి సరదాగా గడిపేందుకు సమయం ఉండేది కాదు. అయితే లాక్‌డౌన్‌ కాలాన్ని ఇద్దరం బాగా ఆస్వాదించాం. ఫ్యామిలీ టైమ్‌ను ఎంతో ఎంజాయ్‌ చేశాం. నా భర్త రోజంతా నా ఎదుటే ఉండడం ఎంతో సంతోషంగా అనిపించింది.


ఆండ్రూ వనిత చెప్పినట్టు మేం చాలా ఎంజాయ్‌ చేశాం. చాలామంది గృహిణులు లాక్‌డౌన్‌ సమయంలో గృహహింసకు గురయ్యారనీ, దంపతుల మధ్య గొడవలు తలెత్తాయనీ వార్తలు చూశాం. మా మధ్య అలాంటివేవీ ఉండవు. 16 ఏళ్ల అన్యోన్యమైన వైవాహిక జీవితం మాది. లాక్‌డౌన్‌ సమయంలో మరింత ఎక్కువగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ సంతోషంగా గడిపాం. కరోనాకు ముందు ఎంతోమందిని కలుసుకునేవాళ్లం. కరోనా కేసులు పెరిగిన తరువాత  జనానికి దూరంగా ఉంటూ, జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. కేసులు తగ్గిన తరువాత తిరిగి అందరినీ కలవడం మొదలెట్టాను.


అయితే రక్షణ జాగ్రత్తలు తప్పనిసరిగా, కఠినంగా తీసుకొనేవాణ్ణి. కరోనా వచ్చాక ప్రజలు ఇంతకు ముందెన్నడు చేయని పనులు చేయడం మొదలుపెట్టారు. నేను జూమ్‌ లాంటి వీడియో కాలింగ్‌ యాప్స్‌ గురించి అంతకుముందు ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పడు అవి నా జీవితంలో భాగమయిపోయాయి.


మరి పిల్లల్ని ఎలా ఎంగేజ్‌ చేశారు...

వనిత అది నిజంగా చాలా కష్టమైన సమయం. కానీ తల్లిదండ్రులుగా పిల్లలకు ఏది ముఖ్యమో మాకు తెలుసు. మా పిల్లలు డల్‌గా, బోర్‌గా ఫీలయినప్పుడు వారిని పార్క్‌కు, సైక్లింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అప్పుడప్పుడు టెన్నిస్‌ ఆడించేదాన్ని. వారిని ఒక్కోసారి మా పెంపుడు కుక్కతో సరదాగా వ్యాయామానికి తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడిప్పుడే మా పిల్లలను స్నేహితులతో కలిసేందుకు అనుమతించాం. నాకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. అవి కూడా నన్ను ఎంతో ఇష్టపడతాయి. వాటితో ఎక్కువ సమయం గడుపుతాను. మా పిల్లలను కూడా పెంపుడు కుక్కలతో కొంత సమయం గడపాలని చెబుతాను.


మీ అభిరుచులేమిటి? తీరిక దొరికితే ఏం చేస్తారు?

వనిత నా హాబీల లిస్ట్‌ చాలా పెద్దది.  సంగీతం నేర్చుకుంటున్నా. వయోలిన్‌ చక్కగా వాయిస్తాను. యోగా చేస్తాను. టెన్నిస్‌, కుకింగ్‌, ఫొటోగ్రఫీ.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే నాకు ఫొటోగ్రఫీ ఇష్టం. ఫిక్షన్‌ పుస్తకాలు ఎక్కువగా చదువుతా. కొన్నిసార్లు కబడ్డీ, క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తాను. భారతదేశ ప్రజల గురించి తెలుసుకోవడమన్నా, ఇక్కడి వారితో సమయం గడపడమన్నా ఇష్టం. అంతేకాదు, నేను వివిధ రకాల వంటకాలు వండుతాను. మా దేశంలో ఫ్రైడ్‌ రైస్‌ ఎక్కువగా తింటారు. ఇండియన్‌ ఫుడ్‌లో టేస్టీగా, స్పైసీగా ఉండే బిర్యానీ అంటే ఇష్టం. అన్నం కూడా తింటాను. నేను బిర్యానీ రుచిగా వండుతాను కూడా. మా ఆయన కాక్‌టైల్‌, డ్రింక్స్‌ బాగా మిక్స్‌ చేస్తారు.


తెలుగు సినిమాలు చూస్తారా?

వనిత పెద్దగా చూడలేదు. అయితే, క్రికెటర్‌ మిథాలీరాజ్‌ పదేపదే చెప్పడంతో ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా చూశాను.





చాలామంది గృహిణులు లాక్‌డౌన్‌ సమయంలో గృహహింసకు గురయ్యారనీ, దంపతుల మధ్య గొడవలు తలెత్తాయనీ వార్తలు చూశాం. మా మధ్య అలాంటివేవీ ఉండవు. 16 ఏళ్ల అన్యోన్యమైన వైవాహిక జీవితం మాది. లాక్‌డౌన్‌ సమయంలో మరింత ఎక్కువగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ సంతోషంగా గడిపాం.’



నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం. ఇక్కడ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు.  భారతదేశంలో మహిళల చీరకట్టు నాకు బాగా నచ్చింది. అదేంటో... చాలామంది నన్ను చూసి ‘నువ్వు ఈశాన్య రాష్ట్రాల (నార్త్‌- ఈస్ట్‌) అమ్మాయివా?’ అని అడుగుతుంటారు. మా దేశ సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటాయి.


సివిఎల్‌ఎన్‌, ఫొటోలు: లవకుమార్‌

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST