Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 14 Apr 2021 20:37:06 IST

సంస్కృతం జాతీయ అధికార భాష కావాలనేది అంబేద్కర్ ప్రతిపాదన : సీజేఐ

twitter-iconwatsapp-iconfb-icon
సంస్కృతం జాతీయ అధికార భాష కావాలనేది అంబేద్కర్ ప్రతిపాదన : సీజేఐ

న్యూఢిల్లీ : జాతీయ అధికార భాషగా సంస్కృతాన్ని అమలు చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించారని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. ప్రాచీన భారత దేశంలోని న్యాయ శాస్త్రం అరిస్టాటిల్, పర్షియన్ తర్కానికి ఇసుమంతైనా తక్కువైనది కాదన్నారు. మన పూర్వీకుల మేధాశక్తి నుంచి మనం లబ్ధి పొందడం మానుకోవడానికి కారణం ఏదీ కనిపించడం లేదన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం కోవిడ్-19 నిబంధనల ప్రకారం వర్చువల్ పద్ధతిలో జరిగింది.


ప్రజలకు కావలసినది ఏమిటో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు బాగా తెలుసునని జస్టిస్ బాబ్డే చెప్పారు. ఆయన రాజకీయ, సాంఘిక సమస్యలను అర్థం చేసుకున్నారని తెలిపారు. అధికారిక జాతీయ భాషగా సంస్కృతాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారని చెప్పారు. అరిస్టాటిల్, పర్షియన్ విధానంలోని తర్కం కన్నా మన పూర్వీకులు రాసిన న్యాయశాస్త్రం కొంచెమైనా తక్కువైనది కాదని తెలిపారు. మన పూర్వీకుల మేధాశక్తి నుంచి మనం లబ్ధి పొందడం మానుకోవడానికి, దానిని వదిలిపెట్టడానికి, పట్టించుకోవడం మానేయడానికి తగిన కారణం ఏదీ లేదన్నారు. 


డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనను జస్టిస్ బాబ్డే గుర్తు చేసుకున్నారు. ‘‘ఈరోజు ఉదయం నేను ఏ భాష గురించి మాట్లాడాలనే విషయంపై సందిగ్ధంలో పడ్డాను. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఇది నాకు గుర్తు చేస్తున్నదేమిటంటే, మాట్లాడేటపుడు ఉపయోగించవలసిన భాష, పని చేసేటపుడు వాడవలసిన భాష మధ్య సంఘర్షణ చాలా పాతదే’’ అని పేర్కొన్నారు. 


సబార్డినేట్ కోర్టుల్లో వాడవలసిన భాష ఏదో చెప్పాలని సుప్రీంకోర్టుకు చాలా వినతులు వస్తూ ఉంటాయన్నారు. ఈ విషయంపై పరిశీలన జరగడం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ ఈ పార్శ్వాన్ని ముందుగానే ఊహించారని చెప్పారు. సంస్కృతం యూనియన్ ఆఫ్ ఇండియా అధికారిక భాష కావాలని ప్రతిపాదించారన్నారు. ఈ ప్రతిపాదనపై కొందరు మౌల్వీలు, పండిట్లు, మత పెద్దలు, అంబేద్కర్ సంతకాలు చేశారని, అయితే ఇది రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారో, లేదో తనకు గుర్తు లేదని తెలిపారు. 


‘‘ఉత్తరాదిలో తమిళం అంగీకార యోగ్యం కాదు కాబట్టి, దానిని వ్యతిరేకిస్తారని, అదేవిధంగా హిందీని దక్షిణాధిలో వ్యతిరేకిస్తారని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. సంస్కృతానికి ఉత్తరాది, దక్షిణాదిలలో వ్యతిరేకత ఉండే అవకాశం తక్కువ ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన ఆ ప్రతిపాదన చేశారు, కానీ ఇది విజయవంతం కాలేదు’’ అని సీజేఐ చెప్పారు. 


దేశ ప్రజలకు, పేదలకు ఏం కావాలో డాక్టర్ అంబేద్కర్‌కు తెలుసునన్నారు. ఈ పార్శ్వాలన్నిటి గురించి ఆయనకు పరిపూర్ణంగా తెలుసునన్నారు. అందుకే ఆయన ఈ ప్రతిపాదన చేశారని అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. 


లా స్కూల్ అంటే నర్సరీలాంటిది

న్యాయ శాస్త్రాన్ని బోధించే కళాశాల అనేది నర్సరీ వంటిదని, ఇక్కడి నుంచే లీగల్ ప్రొఫెషనల్స్, జడ్జీలు వస్తారని సీజేఐ చెప్పారు. మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ వల్ల అనేక మంది కలలు నిజమవుతాయన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు జాతీయ దృక్పథాన్ని బోధిస్తారన్నారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చినవారు ఇక్కడ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రాంతీయతత్వం, సంకుచిత భావాలు వంటివేవీ ఇక్కడ లేవన్నారు. 


ఈ విశ్వవిద్యాలయంలో రెండు విశిష్టమైన కోర్సులను బోధిస్తారని చెప్తూ, జడ్జీలను తయారు చేసే నేషనల్ డిఫెన్స్ అకాడమీ తరహా కోర్సు ఒకటి కాగా, మరొకటి న్యాయశాస్త్రమని వివరించారు. లాజిక్‌ను ఉపయోగించే బ్రిటిష్ వ్యవస్థ నుంచి మన దేశ న్యాయ వ్యవస్థను రూపొందించారని చెప్పారు. లాజిక్‌కు మూలం అరిస్టాటిల్ అని చెప్పారు. భారత దేశంలో అభివృద్ధి చెందిన న్యాయశాస్త్రం అరిస్టాటిల్, లాజిక్‌కు సంబంధించిన పర్షియన్ వ్యవస్థకు కొంచెమైనా తక్కువైనది కాదని వివరించారు. మన పూర్వీకుల మేధాశక్తి నుంచి మనం లబ్ధి పొందకపోవడానికి, దానిని పట్టించుకోకుండా వదిలేయడానికి తగిన కారణమేదీ తనకు కనిపించడం లేదన్నారు. అందుకే ఈ కోర్సును ప్రారంభించారని, ఇది చాలా విశిష్టమైనదని తెలిపారు. 


జస్టిస్ బాబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా తెలుగు తేజం జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.